ముందుగా ఓ వార్త చదవండి… మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీకు ఎక్కడో పది భూతద్దాలు వేసుకుని వెతికితే కనిపించవచ్చు… ‘‘కైకలూరు… ఓ సాధారణ రైతు వేషం వేశాడు సబ్ కలెక్టర్… ఎరువుల షాపులకు వెళ్లాడు… ముందుగా ఒక ఓ దుకాణంలోకి వెళ్లాడు… సేటూ, ఫలానా ఎరువులు కావాలి… అక్కడ స్టాక్ ఉంది, కానీ సదరు వ్యాపారి, ఆ ఎరువులు లేవు అన్నాడు… అక్కడి నుంచి మరో షాపుకి వెళ్లాడు… అడిగిన ఎరువులు అన్నీ ఇచ్చాడు… కానీ గరిష్ట ధరకన్నా ఎక్కువ వసూలు చేశాడు… ఆ సొమ్ముకు బిల్లు ఇవ్వాలని కోరితే ఫోఫోవోయ్ అన్నాడు… అక్కడి నుంచే ఒక్కొక్క అధికారికీ ఫోన్లు చేశాడు సదరు సబ్ కలెక్టర్… ఎరువులు లేవన్న షాపు, బిల్లు ఇవ్వనుపో అన్న షాపుల్ని సీజ్ చేయించాడు… అక్కడి నుంచి ఆ అధికారులతో కలిసి ముదినేపల్లి ఎరువుల షాపులన్నీ తిరిగాడు… బహుశా ఈ సబ్ కలెక్టర్ తనిఖీలు తెలిసి మూసేశారేమో… ఒక షాపు మూసి ఉంది… అక్కడి రైతుల్ని అడిగాడు… ఆ ఎరువుల ధరల్ని చెప్పారు రైతులు… ఆ వ్యాపారి మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు ఆ సబ్ కలెక్టర్..’’
నిజానికి ఓ సినిమాటిక్ వార్త… ఆ సబ్ కలెక్టర్ పేరు సూర్యసాయి ప్రవీణ్ చంద్… సాయి అనే పదం వినగానే మీకు అర్థమైపోయి ఉండాలి… అవును, అచ్చంగా ఓ తెలుగు ఆఫీసరే… ఐఐటీ పాట్నాలో చదివాడు… ప్యూర్ తెలుగు ఐఏఎస్ అధికారి… ఓ సాధారణ రైతు వేషంలో ఎరువుల షాపులకు వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు చేయడం అనేది ఒక కోణంలో ప్రాధాన్యమున్న వార్త… మరో కోణంలో లైట్… ఎందుకంటే..? అదే వేషం ఎవరైనా మంత్రి లేదా ఎమ్మెల్యే వేసి ఉంటే ధూంధాం, టాంటాం చేసి ఉండేవి పత్రికలు టీవీలు… కానీ సబ్ కలెక్టర్ కదా… పెద్దగా పట్టించుకోలేదు, ఏదో ఇస్తినమ్మ వాయినం తరహాలో వార్తలు రాసింది మెయిన్ స్ట్రీమ్ మీడియా… అంతేకదా మరి… ఓ తెలుగుదేశం ఎమ్మెల్యే అలా చేసి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ధూం తడాఖా అన్నట్టుగా రాసిపారేసేవి… ఆంధ్రజ్యోతి అయితే ఫస్ట్ పేజీలో వార్త, ఫోటో కుమ్మేసేది… అదే వైసీపీ ఎమ్మెల్యే అయితే సాక్షికి పండుగ…
Ads
నిజంగా ఇది చిన్న వార్తేనా..? కాదు… 1) ఒరే ఐఏఎస్సులూ, ఐపీఎస్సులూ కాస్త జనంలోకి తిరగండర్రా అని చెప్పే వార్త ఇది… 2) ఫీల్డ్ పరిస్థితులు ఏమిటో స్వయంగా తెలుసుకోవడానికి ఎంత మంచి ఉదాహరణ ఈ వార్త… 3) రైతులే కాదు, ఇతర సమస్యల మీద కూడా ఇలాగే వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండర్రా అని ఉన్నతాధికారులందరికీ బుద్ధి చెప్పే వార్త… 4) పర్లేదు, మా గురించి కూడా ఆలోచించే అధికారులున్నారు అని జనంలో ఈ వ్యవస్థల విశ్వాసాన్ని ప్రోది చేసే వార్త… 5) సహజంగానే మిగతా వ్యాపారుల్ని అలర్ట్ చేసే వార్త, జాగ్రత్తగా ఉంచే వార్త, ఏమో, నేతలపై ఒత్తిడి తెచ్చి, సదరు అధికారిని అక్కడి నుంచి తరిమేసే వార్త… ఆఫ్టరాల్, ఏ ప్రభుత్వం ఇలాంటివి సహిస్తుంది గనుక… 6) ఇప్పటికే సదరు సాయి ప్రవీణ్‌కు అక్షింతలు పడితే ఆశ్చర్యపడనక్కర్లేదు…
డోన్ట్ ఫీల్ ప్రవీణ్… నీ స్పిరిట్ వృథా కాలేదు… మెయిన్ స్ట్రీమ్‌కు పట్టకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిపోయావ్ ఇప్పుడు… అల్టిమేట్‌గా ఆ వ్యాపారులపై మనం సాధించేది ఏమీ ఉండదు… రెండు రోజులకు అంతా సెట్ రైట్… పరిస్థితి యథాతథం… దోపిడీ యథాతథం… కానీ బ్యూరోక్రసీకి ఓ కొత్త పాఠం చెప్పావు… కాస్త ఫీల్డు మీదకు వెళ్లండర్రా అని చెప్పావు… కానీ సిస్టం మారిపోదు భయ్యా… ఎందుకో చెప్పనా..?! ప్రతిదీ రాజకీయంతో ముడిపడిపోయింది… దరిద్రంగా…!! అప్పట్లో ఓ తెలంగాణ కలెక్టర్ పొద్దున్నే ఇలాగే ఓ మోటార్ సైకిల్ మీద ఓ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు… తిరిగాడు, చూశాడు… ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులు ఎంత దరిద్రంగా వ్యవహరిస్తారో అర్థం చేసుకున్నాడు… ఢాంఢీం అన్నాడు, ఏమైంది… ఆయన వెళ్లిపోయాక అంతా సేమ్… యూనియన్లు, పొలిటిషియన్లు, లోకల్ మీడియాను అర్థం చేసుకోలేకపోయాడు… ఇప్పుడూ అంతే… ప్రవీణ్ యువ ఐఏఎస్ కదా, ఇంకా లోకం పోకడ తెలియనట్టుంది… ఒకవేళ తను కమ్మ అయితే ఇక చూసుకొండి, చంద్రబాబు ఉసిగొల్పిన అధికారి, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి పూనుకున్నాడు అంటారు… రచ్చ రచ్చ… రెడ్డి అయితే పర్లేదు, ప్రస్తుతానికి… వేరే కులం అయితే అసలు ఆ కుటుంబం ఏ పార్టీ, ఏ కులం గట్రా వివరాలు అర్జెంటుగా సేకరించండర్రా…!!
Share this Article