నిన్ననే కదా, కేరళ హైకోర్టుకు వచ్చిన ఓ కేసు గురించి మాట్లాడుకున్నాం… అంగప్రవేశం జరిగితేనే అత్యాచారం కిందకు లెక్క అంటాడు నిందితుడు… తొడలకు నా పురుషాంగం తాకితే అది రేప్ కాదు అంటాడు… ఛట్, మూసుకో, అనుచిత లైంగిక వాంఛతో చేసే ప్రతి పనీ లైంగిక దాడే అంటూ హైకోర్టు తేల్చేసింది… అలాగే ‘చర్మ స్పర్శ’ జరగకపోతే అది లైంగిక దాడే కాదు అని ఓ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఏకంగా సుప్రీం విచారణ జరుపుతోంది… చట్టాలకు సొంత బాష్యాలు చెబుతూ, ఆయా చట్టాల స్పూర్తిని మలినం చేయడానికి జరిగే ప్రయత్నాల మీద డిబేట్స్ జరగాలనే అందరి కోరిక… ఇప్పుడు మరో కేసు చదవండి… ఇది ఉత్తరాఖండ్ కేసు… ‘‘నేను ప్రెగ్నెంట్ అవ్వాలి. నా భర్తని బెయిల్ మీద జైలు నుంచి పంపించండి…’’ అని ఓ మహిళ కోర్టుకెక్కింది… షాకింగ్‌గా ఉందా..? మీరు చదివింది నిజమే… ఏకంగా రాష్ట్ర హైకోర్టును ఇదే అంశంపై ఆశ్రయించింది…
కేసు ఏమిటంటే..? సచిన్ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్‌పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు… పోలీసులు కేసు పెట్టారు… కోర్టులో విచారణలు జరిగాయి… మొత్తం ఆ గ్యాంగ్‌కూ 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు… సో, ఇక్కడి వరకూ ఓ పద్దతి ప్రకారమే సాగింది… తరువాత అప్పీల్‌కు వెళ్లినట్టున్నారు… రెండుసార్లు బెయిల్ దరఖాస్తు పెడితే ఇదే కోర్టు తిరస్కరించింది… ఇప్పుడిక ఈ పిటిషన్… ఇదీ బెయిల్ పిటిషనే, కానీ ‘‘సంతానం పొందే భార్య హక్కు’’ ప్రకారం భర్తకు బెయిల్ ఇవ్వండి అంటోంది… ‘‘నాకు మాతృత్వంలోని మాధుర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంది, భార్యగా అది నా హక్కు… సో, జైలు నుంచి కొంతకాలమైనా నా భర్తను బయటికి పంపించండి… షార్ట్ టరమ్ బెయిల్ అయినా సరే…’’ ఇదీ ఆమె కోరిక… అదే పిటిషన్ వేసింది… ఇది అనూహ్యమైన కేసు… మామూలుగా మన తీర్పులు చట్టాలకు లోబడి, పాత తీర్పుల ఉదాహరణలకు లోబడి ఉంటాయి కదా… ఆమెది న్యాయమైన హక్కేనా..? అసలు అది హక్కేనా..? రీప్రొడక్టివ్ రైట్స్ మన రాజ్యాంగం కల్పించిందా..? గతంలో ఏమైనా కేసులున్నాయా..? అని అయోమయంలో పడిపోయింది… మీరేమైనా సాయం చేయగలరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది… మన దేశం కాకపోతే, ఇతర దేశాల్లో ఇలాంటి పిటిషన్లు పడ్డాయా..? పడితే వెలువడిన తీర్పులు ఏమిటి..? అని సెర్చ్ చేస్తున్నారు… ఇక్కడ ఓసారి సీన్ కట్ చేద్దాం…
Ads
అసలు ఈ బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించడం కరెక్టేనా అనేది ప్రాథమిక ప్రశ్న… ఎందుకంటే..? భర్త, భార్య సాధారణ పరిస్థితుల్లో సంసారం చేస్తే, వాళ్ల దేహాలు అనుకూలిస్తే పిల్లలు పుడతారు… అంతే… అదేమీ హక్కు కాదు… దానికి చట్టాలో, ప్రభుత్వాలో, కోర్టులో పూచీపడవు… ఇక్కడ ఈ కేసులో భర్త ఓ నీచమైన నేరంలో శిక్షపడి, జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీ… ‘‘పోరా నాయనా, పోయి నీ పెళ్లాంతో కొన్నాళ్లు సంసారం చేయి, నీకూ పిల్లల్ని కనే హక్కుంది’’ అని బెయిల్ ఇచ్చి వదిలేయాలా..? తనలోని ఆ నేరగాడు మళ్లీ జడలు విప్పుకుంటే, ఇంకేదో జరిగితే ఎవరు జవాబుదారీ..? పోనీ, సాధారణ స్థితిలో పిల్లలు పుట్టకపోతే ఎవరిది బాధ్యత..? ఇది సరే.., రేప్పొద్దున ఇంకేదో కేసులో తల్లిదండ్రులు తమ కొడుకును వదిలేయండి, మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత వాడిది, వాడితో ఈ వయస్సులో మేం సేవలు చేయించుకోవడం మా హక్కు అని వాదిస్తే..? లేదా ఏ ఖైదీ పిల్లలో మా నాన్నను వదిలేయండి, మా పోషణ తన బాధ్యత కాదా..? మాకు హక్కు లేదా అని ఓ పిటిషన్ వేస్తే..? అసలు దీనికి ఇక అంతెక్కడ..? మానసిక పరివర్తన, చేసిన నేరానికి శిక్ష అనుభవించడమే కదా మనం వేసే శిక్షల పరమార్థం… మరిక రకరకాల కారణాలతో బయటికి వదిలేస్తే… ఆ విచారణలు, ఆ శిక్షలకు సార్థకత ఏముంటుంది..? ఆ బెయిళ్లకు అర్థమేముంటుంది..? మరి ఇలాంటి కేసులు మీడియాలో ఎందుకు కవరేజీకి నోచుకోవడం లేదు… నిజంగా ఈ వార్తకు ప్రాధాన్యమే లేదా..?
ఇక్కడ ఓ సంగతి చెప్పుకుందాం… శిక్ష అనుభవించే ఖైదీలకు సంబంధించి పెరోల్… అంటే… ఓ తప్పనిసరి అవసరం కోసం కొద్దిరోజులు బయటికి వదిలేయడం… ఆయా ఖైదీల కుటుంబసభ్యుల పెళ్లిళ్లు, అంత్యక్రియలు వంటి కీలక సందర్భాలకు పెరోల్ ఇస్తుంటారు… ఇది హక్కేమీ కాదు… జైలు అధికారుల దయ, ఖైదీల ప్రాప్తం… మరో చాన్స్ ఉంది… ఫర్లాఫ్… దీర్ఘకాలం జైలులో ఉంటే తన సామాజిక బంధాలు, కుటుంబ బంధాలు దెబ్బతినిపోతాయి కాబట్టి, ఓ హక్కుగా కొంతకాలం బయటికి వచ్చి గడిపేందుకు వీలున్న రూల్ ఇది… కానీ ఈ కేసులో తను బెయిల్ అడుగుతోంది… సో, పెరోల్ గానీ, ఫర్లాఫ్ గానీ కాదు… కన్విక్టెడ్, అప్పీల్ వంటి కేసుల్లో బెయిల్ ఇవ్వడానికి ప్రాతిపదికలు ఏమిటి..? ఏ రూల్స్ వర్తిస్తాయి..? ఇవ్వొచ్చా..? పరిమితులు ఏమిటి..? సుప్రీం క్లియర్ కట్ మార్గదర్శకాల్ని జారీ చేయాల్సిన అవసరం ఏదో కనిపిస్తోంది…!!
Share this Article