………… By…….. Abdul Rajahussain………………….. (ఆగస్టు 9…. రంగస్థల, బుల్లితెర, వెండితెర నటుడు, దర్శకుడు, వ్యాఖ్యాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు )……. * గిలిగింతలు పెట్టే హాస్యానికి వరం..” ధర్మవరపు సుబ్రహ్మణ్యం. “! పరిచయం అక్కర్లేని పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. హాస్యానికి ఆయన కేరాఫ్. ప్రకాశం జిల్లాలోని ‘కొమ్మునేని’ వారి పల్లెలో జన్మించాడు. ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాల మీద మోజుండేది. రేడియోలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆతర్వాత ప్రజానాట్యమండలి తరపున ఎన్నో నాటకాల్లో నటించారు. మొదటి నుంచి ఆయనకు హాస్యమంటే ఇష్టం. అందుకే నాటకాల్లో కూడా హాస్యపాత్రలే వేసేవారు. స్క్రిప్టులు కూడా రాసేవారు. ఇక మొదటి సారిగా… “అనగనగా ఒక శోభ ” అనే ధారావాహికకు కథ రాశారు. ఆనందోబ్రహ్మ అనే హాస్య సీరియల్ దూరదర్శన్ లో ధారావాహికంగా ప్రసారమైంది.. ఈ సీరియల్తో నటుడిగా ధర్మవరపు బాగా పాపులర్ అయ్యారు. దీనికి కథ కూడా ఆయనే రాయడం విశేషం. ధర్మవరపు కేవలం నటుడు.రచయిత మాత్రమే కాదు. దర్శకుడు కూడా. బుల్లి తెరపై హిట్ అయ్యాక సినీరంగంలో అడుగుపెట్టారు.
ప్రముఖ దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించిన ” జయంబు నిశ్చయంబురా ” సినిమాలో కమెడియన్ గా నటించి మెప్పించారు. ఇక అప్పటి నుంచి సినిమాల్లో హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. హాస్య నటుడిగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తనదైన శైలిలో నటించి మెప్పించారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కామెడీ టైమింగ్ చాలా గొప్పగా వుండేది. ధర్మవరపు కామెడీకి ఫిదా కాని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. ‘తోకలేని పిట్ట’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా అంతగా ఆడలేదు.. ఈరోజు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు.
Ads
ఉదయం నుంచీ… ఆయన జ్ఞాపకాల తలపోతే…! ఆయన జ్ఞాపకాల తలపోతంటే, హాస్యగంగలో మునిగితేలడమే. కొన్ని జ్ఞాపకాలంతే, ఎంతగా మరిచిపోదామన్నా మరువలేం. కాలంమారుతున్నా, ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ ఆకు పచ్చగానే వుంటాయి.! నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు సిఎంగా వున్నప్పుడు నేను ఆయన వద్ద పిఆర్వోగా వున్నాను. అప్పటి నుంచి ధర్మవరపు గారు నాకు పరిచయం. అంటే…. దాదాపు దశాబ్ద కాలం ఇరువురం మంచి స్నేహితులుగా వున్నాం. ప్రసాద్ ల్యాబ్లో మాకోసం ఆయన ప్రత్యేకంగా సినిమాలు వేయించేవారు.
* నెరవేరని కల..!!
ధర్మవరం గారికి ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర పొలం వుంది. అక్కడ ఓ మోడర్న్ స్కూలు ప్రారంభించాలన్నది ఆయన కోరిక. శ్రీమతి నేదురుమల్లి రాజ్యలక్ష్మిగారు విద్యాశాఖ మంత్రిగా వున్నప్పుడు నేను ఓఎస్డి (OSD) గా పనిచేశాను. అప్పుడు ధర్మవరపు గారు స్కూలు ఏర్పాటుకు సంబంధించి రోజూ… నాతో మాట్లాడేవారు. అన్నీ కుదిరివుంటే అద్దంకిలో ధర్మవరపు స్కూలు ప్రారంభమై వుండేది. అనివార్య కారణాల వల్ల ఆయన ‘కల’ కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాతకూడా ఇరువురం తరచూ కలుసుకునేవాళ్ళం. సినిమాల్లో చూసే ధర్మవరానికి, నిజ జీవితంలోని ధర్మవరపుకు చాలా తేడా వుండేది. బయట ఆచితూచి మాట్లాడేవారు. చాలా లోతైన ఆలోచనలు చేసేవారు. కానీ.. మనిషి మాత్రం.. బోళా శంకరుడు. స్నేహశీలి. రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. ఎమ్మెల్యే కావాలనుకున్నారు. కుదరకపోతే కనీసం ఎమ్మెల్సీ అయినా అవ్వాలనుకున్నారు. అదీ కుదరలేదు. బహుశా ఆయన రాజకీయ ‘కుల’ సమీకరణాల్లో ‘ ఫిట్ ‘ కాలేదనుకుంటాను. ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా సేవ చేశారు. ఆ పార్టీ మాత్రం ధర్మవరం సేవ తీసుకొని కూడా ఆయనకేం చేయలేక పోయింది. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు ప్రస్తావించారు. బాధపడ్డారు. అలా చూస్తూ…. చూస్తూ వుండగానే ఓరోజు హఠాత్తుగా ధర్మవరపు కనుమరుగయ్యారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన పండించిన కామెడీ, ఆయన జ్ఞాపకాలు…ఇంకా సజీవంగానే వున్నాయి …!!
Share this Article