న్యూస్ సైట్లలో గానీ, మీడియాలో గానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు… ఒక్క ఆంధ్రజ్యోతిలో తప్ప ఇంకెక్కడా ఈ వార్తే కనిపించలేదు… రాధాకృష్ణ కూడా ‘ఫాఫం పోనీలే’ అన్నట్టుగా ఎక్కడో ఓచోట కనీకనిపించకుండా ఓ నిలువు సింగిల్ కాలమ్‌లో మమ అనిపించాడు… ఈనాడు కూడా రాసే ఉంటుంది, కానీ కనిపించదు, రెండు భూతద్దాలు అవసరం… టీవీలయితే, ఇదీ వార్తేనా అని వదిలేశాయ్… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే..? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీకి చెందిన ఏడుగురు కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో రెండు గంటలపాటు విడివిడిగా భేటీలు వేసి, పార్టీకి పూర్వవైభవం రావడానికి ఏమేం తీవ్ర ప్రయత్నాలు చేయాలో చర్చించాడు… ఏపీలో రాజకీయ అస్థిరత, వైసీపీ అంతర్గత సంక్షోభాలు కాంగ్రెస్‌కు మళ్లీ ఒకప్పటి ‘పైచేయి’ని ఇస్తాయని రాహుల్‌కు చెప్పారు… సో, 2024కల్లా ‘కప్పు’ గెలవడానికి రెడీగా ఉండాలని రాహుల్ ఉద్బోధించాడు… వాళ్లంతా తలూపారు… ఇదీ వార్త… నవ్వొచ్చింది… నవ్వు రాకపోతేనే హాశ్చర్యం…
- ఏ హోదాలో రాహుల్ ఈ మీటింగ్ నిర్వహించినట్టు..? ఎఐసీసీలో తను ఎవరు..? అనేవి పిచ్చి ప్రశ్నలు… పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ ఆ కుటుంబం చుట్టే దాస్యప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది కాబట్టి రాహులే గతి… రాహులే అధిపతి… ఆ శిథిల సింహాసనం మీద కూర్చోకపోయినా కిరీటధారి తనే… లేదంటే ప్రియాంక, మరీ కాదంటే ప్రియాంక పిల్లల్లో ఎవరో ఒకరు… అదలా నడస్తూనే ఉండాలి… ఉంటుంది…
- వైసీపీ నుంచి మనోళ్లను రప్పించాలని ఆదేశించాడట… వాళ్లో వీళ్లో దేనికి..? జగన్‌నే రప్పిస్తే పోలా..? ఎలాగూ పాతవన్నీ మరిచిపోదామనీ, మోడీ నుంచి రక్షణ కావాలంటే అందరమూ ఒక్కటవ్వాలనీ, లేకపోతే అందరమూ మసైపోతామనీ ప్రశాంత్ కిషోర్ మధ్యవర్తిత్వంతో కొత్త కథలు నడుస్తున్నాయి కదా… మమతను, శరద్ పవార్‌ను దువ్వుతున్నారు కదా… అదే ప్రశాంత్ కిషోర్ జగన్‌కూ మంచి దోస్తే… ఈవిషయం ఎత్తడానికి ప్రశాంత్ కిషోర్‌కు ధైర్యం చాలుతుందా లేదానేది వేరే ప్రశ్న…
- అసలు ‘‘మనోళ్లు’’ ఏ పార్టీలోకి ఎవరెవరు పోయారు..? అసలు రాజకీయాల్లో ‘మనోళ్లు’ అంటే ఎవరు..? ఇది తేలేదెలా..? పర్ సపోజ్..,. మెగాస్టార్ చిరంజీవి… మనోడు కాదు అన్నాడు ఆమధ్య పార్టీ ఇన్‌చార్జి ఊమెన్ చాందీ… వెంటనే పీసీపీ ఉలిక్కిపడిపోయి, నో, నో, చిరంజీవి స్టిల్, ఇప్పటికీ మనోడే అని వివరణ ఇచ్చింది… తను ఎవరివాడో చిరంజీవి మాత్రం చెప్పలేదు… అదీ దురవస్థ… మనోడే అయి ఉంటే రాహుల్‌తో భేటీ వచ్చి ఉండేవాడు కదా… ఇంతకీ మనోడిని ఈ భేటీకి రమ్మన్నారా లేదా..?
Ads
- ఏపీ కాంగ్రెస్ ఈ దుస్థితికి కారణం పార్టీ సీనియర్లు… ఉదాహరణకు మాజీ సీఎం కిరణ్… చివరి బంతి దాకా తానేదో ఊడబొడుస్తాను అన్నట్టుగా బీరాలు పలికి, లాస్ట్ బాల్ సిక్స్ గ్యారంటీ అన్నట్టుగా ఎంఎస్‌ధోనీ తరహాలో బాల్స్ తినీ తినీ… చివరికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు… అదేదో సొంత పార్టీ పెట్టాడు… చెప్పుల గుర్తో ఏదో ఇచ్చారు… జనం తరిమితరిమి కొట్టారు… విభజన మీద జనాన్ని కన్విన్స్ చేయాల్సింది పోయి, ఏపీలో సమైక్య భావనల్ని, తెలంగాణలో వేర్పాటు భావనల్ని పెంచింది పార్టీయే… చాలా రాంగ్ స్ట్రాటజీ… అందుకే మట్టిగొట్టుకుపోయింది… ఇప్పుడు మళ్లీ అలాంటోళ్లే దిక్కట…
- బోలెడు మంది కేంద్ర మంత్రులయ్యారు… పదవుల్ని, హోదాల్ని అనుభవించారు… మళ్లీ ఒక్కరైనా ఏదైనా ఇష్యూ మీద జనంలోకి వచ్చారా..? విభజన మొదట్లో పార్టీ మీద జనంలో ద్వేషం, ఆగ్రహం ఉన్నాయి సరే, ఆ తరువాతైనా ఎవరైనా పార్టీ గురించి పట్టించుకున్నారా..? అసలు ఏపీ రాజకీయాల మీద పార్టీ అధిష్ఠానానికి ఓ లైన్ ఉందా..? మళ్లీ ఇదే కేవీపీ వంటి సీనియర్లు దేనికి..? వీళ్లెలాగూ పార్టీకి పైసా ఖర్చు పెట్టరు, ప్రజల్లోకి రారు, ఇప్పటికిప్పుడు ప్రజలు అవకాశమిస్తే మళ్లీ పెత్తనాలకు ముందువరుసలో ఉంటారు… అలాంటప్పుడు పార్టీలోని సెకండ్ లేయర్ లేదా థర్డ్ లేయర్ లీడర్లను ఎంకరేజ్ చేస్తే తప్పేమిటి..? కొత్త రక్తంతో లాభమే తప్ప నష్టం లేదు కదా..! అవున్లెండి, అలా ఆలోచిస్తే, కాంగ్రెస్ టైటానిక్ ఎందుకిలా మునిగిపోయేది..? అన్నట్టు రాహుల్ భయ్యా… మీ కపిల్ సిబల్ ఇచ్చిన పొలిటికల్ విందుకు 23 పార్టీల నేతలు హాజరయ్యారట… అసలు ‘‘మనోళ్లు’’ ఎవరో త్వరగా తేల్చు… తరువాత ఏపీ పార్టీని ఉద్దరించొచ్చు..!!
కొసమెరుపు :: జగన్‌కు క్రిస్టియన్లు అంతగా ఎందుకు మద్దతునిస్తున్నారు..? జగన్ క్రిస్టియనా..? అని రాహుల్ అడిగాడట..!!
Share this Article