శివప్పు మంజల్ పచ్చయ్… అంటే తమిళంలో ఎరుపు పసుపు ఆకుపచ్చ… ఇంగ్లిషు ట్రాఫిక్ భాషలో చెప్పాలంటే స్టాప్, లుక్, ప్రొసీడ్… ఈ సినిమా ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కథ కాబట్టి సింబాలిక్‌గా సినిమా పేరు కూడా బాగానే కుదిరింది… కానీ బిచ్చగాడు సినిమాను ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ చేయగలిగిన దర్శకుడు శశి ఈ సినిమా వంట మాత్రం మొత్తం చెడగొట్టాడు… తనేం తీస్తున్నాడో తనకే తెలియకుండా పోయింది… ఆ సినిమాయే ఇప్పుడు ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరిట తెలుగులోకి వచ్చింది… పెద్ద తల్నొప్పి… తెలుగులో ఓ పాపులర్ పాట ఉంది కదా, ఏందిరా ఓరి బామ్మర్దీ, తిక్కలదిర నీయక్క అని… ఆ పాట పదే పదే హమ్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా చూస్తుంటే విసుగ్గా… చిరాగ్గా..! ఈ తమిళ తంబీలు కొత్త కొత్త ప్రయోగాలతో, కథలతో జనాన్ని ఎలా కనెక్ట్ అవుతారో, అంతే కంట్రాస్టుతో విసిగించగలరు కూడా..! నిజానికి ఈ సినిమాలో హీరో జీవీప్రకాష్ అనుకోవాలి… సినిమా అంతా అయ్యాక కాస్తో కూస్తో గుర్తొచ్చేది తన పాత్రే… హీరో సిద్ధార్థ్ సో సో… ఈ జీవీప్రకాష్ ఎవరో తెలుసా..?
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సొంత సోదరి రెహానా కొడుకు ప్రకాష్… వాళ్ల కుటుంబమంతా సింగర్లే కదా… ప్రకాష్ సింగరే కాదు, కంపోజర్, నిర్మాత, నటుడు, స్వయంగా అనేక ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించగలడు… తను పెళ్లి చేసుకున్నది కూడా సైంధవి అనే సింగర్‌ను… ఈ బామ్మర్ది పాత్రలో భలే రాణించాడు… నిజానికి సిద్ధార్థ్ ఈ పాత్ర ఎందుకు చేశాడో తనకే తెలియాలి… అప్పట్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది… అకస్మాత్తుగా తెలుగును వదిలేసి తమిళంపై బాగా కాన్సంట్రేట్ చేశాడు… క్రమేపీ తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు… మధ్యలో ఒకటీఅరా ఏవో సినిమాలు వచ్చినా ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు… సిద్ధార్థ్ ఈమధ్య ఎక్కువగా తన పొలిటికల్ వ్యాఖ్యలతో వార్తల్లో కనిపించడమే గానీ ప్రొఫెషనల్ విశేషాలు చాలా తక్కువ… ఈ సినిమాతో తన ఇమేజీని మరింత దెబ్బతీసుకున్నట్టే…
Ads
ఎందుకంటే..? సినిమా కథే పెద్ద గందరగోళం… ట్రీట్‌మెంట్ కూడా అంతే… ఎనభైలలో మన పాత తెలుగు, తమిళ హీరోలకు రాసిన కథలా ఉంది… ఆ విలనీ అస్సలు పండలేదు… అసలు ప్రకాష్‌కు హీరోయిన్ పాత్ర దేనికో మరీ అర్థం కాదు… నటీనటుల్లో సిద్ధార్థ్ మినహా తెలుగువాళ్లకు పెద్ద పరిచయస్తులు ఎవరూ లేరు… అరవ ఓవరాక్షన్… అనేకచోట్ల సిల్లీ యాక్షన్… వెరసి పెద్ద బోర్… అసలు దర్శకుడికి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ల డ్యూటీలు, పరిమితులు తెలుసా అనేది పెద్ద డౌట్… లేక దర్శకుడు కొన్ని కొన్నేసి సీన్లు కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లకు ఇచ్చి, షూట్ చేయించి, అన్నీ కలిపి ఒక్కచోట కుట్టేసి, ప్రేక్షకులపైకి వదిలాడేమో బహుశా… అంతేనా మాస్టారూ… మళ్లీ హమ్ చేయాలనిపిస్తోంది… ఏందిరా ఓరి బామ్మర్దీ, తిక్కలదిర నీయక్క…!! ఎంత బిచ్చగాడు దర్శకుడు అయితేనేం, మరీ ఇంత బిచ్చపు సినిమా తీయాలా..!! సినిమా ఒరిజినల్ పేరు ‘ఎరుపు పసుపు పచ్చ’ కదా, ఈ సినిమాకు కలర్ రేటింగ్… ఎరుపు…! ట్రాఫిక్ భాషలోనే…!!
Share this Article