ఫలక్‌నుమా సినిమా సమయంలో… నటుడు విష్వక్సేన్ ఏవో పిచ్చికూతలు కూసి వార్తల్లోకి ఎక్కినట్టు యాదికొస్తోంది… ఈ నాలుకకు కాస్త తీట ఎక్కువే అనిపించింది అప్పట్లో… కాస్త కూడా చాలా ఎక్కువ తీటే… అందుకే పాగల్ సినిమా గురించి పాగల్ మాటలు చాలా మాట్లాడాడు స్టేజీ మీద… థియేటర్లు ఫుల్లయిపోతాయనీ, అన్ని థియేటర్లలోనూ ఈ సినిమా వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తారనీ, మూసేసిన హాళ్లు అర్జెంటుగా తెరుచుకుంటాయనీ, హిట్ కాకపోతే పేరు మార్చేసుకుంటాను అని ఏవేవో కూతలు వినిపించాడు… ఓహో, ఈ విష్వక్సేన్‌కు ఇంకా ఇండస్ట్రీ తత్వం బోధపడనట్టుంది అని స్పష్టంగా అర్థమైంది… డియర్ విష్వక్, ఇండస్ట్రీ ప్లస్ ఆడియెన్స్ చాలామందిని చూశారు… అసలు నాలుక మీద అదుపు లేకపోతే, స్టేజీ మీద ఏదేదో కూస్తే, అది సినిమాకు కౌంటర్ ప్రొడక్ట్ అవుతుందనే సోయి కూడా లేనట్టుంది ఈ పిల్లగాడికి..! తీరా ఇప్పుడేమైంది..? తను డప్పులు, గప్పాలు కొట్టిన పాగల్ అనే సినిమా కాస్తా ఫట్‌మని పేలిపోయే స్థితి… ఇదేం పాగల్ సినిమార భయ్, ఈ హౌలా సినిమా ఎవడుర భయ్ తీసింది అంటున్నారు ప్రేక్షకులు కోపంగా… సో, ఇప్పుడు విష్వక్సేన్ ఏం చేయాలి…?
మొహం దాచుకోవాల్సిన పనిలేదు… ఇజ్జత్ తీసుకునే మాటలు మళ్లీ మాట్లాడకుండా ఉంటే సరి… అసలే ఇది సోషల్ మీడియా శకం, ట్రోలింగ్ యుగం… అసలే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ల భావోద్వేగాల్ని కోపంలా కన్వర్ట్ చేసి, తెల్లారిలేస్తే ఎవడు దొరుకుతాడా, ఎవడిని బూతులు తిట్టేద్దామా అని చూసే రోజులివి… అందుకే జాగ్రత్త అవసరం… అసలు ఆలూ లేదు, చూలూ లేదు… హీరోగా… సారీ, లీడ్ యాక్టర్‌గా చేసినవి రెండో మూడో సినిమాలు… అప్పుడే సినిమాల హిట్ మీద, ఫట్ మీద సవాళ్లు విసరాల్సిన అవసరమేంటి అసలు…? నిజంగా ఆ దమ్ముందా ఈ సినిమాలో..? సినిమా మొత్తం పూర్తయ్యాక నిర్మాత, దర్శకుడు, నటీనటులు ఓసారి తాపీగా సినిమా చూసి ఉంటే వాళ్లకే అర్థమై ఉండేది… ఎంత పాగల్ సినిమాయో…! అన్నట్టు పేరు మార్చేసుకోవాలా ఇప్పుడు..? అసలు ఈ నటుడికి తన పేరు ఏమిటో, దాని అర్థమేమిటో తెలుసా అనేది ఫస్ట్ డౌట్… వైష్ణవ సంప్రదాయ సాహిత్యం, అర్చనలు, ఆలయాల్లో కనిపించే, వినిపించే పేరు ఇది… విష్ణమూర్తి సైన్యాధిపతి… చాలా అరుదైన పేరు… ఏం పేరు పెట్టుకుంటావోయ్ దాన్ని మార్చుకుని..?!
Ads
ఈ దర్శకుడి పేరు గుర్తులేదు… కానీ అమ్మ ప్రేమకూ, అమ్మాయి ప్రేమకూ నడుమ తేడా కూడా తెలియని రకం… బేసిక్ స్టోరీ పాయింటే తన్నేసింది… ఎలాగంటే..? అమ్మ ప్రేమకు దూరమైనవాడు అమ్మాయి ప్రేమలో అమ్మ ప్రేమను వెతుక్కోవాలని అనుకుంటాడు… సరే, అనుకున్నాడులే… అదేదో సిన్సియర్ లవ్ ట్రై చేయొచ్చు కదా… కనిపించిన ప్రతి అమ్మాయికీ ఐ లవ్ యూ చెబుతుంటాడు… ఏకంగా 1600 మందికి… సహజంగానే ఎవడ్రా ఈ పాగల్ గాడు అనుకుని అమ్మాయిలందరూ ఫోఫోరా అని రిజెక్ట్ చేస్తారు… వైజాగ్ ఏరియాలో అమ్మాయిలందరూ అయిపోయి హైదరాబాద్ వస్తాడు… మధ్యలో మూడునాలుగో బ్రేకప్పులు… పైగా హీరోయిన్ అనబడే కేరక్టర్ తండ్రికీ ప్రపోజ్ చేస్తాడు, దానికేదో పిచ్చి కారణం చెప్పి జస్టిఫై చేయాలనుకున్నాడు దర్శకుడు కానీ అప్పటికే జనం జుత్తు పీక్కుని, పీక్కుని ఉంటారు కాబట్టి అదేమీ ప్రేక్షకుల బుర్రల్లోకి ఎక్కలేదు… వెరసి ఓ హౌలే సినిమా అయిపోయింది…
ఆ హీరోయిన్ కూడా ఎప్పుడో సెకండాఫ్ ఎంట్రీ… మొదటి నుంచీ సినిమా చివరి దాకా ఒక ఎమోషన్ బిల్డప్ చేసే ప్రయత్నమే లేదు… అమ్మ ప్రేమ లేదా అమ్మాయి ప్రేమ లేదా తండ్రీబిడ్డల నడుమ ప్రేమ… ఏదయితేనేం… ఉద్వేగాన్ని పండించే సీన్లు ఒకటో రెండో అయినా ఉండాలి కదా… ఎంతసేపూ అమ్మాయిలు, ప్రపోజల్స్… సమాంతరంగా ఓ కామెడీ ట్రాక్… ఓ మ్యూజికూ బాగాలేక, ఓ ఎడిటింగూ బాగాలేక, ఓ కథనమూ బాగాలేక, ఓ కెమెరా బాగాలేక… ఓ సాదాసీదా సినిమా… అసలు ఈ కరోనా వేవ్స్ గట్రా లేకుండా ఉంటే, పెద్ద సినిమాలు బరిలో గనుక ఉండి ఉంటే… ఈ సినిమాకు ఇన్ని థియేటర్లు దొరికేవా..? సో, వాపు ఎప్పుడూ బలుపు కాదు బ్రదరూ…! పైగా ఇవ్వాళారేపు స్మార్ట్ ఫోన్ ఆన్ చేస్తే చాలు, బోలెడు వైవిధ్యభరితమైన సినిమాలు… సబ్ టైటిళ్లతో వేరే భాషా సినిమాలు… ఉత్కంఠగా సాగే వెబ్ సీరీస్… ఒక ప్రేక్షకుడు మాస్క్ తగిలించుకుని, కరోనా భయాల నడుమ ప్రయాణిస్తూ, మస్తు ఖర్చుకూ, ప్రయాసకూ సిద్ధపడి ఒక థియేటర్‌కు రావాలంటే ఆ సినిమాలో దమ్ముండాలి… నో, ఈ సినిమాలో ఆ దమ్ములేదు… జస్ట్, ఏ పాగల్ సినిమా…!! అవునూ, అనేకచోట్ల ఈ లీడ్ యాక్టర్ ఊసరవెల్లిలో జూనియర్ ఎన్టీయార్ నటనను అనుకరించినట్టుగా ఉందా..?!
Share this Article