- ……….. By…. Taadi Prakash ………
- జయధీర్ తిరుమలరావు – ‘ఆద్యకళ’
- the treasure of Telangana’s ethnic art
- ————————————————————
- అడివిగాచిన వెన్నెల్ని నువ్వు రెండు చేతుల్తో పట్టుకుని తెచ్చి నాకు ఇవ్వగలవా?
- అరణ్యాల్లో అపరాత్రి కురిసిన వాన చినుకుల రహస్య సంగీతాన్ని తెచ్చి నా చెవులకి వినిపించగలవా?
- కొండగుహల్లో దాక్కొని ఉన్న అంతుచిక్కని కుడ్య చిత్ర సౌందర్యాన్ని నా కళ్ళముందు ఆవిష్కరించగలవా?
- ఒక పురాతన పద్యంలా ప్రతిధ్వనిస్తున్న ఆదివాసుల ‘ఆద్యకళ’ తాళ పత్రాలను నాకు కానుకగా ఇవ్వగలవా?..
- అసాధ్యం కాదది, కష్ట సాధ్యమే అని చెప్పగల వాడొకడు ప్రతీ తరంలోనూ వుంటాడు. వాడు కొన్ని దశాబ్దాల కాలాన్ని ధారబోస్తాడు. కాలం తెలియని పాత బొమ్మల కోసం జీవితాన్ని పణం పెడతాడు. అడవులు పట్టి పోతాడు. కొండలెక్కుతాడు. కళ ఎక్కడ కనిపించినా కళ్ళకి అద్దుకుంటాడు. ఇప్పుడు, ఇక్కడ, మన కళ్ళఎదుట వున్న అలాంటి పిచ్చివాడి పేరు జయధీర్ తిరుమలరావు. ఆయన ఆశ నెరవేరాలని కోరుకుంటున్న మరో వెర్రితల్లి గూడూరు మనోజ.
విశాలమైన ఆర్ట్ గేలరీలో మూడు అంతస్తుల్లో వందల బొమ్మలూ, శిల్పాలూ, పురాతన సంగీత వాద్యాలూ, తాళపత్ర గ్రంథాలు, వెలకట్టలేని రాతప్రతులను పేర్లతో, వివరాలతో, వ్యాఖ్యానంతో ఆకట్టుకునేలా డిస్ ప్లే చేశారు. రాతి శాసనాలు, నాటి లిపి, పొడవాటి తాటాకుల మీద అద్భుతమైన గొలుసుకట్టు తెలుగు రాత, దస్తావేజులు, కైఫీయతులు, మహిళల కాళ్ల కడియాలు, సున్నితమైన, నాజూకైన డిజైన్లలోని కళాచాతుర్యం వుట్టిపడే చిత్రాలు మనల్ని కట్టిపడేస్తాయి. తోలు, తాటాకు, కాగితం మీద రాతలు, రాగిరేకులు, ఎద్దు ఎముకల మీద అక్షరాలు, రుంజ, తంబుర, బూర, కొమ్ముబూర, విల్లంబులు, బాణాలు… గిరిజన సాంస్కృతిక వారసత్వానికి సాక్ష్యాలుగా వుంటాయి. ఇవన్నీ చూస్తే, చూసి ఆనందించగలిగే అంతరంగం అంటూ వుంటే… మనం ఎవరమో మనకి తెలుస్తుంది. మనకి పట్టని మన చరిత్ర, మన పూర్వీకుల జీవన విధానం, వాళ్ళ సౌందర్య దృష్టి, కళాసృష్టి కోసం పడిన తపన – అంతరించిపోయిన జాతుల ఆత్మసంగీతమై మనల్ని వెంటాడుతుంది. మనల్ని వుత్తేజితుల్ని చేసి, మన హృదయాల్ని వెలిగించి తిరోగమనమే పురోగమనం అనే స్పృహ కలిగించే ఈ జాతిసంపదని కాపాడుకోవాల్సిన సమయం ఇది.
ఈ అపూర్వమైన కళాప్రదర్శన చూసి ఆశ్చర్యచకితులైన కొందరు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలూ జయధీర్ తిరుమలరావు గారికి ఒక ఆఫర్ యిచ్చాయి. ‘ఎంత డబ్బయినా యిస్తాం, ఇవన్నీ మాకు యిచ్చేయండి. బ్లాంక్ చెక్ యివ్వమంటారా?’ అంటున్నాయి. అయితే మొత్తం ఈ తెలంగాణా ఆదివాసీల కళా సాంస్కృతిక వారసత్వ సంపదని విశాఖకో, గుంటూరుకో, ముంబాయికో తరలించుకుపోతాం అంటున్నారు. బోల్డంత డబ్బు వస్తుంది కదా అని తిరుమలరావు ఎగిరి గంతేయడం లేదు. నా ప్రజలు, నా రాష్ట్ర సంపద ఎవరో ఎగరేసుకుపోవడం ఏమిటి? అని విచారంలో వున్నారాయన. దశాబ్దాలు చెమటోడ్చి సేకరించిన యీ కళ, శిల్పాలూ, సంగీత పరికరాలు, బొమ్మలూ, ఆభరణాలూ, లక్ష పేజీల తాళపత్రాలూ, పుస్తకాలూ, చిత్రకళా స్క్రోల్స్ అన్నీ మన రాజధానీ నగరం హైదరాబాద్ లోనే ఉండాలని జయధీర్ తిరుమలరావు ఆకాంక్ష. ఈ నిధిని ఎట్టిపరిస్థితుల్లోనూ సంరక్షించి తీరాలనీ, యిక్కడే భద్రపరచాలనీ ప్రొఫెసర్ మనోజ పట్టుదల.
ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ కళాకృతులను ప్రాణాధికంగా ప్రేమించిన, వాటికోసం బతుకుల్ని అంకితం చేసిన బ్రిలియంట్ ప్రొఫెసర్లు జయధీర్, మనోజ వీటిని కోట్ల రూపాయలకు అమ్మడానికి సుతరామూ వొప్పుకోడం లేదు. వీటన్నిటినీ యిక్కడే వుంచి, పరిశోధన కొనసాగించి, ముందుతరాల కోసం పరిరక్షించాలని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నారు. “అప్పడుపు కూడు భుజించుట కంటె…” అన్నట్టు యీ కళాభారతిని వ్యాపారులకు అమ్మడానికి అంగీకరించలేకపోతున్నారు, లేదా అసహ్యించుకుంటున్నారు. ఇన్ని మాటలెందుకు! తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గనక తలుచుకుంటే యిది ఒక్కరోజులో పరిష్కారం కాగల అతి చిన్న సమస్య. వీటన్నిటితో ఒక శాశ్వత మ్యూజియం అంటారో, ఒక యూనివర్సిటీ పెట్టొచ్చు అంటారో… అది తర్వాత సమస్య. రెండు మూడు రోజుల్లో ముగిసిపోయే ఈ ఎగ్జిబిషన్ తర్వాత, ఈ పురాతన సంపదనంతటినీ పదిలపరచాలి. అది తక్షణం చేయాల్సిన పని. జయధీర్ తిరుమలరావు ఇంట్లోనో, మరోచోటో వీటిని వుంచడం అసాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం గనక చొరవ తీసుకుంటే సమస్య దూదిపింజలా తేలిపోతుంది. సంకుచిత రాజకీయాల్నీ, యిష్టాయిష్టాల్నీ పక్కనపెట్టి, తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా భావించాల్సిన సమయం.
ఇది భేషజానికీ, భావజాలానికీ సంబంధించినది కానేకాదు. మనకి గర్వకారణమైన కళని మనం కాపాడుకోగలమా? లేదా? అనేదే ప్రశ్న!
Ads
ఆర్టిస్ట్ మోహన్ నాకోసారి చెప్పాడు. పికాసో భార్య ఆదిలాబాద్ వెళ్లి, గోండులు చేసిన అనేక కళాకృతులను చూసి ఆశ్చర్యపోతూ, “అయ్యో. ఇక్కడ చాలామంది పికాసోలు వున్నారుగా” అనిందట. అవునుకదా. మనకెవరైనా చెప్పాలి. విదేశీయులైతే మరీ బావుంటుంది. జయధీర్ తిరుమలరావు చెబితే చప్పగా వుంటుంది. ఇందులో ఏదో కుట్ర ఉందనీ అన్పిస్తుంది!
జయధీర్ తిరుమలరావు అనే ఆద్యకళా ప్రేమికుడు తను చేయాల్సిన పనేదో సృజనాత్మకంగా చేశాడు. జీవితసాఫల్యం అనేదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడి వున్నాడు. మనం ఆయనకి బాకీపడి వున్నాం. జయధీర్ ని గౌరవించుకోడం మనందరి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం వుంది. సాహిత్యం, కళల పట్ల గొప్ప అవగాహన వున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దీనిని పరిష్కరించగలరు. దీని విలువ పూర్తిగా తెలిసిన ఆయన.. ఒక వేదిక! ఒక మ్యూజియం! లేదా, ఒక విద్యాలయం!… ఏదన్నా చేయొచ్చు. ఒక రామప్ప దేవాలయం, ఒక వేయి స్తంభాల గుడి లాగే.. జయధీర్ సేకరించిన అపురూప వారసత్వ సంపద కూడా అంతే అమూల్యమైనది. ఇందులో చర్చకీ, మరో అభిప్రాయానికీ తావేలేదు.
అయినా……!
అయినా ఎవరిక్కావాలి తిరుమలరావ్!
నువ్వు జుట్టు పీక్కుని, గుండె బాదుకుని, గొంతు చించుకుని అరిస్తేమాత్రం ఎవరిక్కావాలి?
ఎవరికి కావాలి నేస్తం..
నీ నిధి
నీ ఆశ
నీ నిరాశ
నీ వొంటరితనం!
శ్రీశ్రీ అన్నట్టు… సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగుతోంది.
ఎవరి పనులలో వాళ్లు
ఎవరి తొందరలో వాళ్లు
ఎవరికి కావాలి నేస్తం!
ఏమయిపోతేనేం నువ్వు!
– ఎక్కడికిపోతేనేం నీ నిధి!
నీ చేతిలోని అమృతకలశాన్ని
చూసీచూడనట్టు నటించగల
అంధులం మేము.
నీకది నిధీ… నిక్షేపం
మాకు కేవలం కాలక్షేపం!
మాది పరిపూర్ణమైన కల్చరల్ ఇల్లిటరసి
కళాత్మలోకంలో దివాలా!
మన్నించు ఆచార్యా…
పోనీ… శపించు జయధీర్!
Prof. Guduru Manoja
Gmanoja61@gmail.com
9704643240
Share this Article