- ……. By…. Jagannadh Goud……
- “డబ్బు, కష్టాలు, వ్యక్తిత్వం” – క్రిస్ కెయిన్స్
- నిజ జీవితంలో జరిగే సంఘటనలు, వాస్తవాలు వేరు.., వార్తా పత్రికల్లో, TVల్లో, యూ ట్యూబ్ ఛానల్స్ లో రాసే వార్తలు వేరు… ఓడలు బండ్లు అవటం, బండ్లు ఓడలు అవటం సహజమే… కానీ అందుకు గల కారణాలు, పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉంటై అని ఒకడు, ఒకప్పటి ప్రపంచంలో నాణ్యమైన ఆల్ రౌండర్ క్రికెటర్ ఈనాడు రోడ్డు పక్కన బస్ క్లీనర్ గా పని చేసే దీనమైన స్థితి అని ఇంకోడు, రిటైర్ అయ్యాక విలాసాలకి బానిసై చెడిపోయాడు అని మరొకడు, ఆర్ధిక ప్రణాళిక లేక ఈ రోజు ఆస్ట్రేలియాలోని సిడ్నీ హాస్పటల్ లో హార్ట్ సర్జరీ చేయించుకొని ఓటమి అంచున ఉన్నాడు అని ఇంకోడు…. ఇలా ఏ విధంగా రాస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయనే యావ, ధ్యాస, కోణం తప్ప అసలు నిజాలు చూడలేరు…
రిచర్డ్ హాడ్లీ తర్వాత న్యూజిల్యాండ్ లో అత్యంత గొప్ప ఆల్ రౌండర్ క్రికెటర్ క్రిస్ కెయిన్స్… ప్రపంచ క్రికెట్ చరిత్రలో కూడా అత్యంత నాణ్యమైన ఆటగాళ్ళలో క్రిస్ కెయిన్స్ ఒకడు… తాను స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న కాలంలోనే… ఒక దశలో తన ఆల్ రౌండర్ ప్రతిభను అనుకున్నంతగా ప్రదర్శించలేక పోతున్నాను అని తనకు తానే విశ్లేషించుకుని, ఎవరూ అడక్కుండానే, గౌరవప్రదంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించాడు క్రిస్ కెయిన్స్… క్రిస్ కెయిన్స్ తండ్రి లాన్స్ కెయిన్స్ కూడా ప్రముఖ న్యూజిల్యాండ్ క్రికెటర్. క్రిస్ కెయిన్స్ కి అన్నదమ్ములు లేరు, ఉన్నది ఒకే ఒక చెల్లెలు లూయిస్ కెయిన్స్… న్యూజిల్యాండ్ లో తను ఓచోట నడిచిపోతుంటే రైలు, ఒక సిమెంట్ ట్రక్ గుద్దుకొని క్రిస్ కెయిన్స్ చెల్లెలు లూయిస్ కెయిన్స్ మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు (1993)… అప్పుడు క్రిస్ చెల్లెలు వయస్సు 19 సంవత్సరాలు… నా చెల్లి బతికుంటే ఇప్పుడు తనకి 25 సంవత్సరాలు ఉండేవి, ఇప్పుడు 30 ఉండేవి, ఇప్పటికి తనకి పెళ్ళి అయి ఉండేది, ఇప్పటికి తన పిల్లలతో నేను ఆడుకునేవాడిని అని క్రిస్ కెయిన్స్ కొన్ని సందర్భాలలో మాట్లాడిన మాటలని బట్టి తనకున్న ఏకైక చెల్లెలు లూయిస్ అంటే ఎంత ఇష్టం, ప్రాణంగా చూసుకునేవాడో అర్ధం అవుతుంది…
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి చెల్లెలు జ్ఞాపకార్ధం 1001 కిలోమీటర్ల రైల్ ట్రాక్ సేఫ్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పూర్తి చేశాడు క్రిస్ కెయిన్స్. నిజానికి న్యూజిల్యాండ్ లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు… చిన్న దేశం అయినా 3000 కి పైగా రైల్వే క్రాసింగ్స్ ఉంటయ్… అందులో సగం ప్రభుత్వ భూముల్లో, మిగతావి ప్రైవేట్ భూముల్లో… రైళ్ళు, ప్రయివేట్ వాహనాలు గుద్దుకొని యాక్సిడెంట్స్ అయ్యేవి అప్పట్లో… సరే, మళ్ళీ విషయానికొస్తే క్రిస్ కెయిన్స్ స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న కాలంలోనే గౌరవప్రదంగా తప్పుకొని కొత్తవాళ్ళకి చోటు కల్పించాడు… తన చెల్లెలు జ్ఞాపకార్ధం చేస్తున్న రైల్ సేఫ్టీ కార్యక్రమంలో తనకు బాగా దగ్గరైన మెలనీ క్రాసర్ ని పెండ్లి చేసుకున్నాడు. రిటైర్మెంట్ తీసుకున్నాక ఓక్టగాన్ డైమండ్ వ్యాపారంలోకి దిగాడు. ఓ మోస్తరుగా నడిచే వ్యాపారాన్ని విజయతీరాల వైపు నడిపించాడు.
Ads
రిటైర్మెంట్ అయ్యాక ICL (ఇండియన్ క్రికెట్ లీగ్) లీగ్ జరిగింది కొంతకాలమే… అయినా మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు అని విన్సెంట్ అనే తోటి న్యూజిల్యాండ్ క్రికెటర్ ఒకడు ICC కి ఆరోపించాడు (అసలు ఆ విన్సెంట్ అనే వాడి మీదే జీవిత కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడకూడదు అని నిషేధం ఉంది)… నేను తప్పు చేయలేదు అని కోర్ట్ మెట్లు ఎక్కాడు క్రిస్ కెయిన్స్.. ICC కి వ్యతిరేకంగా కోర్ట్ కేసులకి చాలా కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది, డబ్బు కోసం లాభాల్లో ఉన్న తన బిజినెస్ ని తక్కువ రేట్ కే అమ్మాల్సి వచ్చింది… ఆ తర్వాత కోర్ట్ తీర్పు వెలువడింది, క్రిస్ కెయిన్స్ నిర్దోషి అని… ఆ తర్వాత మళ్ళీ మన లలిత్ మోడీ కేసు కోసం చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది, ఆ లలిత్ మోడీ ఒక ఘరానా దొంగ; మన దేశంలో చాలా కేసులు పెట్టేసరికి బ్రిటన్ పారిపోయిన చోర్… ఆ కేసుల వివరాలు, తీర్పులు అవి అన్నీ ఎందుకు గానీ ఇవి అన్నీ క్రిస్ కెయిన్స్ ని ఆర్ధికంగా బాగా దిగజార్చాయి. కోటానుకోట్ల ఆస్తి అంతా కరిగిపోయింది…
ఎక్కడా వెనుకడుగు వేయలేదు, ఆత్మ స్తైర్యం కోల్పోలేదు. తనకి అవకాశాలు ఇవ్వమని, ఉద్యోగం ఇవ్వమని ఎవ్వరినీ అడగలేదు… లేదా జనాలకి చెడు చేసే పనికిమాలిన ప్రొడక్ట్స్ అడ్వర్టైజింగ్ లో కూడా పాల్గొనలేదు. తన కష్టాన్ని నమ్ముకొని స్కూల్ బస్ లు, ప్రభుత్వ బస్ లు ఆగినప్పుడు వాటిని తుడిచే జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఆ పని చేస్తూ నామోషీగా అతను ఫీల్ కాలేదు. ఇంకా ఆ ఫోటోలని షేర్ చేస్తూ పనే దైవం అని గొప్పగా చెప్పుకున్నాడు… రిటైర్మెంట్ అయ్యాక క్రిస్ కెయిన్స్ వ్యభిచారం చేయలేదు, జూదం ఆడలేదు, పనికిమాలిన అడ్వర్టైజ్ యాడ్ లు ఒప్పుకోలేదు… అలాంటి వ్యక్తి మీదా క్రిస్ కెయిన్స్ కి ముందు చూపు లేదు, ఆర్ధిక ప్రణాళిక లేదు, వ్యసనాలకి బానిసై డబ్బు అంతా పోగొట్టుకున్నాడు అని రాసేది… ఒకడేమో అతనికి పొదుపు చేయటం తెలియలేదు అంటాడు… కనీసం ఏ ఆర్ధిక నిపుణుడ్ని అడిగినా సలహా ఇచ్చేవాడు కదా అని ఒక గొట్టం గాడు అంటాడు, ఇంకొకామె బాగానే సంపాదించాడు కానీ వ్యసనాలకి బానిసై అంతా పోగొట్టుకున్నాడు అంటుంది… ఈ కష్టకాలంలో మాకు అండగా నిలబడకపోయినా పర్లేదు, మా ప్రైవసీని కాపాడండి, వదిలేయండి అని మెలనీ కన్నీళ్లు పెట్టుకుంటోంది… మొదటి నుంచి ఇప్పటివరకు క్రిస్ కెయిన్స్ అత్యంత గౌరవప్రదంగానే బతికాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని మాత్రమే నమ్ముకున్నాడు. ఈ మధ్య హార్ట్ కి సమస్య వచ్చి కాన్ బెర్రాలో ఆపరేషన్ జరిగింది, మళ్ళీ 2 రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీ హాస్పటల్ లో చేరి క్రిటికల్ కేర్ మీద ఉన్నాడు… అవమానించకండి… డబ్బు ఉంటేనే గొప్పోళ్ళు కాదు, వారి చేతుల్లో డబ్బు లేనంత మాత్రాన మనం వాళ్ళకి నీతులు, పాఠాలు చెప్పే స్థితిలో ఉన్నాం అని కాదు… ప్రస్తుతం ఈ స్టోరీ రాసే సమయానికి మృత్యువుతో పోరాడుతున్నాడు… తను కోలుకోవాలని ‘ముచ్చట’ కోరుకుంటోంది…
Share this Article