Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘తాలిబన్ల తాతలకూ తలవంచం..! ‘ఐదు సింహాల’ ధిక్కారం… ఏమిటా కథ..?!

August 18, 2021 by M S R

ఇప్పుడు ప్రపంచమంతా ఒకవైపు ఆసక్తిగా చూస్తోంది… అదేమిటో తెలుసా..? పంజ్ షీర్..! కాశ్మీర్ లోయలాగే ఇది ఒక లోయ… లక్ష, లక్షన్నర మంది కూడా జనాభా ఉండదు… ఒక్కొక్క ఆవాసంలో పదీపదిహేను వేలు… గరిష్టంగా 40 వేలు… ఇప్పుడు ఈ లోయ వైపు అందరి ఆసక్తీ ఎందుకు కాన్సంట్రేట్ అయ్యిందంటే… అప్ఘన్ నుంచి ప్రస్తుతం తాలిబన్లకు భయపడి వేలాది మంది ప్రాణాలకు తెగించి పారిపోతున్నారు కదా… ఎంబసీలన్నీ ఖాళీ అయిపోతున్నాయి కదా… చివరకు అప్ఘన్ జవాన్లు కూడా కాలికి బుద్ధిచెప్పారు కదా… అధ్యక్షుడు ఎప్పుడో ఉడాయించాడు కదా… ప్రతిఘటన లేదు… ఎల్లెడలా భయమే… కానీ ఒకే ఒక ప్రాంతం తాలిబన్లపై ప్రతిఘటన పోరాటానికి సై అంటోంది… అదే పంజ్ షీర్… ప్రకృతిసిద్ధ దుర్బేధ్య రక్షణ ఉండే ఈ ప్రాంతాల్లోకి ఇప్పటికీ తాలిబన్లు ప్రవేశించలేకపోయారు… ఇప్పుడే కాదు, ఇరవై ఏళ్ల క్రితం తాము అప్ఘన్‌ను ఏలినప్పుడు కూడా ఈ లోయ మీద పట్టు సంపాదించలేకపోయారు… వీళ్లే కాదు, సోవియట్ యూనియన్‌కే చేతకాలేదు… అదీ పంజ్ షీర్… అనగా అప్ఘన్‌లో అయిదు సింహాలు అని అర్థం…

panjshir

పైన మ్యాప్ జాగ్రత్తగా చూస్తే ఈ ప్రాంతం భౌగోళిక ఉనికి అర్థం అవుతుంది… ఎక్కడో మారుమూల విసిరేసినట్టుగా ఏమీ ఉండదు… అప్ఘన్ రాజధాని కాబూల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో… హింద్ ఖుష్ పర్వతశ్రేణికి సమీపంలోనే ఉంటుంది… ఆ గుట్టల్లో సాయుధపోరాటం అంత సులభం కాదు… గెరిల్లా పోరాటానికి అనువైన లోయ… ఏ పరిస్థితుల్లోనూ తాలిబన్లకు తలవంచేది లేదు, లొంగిపోయేది లేదు అంటూ అక్కడి నార్తరన్ అలయెన్స్ తిరుగుబాటు జెండా ఎగరేసింది… అందుకే ఈ పంజ్ షీర్ ఏమిటని ప్రపంచం అటువైపు చూస్తోంది… ఇప్పుడు తాలిబన్లకే కాదు, వాళ్లకు మద్దతుగా ఉన్న రౌడీ దేశాలు పాకిస్థాన్, చైనా, రష్యాలకు కూడా ఈ లోయ ఓ సవాల్… గతంలోనే రష్యా ఏమీ చేయలేకపోయింది… ఇంతకీ ఈ తిరుగుబాటు ఎలా ప్రచారంలోకి వచ్చింది..? అదీ చూద్దాం ఓసారి… మొన్నమొన్నటిదాకా ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సాలే దేశం విడిచిపెట్టి పారిపోలేదు, ఈ పంజ్ షీర్‌కు వెళ్లిపోయాడు… అక్కడి నుంచే ప్రతిఘటన పోరాటం చేస్తానంటున్నాడు… ఎవరు ఈ సాలే..?

Ads

panjshir

గతంలో తను కూడా తీవ్రవాదే… ఈ లోయలో ఆధిపత్యం, పట్టు ఉన్న మసౌద్ నాయకత్వంలో పోరాడేవాడు… సాలేను పట్టుకుని చంపేయాలని తాలిబన్లు విశ్వప్రయత్నాలు చేశారు, తన సోదరిని పట్టుకుని చిత్రహింసలు పెట్టారు… అమెరికా, నాటోదళాలు తాలిబన్లను అధికారం నుంచి తరిమేశాక సాలే అప్ఘన్ ప్రభుత్వంలో చేరాడు, గూఢచార విభాగానికి అధిపతి అయ్యాడు… తరువాత ఉపాధ్యక్షుడు అయ్యాడు… పాకిస్తాన్‌కు బద్ద వ్యతిరేకి ఈయన… బహిరంగంగానే పాకిస్తాన్‌ను నిందించేవాడు… అప్ఘన్ అధ్యక్షుడు ఘనీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కలిసి ఉన్న వేదికపైనే… పాకిస్తాన్ లేకుండా తాలిబన్లు లేరంటూ వ్యాఖ్యానించాడు… అదీ సాలే నేపథ్యం… మరి ఈ మసౌదీ ఎవరు..? ఈ లోయలో ఎంతోకాలంగా వీళ్ల కుటుంబానిదే పట్టు… ప్రత్యేక బలగాలు… వాళ్లను దాటి ఎవరూ లోయలోకి అడుగుపెట్టలేరు… సోవియెట్ సైన్యాల్నే గతంలో మూడు చెరువుల నీళ్లు తాగించిన బలగాలు అవి… ఇప్పుడు ఆయన కొడుకు అహ్మద్ అక్కడ నాయకత్వం వహిస్తున్నాడు… సాలే, అహ్మద్ కలిసి తాలిబన్ల వ్యతిరేక జెండా ఎగరేశారు ఇప్పుడు… దేశానికి అపద్దర్మ అధ్యక్షుడిని నేనే అని ప్రకటించాడు సాలే…

panjshir

ఈ ఇద్దరికి మాజీ రక్షణమంత్రి బిస్మిల్లాఖాన్ తోడుగా నిలిచే సూచనలున్నయ్… వీళ్లు ఓ కూటమి… ఇంకా తాలిబన్ల వ్యతిరేక తెగల్ని కూడా కలుపుకుని ఓ బలమైన కూటమిని ఏర్పాటు చేయాలనేది ఆలోచన… గతంలో తాలిబన్ల ప్రభుత్వాన్ని కూల్చేయడానికి అమెరికాకు మద్దతునిచ్చింది ఈ ప్రాంతం… ఇప్పటికీ అమెరికాతో బాగుంటారు… కానీ అమెరికాయే అన్నీ వదిలేసి ఉడాయించింది… ఈ అలయెన్స్, ఈ లోయ బలగాలు ప్రస్తుతం తాలిబన్లకు, పాకిస్తాన్‌కు, రష్యాకు… సహజంగానే చైనాకు వ్యతిరేకులు… వీళ్లు బేసిక్‌గా తజిక్స్… అప్ఘనిస్తాన్ ఎగువన ఉండే తజికిస్తాన్‌లో వీళ్లదే అధికారం… అది కూడా తాలిబన్లకు వ్యతిరేకమే… ఈ తజికిస్తాన్ మన మిత్రదేశం… మనకు ఎయిర్ బేస్ కూడా ఉంది ఆ దేశంలో… సో, బెలూచిస్తాన్ విముక్తి పోరాటం, పీవోకే విముక్తి పోరాటాలకు రహస్యంగా మద్దతునిస్తున్నట్టే ఇక పంజ్ షీర్‌కు మద్దతు ఇవ్వాలా మనం..? ఇవ్వగలమా..? ఇప్పటికే మనం అప్ఘన్‌లో వేల కోట్లను వృథాగా గుమ్మరించామా..? ఇంకా ఇంకా చేతులు, మూతులు కాల్చుకోవాలా..? ఇదీ ఉన్నత స్థాయిలో జరుగుతున్న డిబేట్…

sara kheta

‘‘ఐదు సింహాలు’’ ఏం చేయబోతున్నయ్..?!  తాలిబన్ల ప్రత్యేకదళం ‘సరా ఖేటా’ను తట్టుకోగలవా చూడాలి… సరా ఖేటా అంటే చెప్పనేలేదు కదూ… దీన్ని రెడ్ గ్రూపు, రెడ్ యూనిట్, బ్లడ్ యూనిట్, డేంజర్ గ్రూప్, స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ అని కూడా పిలుస్తూ ఉంటారు… తాలిబన్లలోనే మెరుపుదళం ఇది… నేవీ సీల్స్ తరహాలో ప్రత్యేక కమెండో యూనిట్… అన్నిరకాల యుద్ధవిద్యల్లో తర్ఫీదు పొందిన బలగం… గతంలో లేదు… 2016లో ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేశారు… టార్గెట్లను వేటాడటానికి తాలిబన్లు ప్రయోగించే దళం ఇది… సో, ఈ ఎర్రబలగానికి తాజా బాధ్యత ఈ పంజ్ షీర్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions