కామారెడ్డి, కలెక్టర్, శరత్…. సిద్దిపేట వెంకట్రామారెడ్డిలాగే బహిరంగంగా సీఎం కాళ్ల మీద పడిపోయిన కేరక్టరే కదా అనిపించింది హెడింగ్, డేట్లైన్ చూడగానే..! కానీ వార్త చదివితే ఆసక్తికరంగా ఉంది… ఎప్పట్లాగే ఇతర పత్రికలకు ఈ మానవాసక్తి కథనం పట్టలేదు, కానీ ఇలాంటి వార్తలు అవసరం… ప్రాధాన్యం అవసరం… ఇలాంటి మంచి పనులు చేసే అధికారులకు మీడియా గుర్తింపు, నాలుగు మెచ్చుకోలు వాక్యాలు, చప్పట్లు అవసరం… ఇతర కలెక్టర్లయినా కాస్త చూసి, ఒకరో ఇద్దరో కదులుతారేమో… దిక్కుమాలిన గుమస్తాగిరీ తప్ప ఇంకేమీ లేని కలెక్టర్ కొలువులో ఒకరిద్దరైనా మనసుతో పనిచేస్తారేమోనని ఆశ… సరైన జడ్జిమెంట్, ఇంపార్టెన్స్ దక్కకపోయినా సరే… ఇలాంటి హ్యూమన్ ఇంట్రస్టు స్టోరీలను రాయడంలో ఆసక్తి, చొరవ చూపించే రిపోర్టర్లందరినీ అభినందిద్దాం… అనివార్యమైన సొల్లు రాజకీయ భజన వార్తల నడుమ ఇలాంటి వార్తలే కదా జర్నలిస్టులకూ ఆత్మతృప్తినిచ్చేవి…
కరోనా వేల కుటుంబాల్లో చీకట్లు నింపింది… బతుకుల్ని బజారులో పడేసింది… కామారెడ్డిలో రాజేష్, స్రవంతి జీవితాలూ అంతే… వారం వ్యవధిలో కరోనాకు బలైపోయారు… ఇద్దరు పిల్లలు… అనాథలైపోయారు… వీళ్లే కాదు, దేశంలో కరోనా వల్ల అనాథలైన పిల్లల సంఖ్య వేలల్లో ఉంది… మన సర్కారుకే సరైన సోయి లేదు, హ్యూమన్ యాంగిల్ లేదు, ఎంతసేపూ పొలిటికల్ పథకాలు తప్ప మరో బాట లేదు, మరో మాటలేదు… కానీ చాలా రాష్ట్రాలు కరోనా అనాథల కోసం మానవీయ కోణంలో మంచి ఉదారమైన పథకాల్ని ప్రవేశపెట్టాయి… కాస్తోకూస్తో ఆ పిల్లల కన్నీళ్లను తుడిచి, అవి కన్నీళ్లు తుడుస్తాయి… కానీ ఇక్కడ కామారెడ్డిలో కలెక్టర్ ఓ మంచి పని చేశాడు… ఆ పిల్లలకు నానమ్మ ఉంది… పెద్ద దిక్కు ఆమే… కానీ రాజేష్ గతంలో తీసుకున్న ఇంటి లోన్ 18 లక్షల దాకా ఉంది… పిల్లల్ని ఎలాగోలా పోషించగలదేమో గానీ ఆ రుణం తీర్చే స్థోమత ఆమెకు లేదు… నెలనెలా వాయిదాలు కట్టాలి… ఆమె దగ్గర డబ్బెక్కడిది..?
Ads
రిపోర్టర్ ఆ కుటుంబం దుస్థితి మీద ఓ స్టోరీ రాశాడు… గుడ్… అభినందనలు… కన్నీళ్లను, కష్టాల్ని అక్షరాలుగా రాసే రిపోర్టర్లు ఎందరున్నారు ఈరోజుల్లో..? రాయించుకునేవాళ్లు ఎవరున్నారు..? ‘‘కొడుకు, కోడల్ని పొట్టన పెట్టుకుంది’’ పేరిట ప్రచురితమైన ఆ స్టోరీని చూశాడు కలెక్టర్… స్పందించాడు… ఎక్కడో గుండెలో తడి మిగిలిన కలెక్టర్ కావచ్చు… (నిజానికి ఇప్పుడు కలెక్టర్లకు ఆ సోయి ఎక్కడిది..?) బ్యాంకర్లతో మాట్లాడాడు… ఆ మొత్తం బాకీలో 10 లక్షల వరకూ దాతలు సమకూర్చారు… మిగతా 8 లక్షలను బ్యాంకు మాఫీ చేసింది… ఒక్కసారి ఆలోచించండి… మన దేశంలో కేవలం నీచ్ కమీనే వ్యాపారులు, నాయకులు, దళారులకే వేలు, లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేసే మన ఘనమైన బ్యాంకులు ఒక పేద కుటుంబానికి సంబంధించిన రుణాన్ని మాఫీ చేయడం అనే వార్తే ఎంత ఆసక్తికరంగా ఉందో… నిజానికి ఆ బ్యాంకు మేనేజర్ ఓటీఎస్ పద్ధతిలో చేశాడా, లేక ఏ మార్గంలో మాఫీ చేశాడనే క్లారిటీ వార్తలో లేదు, ఉంటే సమగ్రత వచ్చేది… ఇలాంటి కేసుల్లో వేరేవాళ్లు కూడా ఇలాగే అప్రోచ్ అయ్యే చాన్స్ ఉండేది… వార్తకు సరైన ప్రాధాన్యమూ దక్కలేదు… మన మెయిన్ స్ట్రీమ్ దరిద్రం తెలిసిందే కదా…!! మరి మన టీవీలు ఇలాంటి వార్తలు ఎందుకు ప్రసారం చేయవు..? భలేవారే… తాలిబన్లు సమాజసేవ చేస్తారా..?! యాంకర్ అనసూయ స్కర్టు సైజు ఎందుకు తగ్గిందనే అంశంపై రెండు గంటల డిబేట్ నడిపించమంటారా చెప్పండి, తక్షణం రెడీ అయిపోతాయి…!!
Share this Article