ఇప్పుడంతా తాలిబన్ల వార్తలే కదా… తాలిబన్లు అనగానే మనకు గుర్తొచ్చే చేదు అనుభవం అప్పట్లో 1999లో జరిగిన ఓ ఫ్లయిట్ హైజాక్… ఖాట్మండు నుంచి వచ్చే విమానాన్ని దారి మళ్లించి, కాందహార్‌కు తీసుకుపోయారు ఉగ్రవాదులు… వాళ్లకు రక్షణ ఇవ్వడమే కాదు, వాళ్లు విడిపించుకున్న ఉగ్రవాదులతో సహా క్షేమంగా దేశం దాటడానికి సహకరించింది అప్పటి తాలిబన్ ప్రభుత్వం… ఇప్పుడిది చెప్పడం దేనికీ అంటే… కొన్ని హఠాత్తుగా కొందరికి ఉపయోగపడతయ్… అలాంటి హైజాక్ ఇన్సిడెంటు మీద ఆధారపడి నిర్మించిన బెల్ బాటమ్ సినిమా ఇప్పుడు విడుదలైంది… అసలే దేశభక్తి సినిమాల ట్రెండింగ్, అందులో ఫ్లయిట్ హైజాక్ స్పెషల్, అందులోనూ సినిమా హీరోలకు కిక్కునిచ్చే అండర్ కవర్ ఏజెంటు కథ, ఇలాంటి సినిమాలకు బాగా అలవాటుపడిన అక్షయ్‌కుమార్… ఇంకేం కావాలి..? బెల్ బాటమ్ సినిమాకు మంచి ప్రచారం, హైప్ వచ్చేసింది… అఫ్ కోర్స్, సినిమా కూడా బాగానే తీశారు…
ఈ ఇందిరాగాంధీని గుర్తుపట్టారా..? ఆమె కూడా ఈ సినిమా కథలో కీలక పాత్రధారి… లారా దత్తాను మేకప్ నిపుణులు అచ్చంగా ఇందిరా గాంధీని చేసేశారు ఇలా… ఊరికే తూతూమంత్రం మేకప్ గాకుండా, ముంగురులకు కాసింత తెల్లరంగేసి వదిలేయకుండా… మొహంలో ఆ పొడుగు ముక్కు గట్రా పోలికలు బాగా కుదిరేలా ప్రయాసపడ్డారు… లారా కూడా ఆ పాత్రను సటిల్డ్‌గా పోషించింది… హీరోయిన్ వాణీమోహన్ ఉన్నది కాసేపే… దీంతో లారా దత్తాకు ఎక్కువ మైలేజీ దక్కింది సినిమాలో… ఇక అక్షయ్‌కుమార్ గురించి చెప్పడానికి ఏముంది..? ఇలాంటి పాత్రలు తనకు అలవాటే కదా, అలవోకగా నటించేశాడు… ముందే చెప్పినట్టు సినిమా కథాంశం ఓ ఫ్లయిట్ హైజాక్… అప్పట్లో… అంటే ఎయిటీస్, నైన్టీస్‌లలో మన విమానాల్ని ఎడాపెడా హైజాక్ చేసేవాళ్లు కదా… ఏడేళ్లలో అయిదు హైజాకులు జరిగినట్టున్నయ్… డబ్బు, ఉగ్రవాదుల్ని విడిపించుకోవడం… ఈ సినిమాలో అక్షయ్ కుమార్ RAW ఏజెంట్… తన సీక్రెట్ కోడ్ నేమ్ బెల్ బాటమ్… అదీ ఈ సినిమా పేరు కథ…
Ads
కరోనా సంక్షోభం కాస్త సద్దుమణుగుతున్నట్టు కనిపిస్తోంది కదా… పాండెమిక్ అనంతరం ఓ పెద్ద సినిమా దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడం ఇదే తొలిసారి… (మహారాష్ట్రలో ఇంకా లేదు…) సినిమా కూడా కమర్షియల్‌గా క్లిక్ అయ్యే సూచనలుండటంతో ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి మొత్తం ఈ సినిమా వసూళ్ల మీదే ఉంది… ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరి కావాలిప్పుడు… త్రీడీ వెర్షన్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు… సినిమా కథకొస్తే… ఇందిరాగాంధీ ప్రధాని… విమానం హైజాక్ అయ్యాక పాకిస్థాన్ అధ్యక్షుడు జియా వుల్ హక్‌తో మాట్లాడి హైజాకర్లతో సంప్రదింపులకు పూనుకుంటుంది… అప్పటికే అయిదు హైజాకుల్ని అధ్యయనం చేసిన హీరో సంప్రదింపులు వద్దంటాడు, ప్రభుత్వాధినేతల్లో విశ్వాసాన్ని కలిగిస్తాడు… తన ప్లాన్ ‘వర్కవుట్’ అవుతుంది… తను ఏం చేశాడు..? ఎలా చేశాడు అనేవి సస్పెన్స్…!!
Share this Article