హంగెర హరీష్… కడుపు చేత్తో పట్టుకుని 2014లో సౌదీ అరేబియా వెళ్లాడు… ఎయిర్ కండిషనర్ మెకానిక్‌గా పనిచేసేవాడు… తనది కర్నాటకలోని ఉడిపి జిల్లా, బీజడి… భార్య సుమన ఇక్కడే అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తూ ఉంటుంది… ఒక బిడ్డ… ఇధీ తన జీవితం… ఇవ్వాళారేపు అందరికీ ఉన్నట్టే తనకూ ఓ ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది… ఎప్పుడో ఓసారి దానివైపు వెళ్లేవాడు… అకస్మాత్తుగా తన వాల్ మీద రకరకాల పోస్టులు కనిపించసాగాయి… అందులో ఒకటి సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌ను కించపరిచేది… సౌదీ రాజకుటుంబం మీద ఎవరైనా ఏ వ్యతిరేక వ్యాఖ్య చేసినా వాళ్లు ఎంత సీరియస్‌గా తీసుకుంటారో తెలుసు కదా… దీనికితోడు మరో పోస్టు… అదేమిటంటే… ప్రపంచంలోని కోట్ల ముస్లింలు ఆరాధించే మక్కాలో రామమందిరం నిర్మించాలట… అదీ కంట్రవర్సీ పోస్టే… దైవదూషణ, రాజదూషణ… వీటిపై సోషల్ మీడియాలో రచ్చ మొదలుకాగానే సౌదీ పోలీసులు గంటల్లోనే హరీష్‌ను పట్టుకుపోయి లోపలేశారు…
నాకు సంబంధం లేదు మొర్రో అని మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు… ఇదంతా 2020 డిసెంబరులో… మన ప్రభుత్వ కార్యాలయాల్లాంటిదే కదా విదేశాంగ శాఖ కూడా… అదీ పట్టించుకోలేదు… హరీష్ భార్య సుమన ఉడిపి సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేసింది… తన భర్త ఫేస్‌బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసినట్టున్నారనీ, మాకు సంబంధం లేకుండానే వివాదాస్పద పోస్టులు ఎవరో పెడుతున్నారనీ, తనకు ఎదురైన సమస్య ఇదీ అని ఫిర్యాదులో పేర్కొంది… పోలీసులు కాస్త లోతుగానే తవ్వారు… దాంతో ఇద్దరు హ్యాకర్ల పేర్లు బయటికి వచ్చాయి… ఆ ఇద్దరి పేర్లూ Abdul Uais, Abdul Tuves… దగ్గరలోని మూడబిదిరి వాళ్ల ఊరు… (కేసు మీద వేర్వేరు మీడియా వేర్వేరు కథనాలను రాస్తోంది… పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్‌సీ అనుకూలంగా హరీష్ పోస్టులు పెట్టాడనీ, మంగుళూరు అల్లర్ల వీడియో పోస్ట్ చేశాడనీ, దాంతో కక్షపెట్టుకున్న ఇద్దరు నిందితులు హరీష్ పేరిట తామే ఓ ఖాతా ఓపెన్ చేసి, హరీష్‌ను ఇలా బుక్ చేశారనీ ఒక వాదన… హరీష్ తన సొంత ఖాతాను డియాక్టివేట్ చేసుకున్నాడనీ, తన భర్తకు అసలు ఖాతాయే లేదని భార్య సుమన పోలీసులకు చెప్పిందని ఆ వార్త సారాంశం…) ఆ ఇద్దరి మీద కేసు పెట్టి, ఈ వివరాల్ని పోలీసులు విదేశాంగ శాఖకు పంపించారు… ఈ శాఖలో ఎంతకీ కదలిక రాదు… నెలలు గడుస్తున్నాయి… ఈలోపు హరీష్ కొలువు పోయింది… సౌదీలోని మన ఎంబసీకి వివరాలు పంపిస్తే, వాళ్లు అక్కడి పోలీసులకు సమాచారం ఇస్తే, వాళ్లు కన్విన్సయి విడిచిపెడితే ఈ కేసు తెమిలేది… నడిచీ నడిచీ ఎట్టకేలకు, ఇన్నాళ్లకు 600 రోజుల తరువాత కొలిక్కి వచ్చింది… సౌదీ పోలీసులు హరీష్‌ను వదిలిపెట్టారు… హరీష్ తిరిగి వచ్చేశాడు… ఈరోజు ఉదయం బెంగుళూరు ఎయిర్‌పోర్టులో దిగాడు…
Ads
ఇక్కడ విషయం ఏమిటంటే..? అసలు ఫేస్ బుక్ ఖాతా ఉండటమే సమస్య… ఎవడో దాన్ని హ్యాక్ చేస్తాడు, ఏవేవో రాసేస్తాడు… కారణాలు ఏవైనా కావచ్చుగాక… ఇరుక్కునేది మనం… నా తప్పేమీ లేదు మొర్రో అని మొత్తుకున్నా ఎవడూ వినడు… శ్రమ, ప్రయాస, మనోవ్యధ, ఖర్చు… బంధుమిత్రుల్లో ఆందోళన… ఆఫీసుల చుట్టూ తిరగడం… నిజం.., ప్రత్యేకించి చట్టాలు కఠినంగా ఉండే అరబ్ దేశాల్లో మనవాళ్లు చాలామంది సోషల్ మీడియాలో అజాగ్రత్తగా ఉంటున్నారు… ఇటీవల ‘దొంగలు’ అందరి ఖాతాల్ని క్లోన్ చేసి, డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా… కడుపు చేత్తో పట్టుకుని ఎక్కడికో పోయి బతికేవాళ్లూ బహుపరాక్… సోషల్ మీడియా ఖాతాల్లేకపోతే మరీ మంచిది… చేదుగా అనిపించినా నీతి అదే… అంతెందుకు..? చాలా మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగులు ప్రవర్తన మీద నిఘా వేయటానికి వాళ్ల సోషల్ మీడియా పోస్టుల్ని విశ్లేషిస్తుంటయ్… అందుకే చాలామంది ఉద్యోగులకు ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలున్నా సరే, పెద్దగా యాక్టివిటీ ఉండదు… సో, కేర్‌ఫుల్…!!
Share this Article