చిన్న సరదా ముచ్చటే లే…. ఎంతసేపూ కాలుష్యపు రాజకీయ పోస్టులు, దరిద్రపు నాయకుల సంగతులు దేనికిలే గానీ…. ఎంచక్కా ఫుడ్స్ వైపు వెళ్లిపోదాం… ఫుడ్ అనగానే తెలంగాణలో సర్వపిండి… నాన్ వెజ్ కాదు, వెజ్… తపాలచెక్క అని కొన్నిచోట్ల అంటారుట, మనకు తెలియదు… మా దగ్గర మాత్రం ఎంచక్కా సర్వప్ప అంటాం… నిజానికి తెలంగాణ అధికారిక వంటకం సకినాలా, సర్వపిండా అని పోటీపెడితే రెండింటికీ సేమ్ మార్కులొస్తయ్… అచ్చం, తెలుగు సినిమాల్లో, టీవీ సీరియళ్లలో తెలంగాణ మాండలికాన్ని భ్రష్టుపట్టిస్తున్న తరహాలోనే ఈ సర్వపిండినీ హైదరాబాద్ హోం ఫుడ్స్ సెంటర్లు భ్రష్టుపట్టిస్తున్నయ్… కాదు, కాదు, యూట్యూబ్ వీడియోలు అసలైన ధ్వంసకారకాలు… ఈ విశేష వంటకాన్ని నాశనం చేస్తున్నయ్, చివరకు ఎంత దరిద్రం అంటే, ఆలేరుకు చెందిన ది వరల్డ్ ఫేమస్ వాచెఫ్ సంజయ్, ఆయన భార్య రాగిణి కూడా చెడిపోయారు… అఫ్ కోర్స్, సిద్దిపేట ఫేమస్ సర్వపిండి, సకినాల సప్లయర్స్ కూడా…. ఇక విషయంలోకి వస్తే…
హైదరాబాదులో ఓ చోట… గట్టిగా మిర్చి బజ్జీలు, పకోడీ, పునుగులతోపాటు సర్వపిండి అమ్ముతోంది ఒకామె… గట్టిగా, కటకట అంటోంది చూస్తుంటేనే… మెత్తగా ఏమీ లేవామ్మా అంటే… ఇప్పుడే వేస్తున్నాం (??) చూసి తీసుకో అంది… చూడబోతే ఫుల్లు నూనెలో గోలిస్తున్నట్టుగా ఉంది… నూనెలో గోలిస్తే అది అప్పాలు, ఓడప్పలు, వడప్పలు, గారెపప్పలు అంటారు తప్ప అది సర్వపిండి ఎలా అవుతుంది… అంటే..? వీళ్లెవరికీ సర్వపిండి బేసిక్స్ తెలియవు అని అర్థం… అసలు సర్వపిండి అంటేనే నూనెతో పెద్ద లింక్ లేకుండా కాల్చుకునే రొట్టె… కాకపోతే అందులో పల్లీలు, శెనిగెపప్పు వేసుకుంటాం, అంతే తేడా… కానీ ఇప్పుడేమీ చేస్తున్నారు, ఏకంగా ఫుల్లు నూనె పోసేసి, కాలుస్తున్నారో, గోలిస్తున్నారో తెలియకుండా నాశనం చేస్తున్నారు… పళ్లు విరిగేలా గట్టిగా… పళ్లు విరగ్గొట్టాలని అనిపించేలా గొట్టుగా….
Ads
వీళ్లకు తెలియంది ఏమిటంటే… అప్పాలు కూడా అప్పటికిప్పుడు తినేందుకు వీలుగా ఉల్లిపాయలు వేసి మెత్తగా గోలించుకునేవి ఉంటయ్… అంచుకు మామిడి కాయ సోగి (ఆవకాయ) లేదా మామిడిరసం లేదా గడ్డ పెరుగు సూపర్… అవేవీ లేకుండా కాస్త గట్టిగా అయ్యేలా గోలించుకుంటే నాలుగు రోజులు నిల్వ ఉంటయ్… సేమ్, సర్వపిండి… మీరు చూసే సవాలక్ష యూట్యూబ్ వీడియోల్లాగా పెండాబెల్లం కలిపి వేసేయకండి ఆ పిండిలో… అదేరోజు అప్పుడే తినే పక్షంలో ఉల్లిపాయముక్కలు, వీలైతే ఉల్లికాడల ముక్కలు… ఒక చిప్ప లేదా సర్వలో ఒత్తుకోవాలి… నువ్వులు వోకే… శెనిగె పప్పు వోకే, కానీ నానబెట్టాల్సిన పనిలేదు… అంతకుముందే వేయించిన పల్లీలు… కాస్త వాము, కాస్త జిలకర… వీలైతే లైటుగా గసగసాలు… అంతే… గిన్నెకు కాస్త నూనె, అది మాడకుండా ఉండేందుకు… మధ్యమధ్యలో తూట్లు… పైన మొత్తం మెత్తగా… కింద కడక్ కడక్… అదీ సర్వపిండి అంటే..! నిజానికి సర్వపిండి అంటే దూరప్రయాణాలకు కూడా అనువైన వంట… అందుకే ఉల్లి గట్రా వేయరు, త్వరగా పాచిపోతుంది అని… ష్, మరీ వాస్తవం చెప్పాలా..? సర్వపిండి అంటేనే చల్లారిన తరువాత అద్భుతం… అది సరిగ్గా కుదరాలే గానీ, గడ్డ పెరుగు పక్కనుంటే జిహ్వ జివ్వుమనాలి… మరీ హైదరాబాద్ హోం ఫుడ్స్ ఫేక్ సర్వపిండిలా కాదు… కాదు..!!
Share this Article