పెళ్లి… ఈమధ్య అన్నీ అభిజిత్ లగ్నాలే కదా… అంటే, మనకు ఇష్టమొచ్చిన ముహూర్తాన్ని, వేళను పురోహితుడు ఖరారు చేసి, మీ ఖర్మ అని చేతులు దులిపేసుకుంటాడు… దేవుళ్లు పెళ్లిళ్లనే అభిజిత్ లగ్నాలకు మార్చేశారు మన పండితులు… మామూలు మనుషుల పెళ్లిళ్లు అనగా ఎంత..? అసలు జాతకాలను బట్టి ముహూర్తాలు, పెళ్లిళ్లు అనేది పాతరాతి యుగపు సంప్రదాయం అయిపోయింది… అసలు జాతకాలు కలవకపోతే అమ్మాయి పేరు అప్పటికప్పుడు అర్జెంటుగా మార్చేసి, శుభ పత్రికలు అచ్చేసి… గ్రహగతుల్ని తిరగరాయడం కదా ఈరోజుల్లో ట్రెండ్… పేర్లు మార్చేస్తారు సరే, మరి పుట్టుక క్షణాన్ని బట్టి కదా జాతకం ఉండేది అనడక్కండి, కళ్లు పోతయ్… అవసరాన్ని బట్టి మారని పంచాంగాలు దేనికి మరి..?! ఇలాంటి ముహూర్తాలు పెట్టే పంతుళ్లనే పంచమాంగదళం అంటారేమో… సరే, ఇప్పటి భాషను బట్టి ఓ ఛాందసుడు తెల్లవారుజామున ముహూర్తం పెట్టుకున్నాడు… ఆ కష్టాలు వేరే… తరలివచ్చే బంధుగణానికి తగిన వసతి, మర్యాదలు ఓ యజ్ఞమే…
రానీ రానీ కష్టాల్ నష్టాల్ రానీ అనే శ్రీశ్రీ స్పూర్తితో తెల్లవారుజాము ముహూర్తమే పక్కా చేసుకున్నారు ఇరుపక్షాలు… పెళ్లికి ముందే విందు భోజనం… ఎలాగూ భోజనం పెడుతున్నాం కదా అని అదే రిసెప్షన్ అనుకున్నారు… ఇద్దరిదీ సేమ్ నగరం కదా… పెళ్లయినా, రిసెప్షనయినా అదే… ఆవరణలోకి అడుగుపెట్టగానే కాస్త అత్తరు పూశారు, చెంపల కిందుగా గంధం అద్దారు… వెంటనే ఇద్దరు అమ్మాయిలు దగ్గరకు వచ్చి, పకోడీ, బజ్జీలు వంటి ఏవో మూడు రకాల స్నాక్స్ ఉన్న ప్లేట్ చేతుల్లో పెట్టారు, మరొకాయన బాదాంపాల గ్లాసు ఇచ్చాడు… బాగుంది… లోపలకు వెళ్లి చూద్దుం కదా… ఓ వేదిక, సోఫా వంటి ఓ పెద్ద కుర్చీపై వధూవరులు… రెండు పక్కల తల్లిదండ్రులు… వచ్చీపోయే అతిథులు అక్షింతలు వేస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు… డ్రోన్‌కు బిగించిన కెమెరా ఝుమ్మంటూ వీడియోల్ని తెగ రికార్డు చేసేస్తోంది… పెళ్లి కాకముందే అక్షింతలా..? ఆశీర్వచనాలా..? పర్లేదులే, ఆల్రెడీ నిశ్చితార్థం అయినవాళ్లే కదా. కాసేపట్లో ‘తాళిబంధం’ కూడా తప్పదు కదా… వెళ్లాం, ఫోెటోల కోసం మొహమంతా నవ్వు పులుముకున్నాం… అక్షింతలు వేశాం… తోచినకాడికి కట్నమేదో కవరులో గుట్టుగా పెట్టేసి, వాళ్ల చేతుల్లో పెట్టేశాం… గతంలోలాగా కట్నాలు రాసేవాళ్లు ఎవరున్నారు ఇప్పుడు..? వేదిక దిగాం… దేశం మొత్తాన్ని పిలవాలనే తిక్క తాపత్రయం గాకుండా సన్నిహితులనే పిలిచినట్టున్నారు… రష్ లేదు… జనజాతర జరిగితేనే ఘన ఇజ్జత్ అనే భావజాలం కాదన్నమాట… హమ్మయ్య…
Ads
సర్ ప్రయిజ్… నేల మీద భోజనాలు… అయ్యో, ఇప్పుడెలా, అలవాటు తప్పిందే… అసలు కూర్చుని తినగలమా..? కూర్చున్నాం… అరిటాకులు వేశారు, అలా కనిపించే ప్లాస్టిక్‌కు కాగితాలు కాదు, నిజమైన అరిటాకులే, ఎక్కడ నుంచి తెప్పించారో, వావ్… నీళ్లు చల్లి కడుక్కున్నాం… ముందుగా కాస్త ఉప్పు… అబ్బ, ఇదీ పద్దతి, తరువాత లడ్డూలు… బాదుషాలు… కాస్త పరమాన్నం… అంచుకు వేడి మిర్చి బజ్జీలు, ఆలూ బోండాలు… నో నూడుల్స్, నో వెస్టరన్, నో చాట్, నో టిఫిన్స్, నో చైనీస్… నో నాన్సెన్స్, నో బఫే ఎట్ ఆల్, నో బార్బేరియస్ ఎట్ ఆల్… అసలు ఆకులో కూడా నో కటోరీస్… పిలిచి వడ్డించమనడమే… ఎన్నంటే అన్ని లడ్డూలు… అసలు లడ్డూలు లేని పెళ్లేమిటబ్బా… మెతీచూర్, ట్రెడిషినల్… రెండూ… పెళ్లి భోజనం నుంచి లడ్డూ మాయమై ఇప్పుడంతా స్వీట్ చాట్… అంటే స్వీట్లన్నీ కలిపి, నరికి చేతిలో పెట్టడమే కదా… సరే, మెల్లిమెల్లిగా కానిస్తున్నాం… నిమ్మ పులిహోర, చింత పులిహోర, కొబ్బరన్నం, పొంగల్, కిచిడీ, మిరియాల అత్తెసరు… అయిదారు రకాల రైస్ ఐటమ్స్… కాస్త కాస్త… తింటే మరికాస్త… అంచుకు అప్పడాలు, చల్లమిరపకాయలు… రెండురకాల ఊరగాయలు సరేసరి… ఇంకేం ఇంకేం కావాల్లే, చాల్లే ఇది చాల్లే… పూరీలు, దాంట్లోకి కూర… కడుపు ఖాళీగా మిగిలితే కాస్త తెల్లన్నం… కరివేపాకు, చిన్నెంగాకు, వెల్లుల్లి పొడులు… గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, ఆలూటమాట, దొండ ఫ్రై, బెండ పులుసు… ములక్కాడల సాంబారు, చివరలో గడ్డ పెరుగు, కావాలంటే రసం… లేచి నిలబడటానికి కాస్త కష్టమే అయ్యింది… నో సుగర్ రెస్ట్రిక్షన్స్ టుడే… నో ఒబేసిటీ కంట్రోల్స్ టుడే…
వెంటనే వెళ్లిపోదాం అనుకున్నవాళ్లం కూడా అలాగే కాసేపు పాన్ తింటూ కూర్చుండిపోయాం… కాసేపు కునికిపాట్లు అక్కడే… ఇక పెళ్లి తంతు మొదలైంది… ఆహుతులు అందరూ వెళ్లిపోయారు, ముఖ్యమైన వాళ్లే మిగిలారు… పంతులు తాపీగా పద్ధతి ప్రకారం తంతు చేయిస్తున్నాడు… ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ హంగామా కూడా తగ్గిపోయింది… అసలు ఇప్పుడు వాళ్లే కదా పెళ్లి పంతుళ్లు… నిద్ర రావడం లేదు, ఆనందంగా ఉంది… చూస్తుండగానే తెల్లారింది… కాఫీలు వచ్చాయి… మొహాలు కడుక్కోవడం తరువాత సంగతి… కాఫీ లాగించి, కాస్త దూరంలోని బాత్రూంల్లో గబగబా నీళ్లు పుక్కిలించి, కాలకృత్యాలు తీర్చుకుని, వచ్చామో లేదో… టిఫిన్లు రెడీ… పొగలు గక్కే ఇడ్లీ, వడ… వేడిగా అప్పం, చిన్న చిన్న దోసెలు… కావాలంటే ఊతప్పం… అలూ మసాలా కూర… నెయ్యి, పొడి సరేసరి… తోడుగా పొంగల్… అన్నీ దంచేసి, మెల్లిగా బయటపడి కారు దగ్గరకు చేరేసరికి భుక్తాయాసం… ఈరోజంతా ఉపవాసం చేస్తే తప్ప ఆ కేలరీలు ఖర్చు కావు, ఆ కార్బో హైడ్రేట్‌లూ బయటికిపోవు… నో సంగీత్, నో మెహెందీ, నో రోకా, నో సపరేట్ రిసెప్షన్, నో బరాత్, నో అట్టహాసం… డిఫరెంటుగా… డీసెంటుగా… కడుపు నిండుగా నింపి, నిండు మనసుతో శుభాక్షితలు కోరుకున్న పెళ్లి……… ఏమయ్యా, లేస్తావా..? చాయ్ ఇప్పుడే తాగుతవా, వాకింగు పోయొచ్చాక తాగుతవా…. అని పెద్దగా చెవుల్లో పిలుపు, భళ్లున తెల్లారింది… మెలకువ వచ్చేసింది…!!
Share this Article