ఒక్కసారి వెనక్కి తిరిగి ఓసారి పరిశీలించండి… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పలు సినిమాల్లో నటించాడు… డబ్బు కోసం కాదు, కీర్తి కోసం కూడా కాదు… సరదా కోసం… సన్నిహితుల మొహమాటం కోసం… తనలోని నటుడిని తృప్తిపరచడం కోసం… అంతే… అదేసమయంలో ఏమాత్రం వెకిలితనం లేని పాత్రల్నే ఎంచుకున్నాడు… కాస్త హ్యూమర్ టచ్ ఉన్న పాత్రలు… మిథునం సినిమాలోనైతే నో మేకప్, కాస్త పౌడర్ కూడా పూసి ఉండరు… తన స్థాయిని దిగజార్చుకోకుండా తన నటనాభిలాషను తీర్చుకున్నాడు… వెళ్లిపోయాడు… బాలుకు అత్యంత సన్నిహితుడు, బాలు రేంజులో కాకపోయినా సరే, 15 భాషల్లో దాదాపు పాతిక, ముఫ్పై వేల పాటల్ని పాడి, వందల కచ్చేరీలు కూడా చేసిన మనో అలియాస్ నాగూర్ బాబు ఏం చేశాడు మరి..? మన తెనాలి కేరక్టరే… క్రేజీ అంకుల్స్ అనే ఓ ట్రిపుల్ ఆర్ చిల్లర సినిమాలో నటించాడు దేనికి…? చిల్లర సినిమా అనడానికి పెద్ద సాహసం అక్కర్లేదు… దాని రేంజ్ అదే… ఇక్కడ ఆర్ఆర్ఆర్ అంటే రెడ్డి, రాజు, రావు… ప్చ్, ఇక్కడ కూడా సామాజిక సమతుల్యత… అఫ్ కోర్స్, అలాంటి సినిమాలు వస్తూనే ఉంటయ్, పోతూనే ఉంటయ్, వాటి గుణగణాల గురించిన చర్చ అవసరం లేదు… ఇక్కడ మాట్లాడుకునేది మనోెకు ఆ ఖర్మ ఏం పట్టిందని..? అంత గతిలేకుండా ఉన్నాడా ఇప్పుడు..?
మొన్న ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ… ట్రెండ్ మారింది, పాటలేవీ రావట్లేదు అన్నాడు… కావచ్చు, అంతటి బాలునే పక్కన పడేసింది ఇండస్ట్రీ… కొత్తనీరు వస్తున్నప్పుడు పాతనీటికి చోటెక్కడ ఉంటుంది..? చాలామంది డాన్స్ మాస్టర్లకు ఇప్పుడు కూడు పెడుతున్నవి టీవీ షోలు… కామెడీ కూడా పోషిస్తూ ఏదో కథ నడిపిస్తున్నారు… మనో కూడా అంతే , ఆ బూతుల, దరిద్రపు జబర్దస్త్ స్కిట్లు చూస్తూ, చప్పట్లు కొడుతూ, నవ్వు నటిస్తూ ఏదో జడ్జి పాత్రను నడిపిస్తున్నాడు… దానికితోడు ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ క్రేజీ పాత్ర… ఆ పాత్ర అవసరమా తనకు..? స్థాయిని దిగజార్చుకోవడం కాదా..? నిజానికి నడివయస్సు పురుషులు తమ పెళ్లాల దగ్గర సుఖం లేనప్పుడు రకరకాల మార్గాల్లోకి మళ్లుతుంటారు… కొందరు పేకాట, కొందరు మందు, కొందరు మరింత వర్క్, కొందరు ‘పక్క చూపులు’… ఈ కంటెంటుతో బోలెడు సినిమాలు వచ్చాయి… తెలుగులో కూడా… ఉదాహరణకు… చిరంజీవి, రాధిక నటించిన ప్రేమపిచ్చోళ్లు సినిమా… కోదండరాంరెడ్డి దర్శకత్వం… అందులో గుమ్మడి, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య ‘పిచ్చోళ్లు… అదేనండీ, క్రేజీ అంకుల్స్ పాత్రల్ని పోషించారు… ఇజ్జత్ తీసుకున్నారు… మళ్లీ అలాంటి పాత్రల జోలికి పోలేదు… సరే, మనో సంగతికి వద్దాం… ‘ప్రతి సింగర్‌లోనూ నటుడు ఉంటాడు’ అన్నాడు మొన్న… కానీ ఆ నటుడికి మరీ ఇలాంటి కుతి తీర్చే ప్రయత్నం ఎందుకు మనో..? ఈమధ్య జబర్దస్త్ స్కిట్లలోనూ నటిస్తున్నావు కదా, కొంపదీసి తాగుబోతు రమేష్‌లాగా ఓ టీంలీడర్ అయిపోవు కదా… రెగ్యులర్ స్క్రీన్, డబ్బులు… ఇంకా జారిపోకు… జారి పడిపోకు…
Ads
రాజారవీంద్ర… తను కూడా అంతే… స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాడు… మంచి నటుడే…కానీ తనకు ఏం పుట్టిందని ఈ పాత్ర అంగీకరించాడో అర్థం కాదు… పోనీ, ఇదేమైనా మస్తు డబ్బులు వచ్చే పాత్రా..? కాదు..! పేరు తెచ్చే పాత్రా..? కాదు..! కలలు గన్న విశిష్ట పాత్రా..? కాదు..! తనలోని నటుడి ఆకలి తీర్చే పాత్రా..? కాదు…! కొంపదీసి, ఏ పాత్ర దొరికినా సరే అన్నంత డిస్ట్రెస్‌లో లేవు కదా రాజా…!! మరో ఆర్… ఎవరంటే..? భరణో, కృత్తికో అన్నారు… ఆయన, పోసాని, బండ్ల గణేష్ తదితరుల గురించి ప్రస్తావన ఇక్కడ వేస్టు… ఆ గణేష్ మొహం, డైలాగ్ డెలివరీ తీరు వింటుంటునే ఓ చిరాకు… శ్రీముఖికి ఇది ఆప్టరాల్ పాత్ర… ఏదో టీవీ షోలో యాంకరింగ్ చేసినంత సరదాగా, అలవోకగా చేసేసింది… నిజం చెప్పాలంటే… మామూలు రోజుల్లో అయితే ఈ సినిమాకు థియేటర్ దొరకదు… లక్కీగా పెద్ద సినిమాలు, పెద్దవాళ్ల సినిమాలు లేవు కదా… కొన్ని థియేటర్లు దొరికాయి… కానీ ఈ ‘క్రేజీ అంకుల్స్’ పైత్యం మన ప్రేక్షకులకు అస్సలు ఎక్కదు, రుచించదు… అవును, ఎక్కలేదు, రుచించలేదు… మనో కాదు కదా, మనో తాతను పెట్టినా సరే, శ్రీముఖి తాతమ్మను పెట్టినా సరే…!!
Share this Article