……….. By…. Prasen Bellamkonda………… ” థియేటర్లన్నీ నలుగురి చేతుల్లోనే ఉన్నాయి. ఏ సినిమాకు థియేటర్లు ఇవ్వాలి వేటికి ఇవ్వవద్దు అనేది ఈ నలుగురి దయాదాక్షణ్యాల మీదే ఆధారపడి ఉండడం దురదృష్టం” చాలా రోజులుగా చిన్న సినిమాల హీరోలు నిర్మాతలు పడుతున్న ఈ బాధను పక్కన పెడదాం. “ఓటిటిలకు సినిమాలిస్తే ఎక్జిబిటర్ లుగా మేం రోడ్డున పడతాం. థియేటర్లకు పెద్ద సినిమాలనివ్వకుంటే వాళ్ళ సంగతి చూస్తాం” ఇప్పుడు ఎక్జిబిటర్ల వాదన లాంటి హెచ్చరిక… దీన్నీ పక్కన పెడదాం…
థియేటర్లన్నీ ఆ నలుగురి చేతుల్లోనే ఉన్నమాటే నిజమైతే…ఇప్పుడు ఈ ఎక్జిబిటర్లు ఆ నలుగురి ప్రతినిధులేనా…? ఆ నలుగురూ సినీ పెద్దలే కదా. సమస్య సినీ పెద్దల పరిధిలో ఉన్నట్టే కదా. అంటే పంచుకునే ఊళ్ల లెక్క తేలని దొంగల దంగల్ అన్నట్టా…? చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వొద్దు అనే వివక్ష పాటించిన ఆ నలుగురికి ఓటిటిలో సినిమాలను విడుదల చెయ్యొద్దు అనే హక్కు ఉంటుందా…? ఇదే ఎక్జిబిటర్లు చిన్న సినిమాలు ఓటిటిల్లో విడుదలవుతుంటే వాటి మీద ఎందుకు అభ్యంతరం చెప్పట్లేదు..? పెద్ద సినిమాల విషయంలో మాత్రమే వీళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు..?
Ads
పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే గొడవను కూడా పక్కన పెడితే… సామాన్య ప్రేక్షకుడైతే ఓటిటిలనే కోరుకుంటున్నాడు. వందల రూపాయల టికెట్లు ఆన్ లైన్ బుకింగ్ తలనొప్పులు, మన ఆస్తులు రాయించుకునే పాప్ కార్న్ బకెట్ల, శీతల పానీయాల భయాలు లేని బెడ్రూమ్ థియేటర్ నే ఇళ్ళు కోరుకుంటున్నాయి… ఎవరెవరి లాభనష్టాలో, ఎవరెవరి ఉనికి ఆధిపత్యాల గొడవలతోనో సామాన్యుడికి పనిలేదు కదా… ఇప్పటికే కొంత మేరకు సామాన్యుడు థియేటర్ కు వెళ్ళడాన్ని మరిచాడని ఈ మధ్య తెరుచుకున్న హాళ్ళే చెప్పాయి… నిజమే సినిమా హాల్ లో చూడడం ఒక అనుభవమే. దాన్నెవరూ కాదనరు. కుటుంబమంతా థియేటర్ కు వెళ్లడం ఒక విహారయాత్రే. దాన్నెవరూ కాదనరు… కానీ కాదన్న నాడు ఎవడైనా అంగీకరించక తప్పదు…
కాలం అలా మనం ఎన్నింటిని కాదనేట్టు చెయ్యలేదు..? ఉత్తరం రాయడం ఉత్తరం అందుకోవడం అనే అనుభూతిని మనం ఇప్పుడు కాదనట్లేదా..? సైకిల్ గిర్రను పుల్లతో కొట్టుకుంటూ పరిగెత్తే అనుభూతిని మన పిల్లలకు ఇవ్వడాన్ని మనం కాదనట్లేదా..? వాకిట్లో ముగ్గులేసుకునే అనుభూతిని ఫ్లాట్ కామన్ స్పేస్ లో స్టిక్కర్ గా అతికించుకుని గతాన్ని కాదనట్లేదా..? ప్రియతమ దివంగతుల చిత్ర ఫలకాల ముందు చమురు వత్తులతో వెలగాల్సిన నివాళి అనుభూతిని మిణుకు మిణుకు విద్యుత్ దీపానికి పరిమితంచేసి కాదనట్లేదా..? చెప్పుకుంటూ పోతే సాంకేతికాలు, సౌకర్యాలు, అవసరాలు పోగొట్టిన అనుభూతులు కొన్ని వందలు వేలున్నాయి… ఇన్ని మరపుల మధ్య ఇప్పుడు థియేటర్లో సినిమా చూడడం అనే అనుభూతి పోతోందన్నది మరో మరపుకు టైటిల్ కార్డు మాత్రమే…
Share this Article