ఈటీవీ, మాటీవీలలో వచ్చే కామెడీ షోలలో నాసితనం, వెకిలితనాలకు కొదువ లేదు… కానీ పత్రిక కథనాల కాలుష్యాలు, కరోనా భయాలు, టీవీ డిబేట్ల పైత్యాలు, రాజకీయ నేతల జ్ఞానగుళికలు, రీసెంటు సినిమాల బీభత్సాల నడుమ జనానికి ఉన్న ఏకైక రిలీఫ్ చివరకు ఈ కామెడీ షోలే… తిట్టుకుంటూనే చూడాలి… జనానికి ఇప్పుడు టీవీని మించిన వినోదం లేదు… విషయానికొస్తే ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ పేరిట ప్రతి ఆదివారం ఓ షో వస్తుంది… కామెడీకి అప్పుడప్పుడూ సంగీతం, డ్రామా, డాన్సులు గట్రా ఏదో ఓ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు… మొదట్లో దారుణంగా ఉండేది, తరువాత ఏం మార్చారో గానీ, సుధీర్ యాంకర్ అయ్యాడు… కాస్త భిన్నంగా ఉంది, పర్లేదు… ప్రత్యేకించి ఈరోజు వచ్చిన షోలో ఒక ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది… కమెడియన్లు రాఖీ పౌర్ణమి సందర్భంగా తమ అక్కాచెల్లెళ్లను ప్రవేశపెట్టారు… వాళ్ల నడుమ కాస్త మాటాముచ్చట… సరదాగా… ఎందుకు అదిరిపోయిందంటే..?
ఎంతసేపూ మరదళ్లు, వదినలు, బావలు, మరుదుల నడుమ మాత్రమేనా పంచ్ సంభాషణలు..? అన్నాచెల్లెళ్ల నడుమ ఉండవా..? ఒకరినొకరు ఏడ్పించుకోవడంలో, ఆట పట్టించడంలో చిన్నప్పటి నుంచీ తోబుట్టువులే కదా తోడు… సుధీర్, రాంప్రసాద్, బాబు, కార్తీక్ తదితరుల తోబుట్టువులు వచ్చారు… రావడమే కాదు… ఇన్నేళ్లు అనుభవమున్న ఆ కమెడియన్లకు దీటుగా పంచ్ డైలాగ్స్ వేశారు… ఎక్కడా తడబాటు లేదు, మాటలు మింగడాల్లేవు… ఎంచక్కా పంచులు భలే వదిలారు, మెప్పించారు… అఫ్ కోర్స్, ముందే రాసిచ్చి ఉండొచ్చు కానీ… కెమెరాల ముందు మంచి టైమింగుతో కామెడీ పంచులు వేయడం అంత సులువు కాదు… బాబు వాళ్ల అక్క ఓ డైలాగ్ వేసింది… ‘‘బల్లిగుడ్డు ఆమ్లెట్ అవుతుందేమో గానీ నువ్వు మాత్రం హైలైట్ కావురా’’… స్పాంటేనియస్గా అక్కడున్న ఇతర పార్టిసిపెంట్లు నవ్వలేక కడుపులు చేత్తో పట్టుకున్నారు… ఈమధ్య రెగ్యులర్గా ఈ షోకు జడ్జిగా వస్తున్న ఇంద్రజ అయితే నవ్వలేక అపసోపాలు పడింది… చూస్తున్నంతసేపూ ‘‘ఆత్మీయంగా’’ కనెక్టయ్యింది ప్రేక్షకులకు… అన్నట్టు… సుధీర్, హైపర్ ఆది సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి, పవన్ కల్యాణ్ పేర్లతో సెలబ్రేషన్స్ చేస్తున్నారు, కానీ కాస్త బ్యాలెన్స్ చేయడం అవసరమేమో… అసలే కులపంచాయితీలు ఎక్కువ మన ఇండస్ట్రీలో… ఆల్ రెడీ హైపర్ ఆదికి నాగబాబు మనిషి అనే పేరుంది టీవీ ఇండస్ట్రీలో… నాగబాబు ప్రచారానికి కూడా వెళ్లాడు… అప్పట్లో కత్తి మహేశ్ మీద ‘కత్తి’కట్టిన వాళ్లలో తనూ ఉన్నాడు… టీవీ షోలు అనేసరికి ఆర్టిస్టులు తమ మీద ‘‘ఏ ముద్రలూ’’ పడకుండా చూసుకుంటే… విమర్శించేవాళ్లకు చాన్స్ ఇవ్వకుండా ఉంటుంది…!!
Ads
Share this Article