Tribute అంటే..? తెలుగులో నివాళి అని రాసేస్తున్నాం కదా… నివాళి అంటే..? కేవలం మరణించినవాళ్లకు వాడే గౌరవప్రదమైన పదం మాత్రమేనా..? శ్రద్ధాంజలికి పర్యాయపదమా..? కాదు… Tribute అంటే మరణించినవాళ్లకే కాదు, బతికి ఉన్నవాళ్లకు కూడా వాడే పదమే… కాకపోతే మనం అలా పత్రికల్లో రాసీ రాసీ నివాళి అనగానే అదేదో మృతులకు మాత్రమే వాడాల్సిన పదంగా మార్చేస్తున్నాం… ఇదెందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే..? ఈటీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఓ ప్రోగ్రాం వస్తుంది… అందుబాటులో ఉన్న కమెడియన్లతో షో నడిపించేస్తుంటారు… ఈసారి దాని ప్రొమో చూసి ఆశ్చర్యమేసింది… అందులో A special Tribute to Lady amitabh Vijaya Santhi అంటూ ఓ స్కిట్ చేశారు… విజయశాంతి అనగానే వందల పాత్రలున్నా సరే వదిలేసి రాములమ్మను గుర్తుచేసుకుంటాం కదా… పత్రికల్లో కూడా దాన్ని ఓ బిరుదులాగా, ఇంటిపేరులాగా రాసేస్తూ ఉంటాం కదా… ఆ సినిమాలోని కొన్ని సీన్లను రీక్రియేట్ చేశారు… అయితే ఇక్కడ ట్రిబ్యూట్ అనే పదం వాడకం కరెక్టేనా..? భాషాపరంగా, సాంకేతికంగా తప్పులేదేమో… కానీ వ్యవహారంలో మనం వాడుతున్న తీరును బట్టి ఆ పదం కరెక్టేనా..? ఏమోలెండి, ఈటీవీ భాష వేరు… ఈనాడు, ఈటీవీ భాషకు నివాళి అర్పిస్తూ, ఇక్కడ ఇక వదిలేద్దాం…
నిజానికి మనం చెప్పుకోవాలనుకున్న సంగతి వేరు… ఆ స్కిట్లో రోహిణి, ఆటో రాంప్రసాద్ నటించారు… కమెడియన్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, ఆటో పంచర్గా అందరికీ రాంప్రసాద్ మెరిట్ తెలుసు… కానీ ఓ సీరియస్ నటుడిగా కూడా రాణించగలడు అని నిరూపించుకున్నాడు… ఇక్కడ ప్రధానంగా చెప్పుకునేది రోహిణి గురించి… కామెడీలో ఆమె టైమింగు, ఎనర్జీ, ఇన్వాల్వ్మెంట్ గురించి ‘ముచ్చట’ గతంలో కూడా సందర్భాన్ని బట్టి ఆమెను ప్రశంసించింది… కానీ కామెడీ మాత్రమే కాదు, నిజంగా ఆమెను సరిగ్గా వాడుకోగలిగితే సీరియస్, కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా అదరగొట్టగలదు అని ఈ స్కిట్ ద్వారా నిరూపించుకుంది ఆమె… భారీ రెమ్యునరేషన్లు, పొంఖణాలకు పోయే పెద్ద ఫోజుల తారలేమీ అక్కర్లేదు, తరచి చూస్తే మన చుట్టూ ఉన్నవాళ్లలోనే మంచి నటులున్నారు, వాళ్లకు అవకాశాలివ్వడం కరెక్టు… రోహిణి ఎపిసోడ్ అదే చెబుతోంది…
Ads
ఆమె డాన్స్ చేయగలదు, కామెడీ చేయగలదు (నిజానికి కామెడీ చేయడమే కష్టం), సీరియస్ యాక్షనూ చేయగలదు… యూట్యూబులో ఈ ప్రొమో వీడియోకు కామెంట్లలో నెటిజనం ఆమెను బాగా ప్రశంసిస్తున్నారు… అర్హురాలే… స్కిట్ అయ్యాక హైపర్ ఆది ఓ మాటన్నాడు… ‘‘సినిమాకు లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతి, టీవీకి అయితే రోహిణియే…’’ ఓ మంచి అభినందన, ఓ మంచి ప్రోత్సాహం కోసం తను ఆ మాట అని ఉండవచ్చు, కాస్త అతిశయోక్తిగా అనిపించవచ్చు… కానీ రోహిణి మంచి నటి అనే విషయంలో రెండో అభిప్రాయం ఎవరికీ లేదు… తన లావుతనం మీద అప్పుడప్పుడూ తోటి కమెడియన్లు పంచులు వేస్తుంటారు… అయితేనేం, ఆ లావుతనమే కాస్త డిఫరెంటుగా తనకు నాలుగు చాన్సులు తెచ్చిపెడుతున్నాయిలే అనుకుని భరిస్తున్నట్టుంది… (ష్, నిజానికి టీవీ రాములమ్మగా పిలిచే శ్రీముఖికన్నా రోహిణి లావుగా ఏమీ ఉండదు…) ఐనా మాలావు మెరిట్ ముందు ఆ లావు ఏపాటి..? రోహిణీ బెస్టాఫ్ లక్…!! ((ఇదీ ఆ ప్రోమో… ఈటీవీ వారి సౌజన్యంతో…))
Share this Article