హెడ్డింగ్ చూసి హాశ్చర్యం వేసిందా..? గడ్డం, మీసం పెంచుకోవడానికి పర్మిషన్ ఏమిటి..? అసలు గడ్డం ఎవరికి అడ్డం..? కోట్ల మంది పెంచేసుకుంటారు, దానికి పర్మిషన్ దేనికి అనేదేనా మీ డౌట్..? ఖాకీ డ్రెస్సుల్లో పనిచేసే విభాగాల్లో ఉద్యోగులకు అవసరం… అదీ హిందువులైతేనే…! పర్ సపోజ్, నేను అయ్యప్ప మాల వేసుకుంటున్నాను, డ్రెస్సుకు మినహాయింపు ఇవ్వండి సార్ అనడగాలి… సేమ్, ఏ తిరుమల వెంకన్నకో, యాదాద్రి నర్సన్నకో, ఎముడాల రాజన్నకో, కొండగట్టు అంజన్నకో తలవెంట్రుకలు మొక్కుకున్నారూ అనుకొండి… పర్మిషన్ కావాలి… దేవుడి అనుమతి లేకపోయినా సరే, తమపై బాసుల అనుమతి కావాలి… అసలు దేవుళ్లు వాళ్లే కదా మరి… ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఓ లేఖ…
తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీకి నల్గొండ అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ షణ్ముఖరావు రాసిన లేఖ ఇది… అయ్యా, రెండు నెలల్లో తిరుమలకు వెళ్లాల్సి ఉంది, దయచేసి గడ్డం, జుత్తు పెంచుకోవడానికి అనుమతించండి అని పర్మిషన్ అడుగుతున్నాడు… జస్ట్, రెండు నెలలే, తరువాత నీటుగా గడ్డం షేవ్ చేసుకుని, జుత్తు పద్ధతిగా కట్ చేసుకుని కనిపిస్తాను అన్నట్టుగా ఉంది ఆ లేఖ… అయితే అందులో ఓ పదం ఉంది… procrastination… అంటే తెలుగులో వాయిదా వేయడం… సమయానికి మొక్కు ఉంది అని ఇంగ్లిషులో రాయలేకపోయాడు… ఫాఫం, తెలియకో, మొక్కు అని రాస్తే ఇంకేం తంటాలు అనుకున్నాడో తెలియదు… I have a procrastination అని రాసేశాడు… అవునూ మొక్కును ఇంగ్లిషులో ఏమంటారబ్బా… solemn vow కాకుండా ఇంకేదైనా పదముందా..?
Ads
సరే, విషయానికొద్దాం… అసలు ఉద్యోగుల డ్రెస్ కోడ్ మీద కూడా కాస్త చర్చ అవసరం… ఓ పోలీస్, ఓ ఆర్మీ జవాన్ తదితరులకు నీటు గడ్డం, కురచ జుత్తు, నిర్దేశిత డ్రెస్సు ఉంటయ్… అందులోనూ నేవీ, ఎయిర్ఫోర్స్, ఆర్మీ వేర్వేరు.., అందులోనూ బెటాలియన్ల వారీగా లుక్కు వేరు… ఇతర మతస్థులకు కొన్ని మినహాయింపులు కూడా ఉంటయ్… ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైర్ సర్వీసుకు కూడా ఈ గడ్డాలు, మీసాలు, జుత్తు మీద ఆంక్షలు అవసరమా యువరానర్..? ఈ యూనిఫారమ్ సర్వీస్ కొలువులకు డ్రెస్ కోడ్ విషయంలో… గడ్డాలు, మీసాలు, జుత్తు విషయంలో పునఃసమీక్ష అవసరమేమో…! అరె, ఇవ్వాళారేపు ట్రెండ్ గడ్డం పెంచడం… ఎలాగూ ముప్ఫయ్, నలభై దాటిందంటే బట్టతలలు కనిపిస్తున్నయ్… పోరగాళ్లు హడలిపోతున్నారు… సో, ఆలోపు గడ్డాలు విపరీతంగా పెంచేసుకుని ఆనందపడుతున్నారు యువజనం… పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా… బవిరిగడ్డాలతో భయపెడుతున్నారు… సాక్షాత్తూ ప్రధానే ఆ జులపాలు, గడ్డాలు పెంచగా లేనిది, పాపం, ఈ చిరుద్యోగులకు ఈ ఆంక్షలు ఏమిటబ్బా… ఓసారి టీవీలు, సినిమాలు చూడండి, పెద్ద పెద్ద హీరోలు కూడా ఎరువులు వేసి మరీ పెంచుతున్నారు… ఉదాహరణ కావాలా..? టీవీలో కనిపించే ఓహోంకార్…!! తనను చూసి ఎంతమంది భయపడి, జ్వరాలు తెచ్చుకుంటున్నా సరే, ఆగాడా… లేదు కదా…!! ఇలా కోకొల్లలు… ప్రత్యేకంగా గడ్డం ఆయిల్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయట… ట్రెండ్ నుంచి జనాన్ని దూరంగా ఉంచడం, మరీ ప్రత్యేకించి తిరుమల వెంకన్న గుండుకు పర్మిషన్ల తంటాలు పెట్టడం కరెక్టు కాదు… కాదు…!!
Share this Article