ఆమధ్య మన వరంగల్ పిల్ల ఆనంది గురించి రాసిన ‘ముచ్చట’ స్టోరీ మళ్లీ అకస్మాత్తుగా గుర్తొచ్చింది… ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్ అన్నట్టుగా మన దర్శకులకు తెలుగు పిల్లలు హీరోయిన్లుగా పనికిరారు కదా… మన హీరోలతో రొమాన్స్ చేయడానికి ఏ కేరళ, ఏ తమిళనాడు పిల్లలో కావాలి… లేదంటే అడిగినట్టుగా అన్నీ చూపించేసే ముంబై పిల్లలు కావాలి… అకస్మాత్తుగా ఆనంది కనిపించింది… సుధీర్ బాబు సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో హీరోయిన్ ఆమె… వావ్, మన ఓరుగల్లు పిల్లకు భలే చాన్స్ దొరికిందే, ఆ నిర్మాతకు, ఆ దర్శకుడికీ ఈమె ఎలా కనబడిందబ్బా, ట్రెండ్ ప్రకారం అయితే తెలుగు అనగానే బయటికి తగలడు అనే ఇండస్ట్రీ కదా మనది… మరేం జరిగింది అనే డౌటొచ్చి పడింది… సినిమా మొత్తం చూశాక ఆ డౌట్ బలపడింది… ఈ డార్క్ క్లైమాక్స్‌కు బహుశా ఏ పరభాషా హీరోయినూ అంగీకరించి ఉండదు, ఫోరాభయ్ అనేసి ఉంటుంది… ఆనంది కనిపించింది…
ఆనంది కాస్త తమిళ వాసనలు… ఈమధ్య తమిళంలో మంచి పేరు సంపాదించింది కదా… ఆ సినిమాల ప్రభావం, ప్రత్యేకించి తనకు బాగా గుర్తింపును తెచ్చిపెట్టిన pariyerum perumal ప్రభావం బాగా ఉన్నట్టుంది… ఈ కథ వినగానే, క్లైమాక్స్ వినగానే వోకే అనేసి ఉంటుంది… ఈ దెబ్బకు నా మాతృభాషలో జెండా ఎగరేయడం ఖాయం అనుకుని ఉంటుంది… బాగా చేసింది, తను మంచి నటి, డౌట్ లేదు… కానీ ఆ కథలోనే లోపం ఉంది… కథనంలోనే తడబాట్లున్నయ్… క్లైమాక్స్ మరీ హార్ష్… సినిమా పరిభాషలో డార్క్ ఎండ్ అనాలట… ఇలాంటివి తెలుగు ప్రేక్షకులకు ఎక్కవు… ఎక్కవు అనే నిజం హీరో, నిర్మాత, దర్శకుడికీ ఎక్కలేదు… ఉప్పెన సినిమాలో మర్మాంగాన్ని కట్ చేయడం అనేదే తెలుగు ప్రేక్షకులకు యాంటీ-సెంటిమెంట్… క్రుయల్… చాలామంది ప్రేక్షకులు ఆ సినిమా చూసి ‘చల్ పోరా’ అని ఈసడించుకున్నారు… పరువు హత్యలు, ఆ కథాంశాలు మనకు కొత్తేమీ కాదు… కానీ మరీ ఈ రేంజ్ డార్క్ నెస్ అవసరమా..?
Ads
మనకూ తెలుసు కదా, మిర్యాలగూడ మారుతీరావు స్టోరీ… బిడ్డను అమితంగా ప్రేమించి, కోట్లకుకోట్లు సంపాదించి, చివరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి… జనానికి తన మీదే సానుభూతి ఏర్పడింది చివరకు… పరువు హత్యల కథలకు అనేక కోణాలు ఉంటయ్… శ్రీదేవి సోడా సెంటర్ కథ కూడా అలాంటిదే… కానీ ఈ క్లైమాక్స్ బాగాలేదు… ఓ పాజిటివ్ నోట్‌తో ముగించాల్సింది… ఆమధ్య నెట్‌ఫ్లిక్స్‌లో ఓ అంథాలజీ మూవీ వచ్చింది… పేరు పావ కథైగల్… అందులో ఒక స్టోరీ ఊర్ ఇరవు… అందులో ప్రకాష్ రాజ్, సాయిపల్లవి పోటీపడి నటించారు… తన మాట కాదని ఓ నిమ్నకులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని కోపంతో ప్రకాష్ రాజ్ కుటిలంగా, నీచంగా ఆలోచించి, సాయిపల్లవిని నమ్మించి, ఇంటికి తీసుకొస్తాడు సీమంతం పేరుతో… విషం పెట్టేస్తాడు… శ్రీదేవి సోడా సెంటర్ దర్శకుడికి కూడా ఇలాంటి కథే కావల్సి వచ్చిందా..? అసలు కథలే లేవా..? ఇలాంటి క్లైమాక్స్‌లు సమాజంలో ఇలాంటి రియల్ కథల్లో తండ్రులకు కొత్త ఆలోచనల్ని నేర్పిస్తున్నట్టున్నయ్… అది అవసరమా..? ఏం ఫాయిదా సమాజానికి..?
పోనీ, ఆ క్లైమాక్స్ వదిలేస్తే మిగతా కథేమైనా బాగుందా..? సోది… గతంలో సమ్మోహనం సినిమాలో సుధీర్‌ను (సారీ, బాబు గారూ.., బాబు అనాలి కదా, సారీ) చూస్తే ముచ్చటేసింది… రెగ్యులర్, రొటీన్, ఫార్ములా, ఇమేజీ చట్రపు హీరోయిజం కోరుకోని ఓ నటుడు దొరికాడు అనిపించింది… చివరకు తను కూడా చివరకు ఈ సిక్స్ ప్యాక్, ఐటం సాంగ్, ఫైట్లు, గెంతులు వంటి రొటీన్ మాస్ హీరో అయిపోయాడు… తను ఇలాంటి పాత్రలకు సూట్ అవుతాడా లేదా అనేది వేరే సంగతి, కానీ ఈ కథకు అంగీకరించడాన్ని అభినందిద్దాం… ఈ మాస్ హీరోయిజం, సోది ఫస్టాఫ్ కమర్షియల్ కథనానికి బదులు దర్శకుడు ఓ రియలిస్టిక్ వేలో గనుక కథనాన్ని తీసుకుపోయి ఉంటే సినిమా రేంజ్ వేరే ఉండేది… పాటలు, సంగీతం, ఎడిటింగ్, కామెడీ ఇతరత్రా మన్నూమశానం అన్నీ సో సో… ఇక ఆనంది సంగతికి వద్దాం…
ఆమెకు నటన తెలుసు, అందం ఉంది, ఎలాంటి పాత్రనైనా పోషించగలమన్న కాన్ఫిడెన్స్ ఉంది… కానీ ఒక చిన్న పాత్ర ఇచ్చిన నిర్మాత లేడు, దర్శకుడు లేడు… అప్పుడెప్పుడో 2012లో బస్‌స్టాప్ అనే సినిమాతో ఎంట్రీ… ఆ తరువాత రెండుమూడు పాత్రలు… అంతే… అవకాశాల్ని వెతుక్కుంటూ తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది… ఇక అంతే… మళ్లీ ఇప్పటి ఈ జాంబిరెడ్డి వరకు… ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్… అంతే… ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా పాత్ర లభించలేదు ఆమెకు మధ్యలో… మన ఇంటికోడి పప్పుతో సమానం (ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్… ) నిజం, తమిళ దర్శకులు తమకు కావల్సిన విధంగా నటీనటుల నుంచి మంచి నటనను రాబడతారు… మన సోది మొహాలకు మట్టిముద్దల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో తెలియదు… ఈ సినిమాలో నటించిన ఆనందికి (అసలు పేరు రక్షిత, కొంతకాలం హాసిక…) బోలెడు అవార్డులు, విమర్శలకు ప్రశంసలు దక్కాయి… ఆమెకేమో తెలుగు చిత్రాలు కావాలి, కానీ ఇచ్చేవాడు లేడాయె… ఇన్నేళ్లకు ఆమెకు ఒకటీరెండు తెలుగు చాన్సులు…
ఈ ఏడెనిమిదేళ్ల వ్యవధిలో ఆమె పేరు తెలుగు ఇండస్ట్రీలో కాస్త వినబడిందీ అంటే… ఆమె వరంగల్‌లో రహస్య వివాహం చేసుకున్నప్పుడు..! తమిళంలో కో-డైరెక్టర్‌గా పనిచేసే సోక్రటీస్‌ను మొన్నామధ్య పెళ్లి చేసుకుంది… ఒకటీ అరా సైట్లలో, యూట్యూబులో చిన్న వార్తలకు నోచుకుంది.,. భారీ కవరేజీలు మాత్రమే తెలిసిన పెద్ద పత్రికలు, పెద్ద టీవీలకు అది కూడా కనిపించలేదు… పోన్లెండి… జాంబిరెడ్డి గనుక క్లిక్కయి ఉంటే బాగుండేది… ఈ శ్రీదేవిలో ఆమెను ప్రేక్షకులు మెచ్చితే మరికొన్ని చాన్సులు రావచ్చు… అదే ఆశిద్దాం… ఆల్ ది బెస్ట్ ఆనందీ…!!
Share this Article