రేప్పొద్దున తెలంగాణ ముఖ్యమంత్రి ఇంద్రశేఖర్రావు అని ఈనాడులో వచ్చింది అనుకొండి… దయచేసి ఆశ్చర్యపోవద్దు… ఆయన ఇంటిపేరు కూడా కల్వకుంట్ల బదులు జలకుంట్ల అని రాస్తే అస్సలు నిర్ఘాంతపోవద్దు… ఏమో, కేటీయార్ పేరు కూడా ఇప్పుడున్నట్టే ఉండకపోవచ్చు కూడా… ష్, అసలు తెలంగాణ పేరునే మార్చేస్తే ఎలా ఉంటుందో కూడా ఈనాడులో మేథోమథనం భేటీలు జరుగుతూ ఉన్నాయేమో… బొడ్డు కోసి పేర్లు పెట్టడంలో ఈనాడుదే ఘనకీర్తి… అది అక్షరమంత్రసాని… కాదు, తెలుగుకే మంత్రసాని, ఈ భాష పుట్టుకకు సాయం చేసింది అదే… అదుగో, ఆ రేంజులో పదాల వాడకంలో స్వేచ్ఛ తీసుకుంటూ ఉంటున్నది… ఈనాడు జర్నలిస్టు దయ, తెలుగు తల్లి ప్రాప్తం… వాళ్లేది రాస్తే అది కిక్కుమని ఫాఫం, తెలుగుతల్లి భరించాలి, తను కూడా మారిపోతూ ఉండాలి… ప్రపంచంలోకెల్లా మాతృభాషను చేజేతులా హతమార్చే ఏకైక దినపత్రిక బహుశా ఈనాడు మాత్రమేనేమో… మనం అనేకానేక ఉదాహరణలు గతంలో చెప్పుకున్నాం, ఇప్పుడు ఓ క్లాసిక్… తెలుగులో చెప్పాలి కదా… సంధిప్రేలాపన వంటి, పైత్యపరాకాష్ట అనదగిన ఓ ఉదాహరణ… ఇదుగో…
మెదక్ జిల్లా, ఉపపత్రికలో కనిపించిన వార్త ఇది… హెడ్డు అనేది లేకుండా పెట్టబడిన ఆ హెడ్డింగు చూడండి… జలజాలం అట… కిందపడి కొట్టుకోకండి, జుత్తు పీక్కోకండి… మిషన్ భగీరథకు ఈనాడు పెట్టిన పేరు అది… సిగ్గూశరం వంటి పెద్ద పెద్ద పదాలు దేనికిలే గానీ… అసలు మిషన్ భగీరథకు ఇది కాష్మోరా మార్క్ అనువాదమా..? లేక భగీరథ అనేది పరభాష పదం అనుకుని, ఇలా ఈనాడు భాషలోకి అనువదించారా..?
Ads
- అప్పుడెప్పుడో మిషన్ భగీరథను యంత్ర భగీరథ అని ఎవడో రాసినట్టు గుర్తు… మిషన్కూ, మెషిన్కూ తేడా తెలియదుగా… పోనీ, అదే ఖాయం చేయకపోయారా ఇక్కడ కూడా… పాఠకుడి ఖర్మ…
- ఏడుకొండలు అనే పేరు ఉంటే… అదిక ఏడుకొండలే… దాన్ని సెవెన్ హిల్స్ అని రాస్తాను అంటే వాడు ఊరుకోడు, బజారుకీడ్చి, చెప్పు తీస్తాడు… పేర్లను కూడా అనువాదం చేయడం ప్రపంచంలో ఈనాడుకు మాత్రమే సాధ్యం… అదీ భాషాసంరక్షణ పేరుతో… ఇక్కడ మిషన్ భగీరథ అనేది ఆ పథకం పేరు…
- భగీరథ అనేది అప్పట్లో గంగను ఈ భూమ్మీదకు తీసుకొచ్చిన పెద్దాయన పేరు… ఛట్, అస్సలు బాగాలేదు అనుకుని… అంతర్జాలం, జీవజాలం, మన బొందజాలం అని కొత్త పేర్లు పెట్టినట్టుగా… జలజాలం అనే ఓ దిక్కుమాలిన పేరు పెట్టేశారా..?
- పోనీ, అదయినా సరిగ్గా కుదిరి ఏడ్చిందా..? ఇప్పుడు చెప్పండి… కేసీయార్ పేరును, తెలంగాణ పేరును కూడా ఈనాడు యథాతథంగా ఇలాగే ఉంచకపోవచ్చు… రేపు పత్రికలో కొత్త పేర్లు కనిపించవచ్చు… నిజమా కాదా..? ఏమో నరేంద్ర మోడీ పేరును ధీరేంద్ర మోడీ అని… జగన్మోహనరెడ్డి పేరును జన్మోహనరెడ్డి అనీ పెట్టినా దిక్కులేదు… ఇప్పటికిప్పుడు ఈనాడు పత్రికను శోధిస్తే ఇలాంటి భాషాయజ్ఞాలు బోలెడు కనిపిస్తాయి… రామోజీరావు గారూ… ఇంతకీ ఈనాడుకు అక్షరజాలం అనీ, మీ పేరుకు…. వద్దులెండి…!!
Share this Article