ఈనాడు నుంచి శ్రీధర్ వెళ్లిపోయాడు… సో వాట్, ఆయన కాకపోతే మరొకరు, ఈనాడు ఆగదు కదా అన్నాడొకాయన… అసలు ఈనాడు లేకపోతే మరోనాడు… ఈ భూమి తన భ్రమణాన్ని ఆపేసుకోదు కదా… ఆయన ఈనాడు వదిలేసి ఎందుకు వెళ్లిపోయాడు అనే అంశం మీద బోలెడు చర్చలు సాగుతున్నాయి సోషల్ మీడియాలో… చివరకు ఆయనది రిటైర్మెంటా..? రిజైనా..? అనే చర్చ వరకూ… సహజం… నలభై ఏళ్ల బానిస బతుక్కి దొరికింది విముక్తి అని కూడా తేల్చేశారు కొందరు… సోషల్ మీడియా చర్చ ఇంకా ఎక్కడెక్కడికో కూడా వెళ్లిపోయింది… మనం ఇక్కడ వాటి గురించి చెప్పుకోవడం లేదు… కానీ ఆర్టిస్ట్ అన్వర్ రాసిన ఓ పోస్టు మాత్రం ఆసక్తికరంగా ఉంది… శ్రీధర్ కార్టూన్లకూ మట్కా నంబర్లకు సంబంధం ఉండేదని చాలామంది నమ్మేవాళ్లు అప్పట్లో… అన్వర్ పోస్టులో కొంత భాగం చూద్దాం…(జనం అమాయకత్వం మీద రాసిందే, ఇక్కడ శ్రీధర్‌ను గానీ, ఇంకెవరినీ తప్పుపట్టడం లేదు తను…)
……….. Anwar The Artist……….. కార్టూనిస్ట్ శ్రీధర్ గారు ఇక ఈనాడును వదిలి వెల్తున్నారని ఒక ఫోన్ కాల్ తెలిపింది. ఒక్క క్షణం దిగాలు వేసింది. కిందున్న నేనే కాదు పైనున్న మా జేజి, ఇంకా ఆవిడ ప్రెండు ఆకుల లక్షమ్మవ్వ కూడా హతాశురాలై పోయి ఉంటుంది…. మా నాయనమ్మకే కాదు, వాళ్ళమ్మకూ తెలుసు. ఇదంతా 80ల్లో మాట. మా ఇంటి పక్క ’జిన్ వాలే మామి’ ఇంటికి ఈనాడు పేపర్ వచ్చేది. నిజానికి అప్పట్లో నాకు తెలిసి , ఇళ్ళల్లో పేపర్ తెప్పించుకునే ఇల్లు చాలా అరుదు అలా పేపర్ వేయించుకునేవాళ్ళు. చాలా రిచ్ అండ్ కల్చర్డ్ అనే కిందన్న మాట. మా ఇంట్లో మా నాయనమ్మ బీబీ జాన్ ఇంకా వాళ్ళమ్మ ఫాతీమా బీ వుండేవారు. మాది ఉమ్మడి కుటుంబం. ఇంటికి పెద్ద మా జేజి. ఆవిడకున్న చిన్న సరదా మట్కా ఆడటం. మట్కా ఒక జూదం. దాన్ని బ్రాకెట్ అని కూడా అంటారు. నాకు ఇప్పటికీ దాని సంగతంత సరిగా తెలీదు కానీ మనం అనుకున్న ఒక రెండు నెంబర్లు మట్కా ఏజెంటు దగ్గరకు వెళ్ళి చెప్పాలి. అతను ఒక పెద్ద లిస్ట్ లో మన నెంబర్ వ్రాసుకుని మన చేతిలో ఒక చిన్న చీటిలో అదే నెంబర్ వ్రాసి సంతకం చేసి ఇస్తాడు. ఇందులో మళ్ళీ ఓపెనింగ్ నెంబర్, క్లోజింగ్ డిజిట్ అని ఇప్పటి జీఎస్టీ అంత కాకపోయినా దాదాపూ దానిలాగే ఎంతో కొంత గందరగోళం ఉన్న విషయమే . ఒక నెంబర్ మీద ఒక రూపాయి కాసిన వాళ్ళకు వాళ్ళ నెంబర్ బ్రాకెట్ లో తగిలితే 80 రూనో 100 రూపాయలో వస్తాయి. ఇది ఆడేవాళ్ళను పోలీసులు పట్టుకు పోయ్యి బొక్కలో వేసి మక్కెలిరగ తన్నెంత అదైన ఆట అన్నమాట.
Ads
Share this Article