……….By… Prasen Bellamkonda………. సంస్థ గొప్పదా, వ్యక్తి గొప్పా..? వ్యక్తి వెళ్ళిపోతే వ్యవస్థ కూలిపోతుందా? వ్యక్తే ఆ వ్యవస్థను నిర్మించినా సరే, ఆ వ్యక్తి నిష్క్రమిస్తే, ఆ వ్యవస్థ కూలిపోతే, ఆ నిర్మాణంలో లోపం వున్నట్టే కదా.
ప్రీతిష్ నంది లేకుంటే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లేదనుకునే వారు అప్పట్లో. కానీ ఆయన వెళ్ళాక కూడా ఏ నష్టమూ జరగలేదు.
రాజదీప్ సర్దేశాయ్ లు, ఎంజే అక్బర్ లు, హన్సారి లు మారినా ఆయా వ్యవస్థలకేమీ నష్టం జరగలేదు.
అసలు సంపాదకుడనే పేరునే నామ మాత్రం చేసి దశాబ్దాలుగా నెంబర్వన్ గా కొనసాగిన వ్యవస్థకు ఒక వ్యక్తి ఎక్జిట్ తో ఏదో జరిగిపోతుందా. ఎలా? గత ఇరవైనాలుగ్గంటలుగా పోస్టవుతున్న కొన్ని రాతలు చూస్తుంటే నవ్వొస్తోంది.
తెలుగులో కొత్త పత్రికా వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా ఉపయోగపడ్డ ఏకైక సంపాదకుడు ఒక ఎస్టాబ్లిష్ అయిన ఆంద్రభూమి అనే వ్యవస్థకు మాత్రం వ్యక్తిగా ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇది మనం కళ్ళారా చూసిన నిజం.
అదే సంపాదకుడు తానే ఏర్పాటు చేసిన గొప్ప వ్యవస్థల నుంచి బయటకు వచ్చినా ఆ వ్యవస్థలకేమీ నష్టం జరగలేదు. ఇదీ మనం కళ్ళారా చూసిందే.
రవిప్రకాష్ తన కలల ప్రపంచంగా నిర్మించి సాకి నిలబెట్టిన వ్యవస్థకు కూడా ఆయన వెళ్ళాక నష్టమేమీ జరగలేదు. ఇదీ మనమెరిగిందే.
వ్యవస్థలను మేమే నిర్మించాం అని విర్రవీగి ఆ వ్యవస్థల మీద ఆగ్రహించి బయటకు వచ్చి కుప్పకూలిన వ్యక్తులు మనకు రాజకీయ రంగంలో చాలా మంది తెలుసు. బయటకొచ్చాక కానీ అసలు బలమేంటో దాని బండారమేంటో బయట పడదు.
చానల్స్ కు ముఖాలుగా ఉన్న ఎందరో న్యూస్ మోడరేటర్లు మేమే ఛానల్ ను నిలబెడుతున్నాం అనుకుని వ్యవస్థతో తేడాలను సృష్టించుకుని బయటకొచ్చి శంకర గిరి మాన్యాలు పట్టిన ఉదాహరణలూ మనకు తెలుసు.
హిందూకిప్పుడు సురేందర్ అనే గొప్ప కార్టునిస్ట్ లేడు. హిందూకేమైనా నష్టం జరిగిందా. లేదే!
నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.
వ్యాపార ప్రపంచంలో వ్యక్తులకన్నా వ్యవస్థలకే బలమెక్కువ. ఆ వ్యవస్థలు తమను నిర్మించే వ్యక్తులనూ వెతుక్కుంటాయి, వాళ్ళు వెళ్ళిపోయినా తట్టుకునే శక్తినీ దాచుకుంటాయి.
వాణిజ్య వ్యవస్థలో వ్యక్తులకన్నా వ్యవస్థలకన్నా వాణిజ్యమే గొప్పది.
అది ఎప్పటికప్పుడు వ్యక్తులను వాళ్ళ వాళ్ళ సైజ్ లకు కత్తిరించేస్తూ ఉంటుంది. అంతే!
Share this Article