మోడీ మీద జనంలో ఇంకా వ్యతిరేకత పెరిగినా సరే… మోడీ ఇంకా ఎన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా సరే…. వాటిని రాజకీయంగా వాడుకునే సమర్థ రాజకీయ పార్టీ కనిపించడం లేదు… కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేక, నెహ్రూ కుటుంబం నుంచి తప్పలేక, తప్పుకోలేక, తప్పించుకోలేక… తప్పులేక అన్నట్టుగా ఆ వారసత్వం అధికారికమో, అనధికారికమో తెలియని చందంగా నడుస్తూనే ఉంది… సరైన మార్గదర్శనం లేదు, రాజకీయ వ్యూహాల్లేవు, కేడర్‌ను కదిలించే మంచి లీడర్ లేడు… రోజురోజుకూ దాన్ని నిస్సత్తువ ఆవహిస్తూనే ఉంది… వోటర్లు ‘‘ప్లీజ్, ప్లీజ్, మీకు వోట్లేస్తాం, ఆ మోడీని భరించలేకపోతున్నాం’’ అని ఒత్తిడి చేసినా సరే, అబ్బే ఎందుకులే అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ దురవస్థ… ఏబీపీ-సీవోటర్ సర్వే చెబుతున్నది కూడా అదే… అయిదు రాష్ట్రాల మూడ్ తెలుసుకోవడం కోసం ఓ సర్వే చేశారు…
Ads
వాటిల్లో గోవా, మణిపూర్ చిన్నవే అయినా… ఉత్తరాఖండ్, పంజాబ్ ఇంపార్టెంట్ స్టేట్స్, ఉత్తరప్రదేశ్ సరేసరి… అందరి దృష్టీ దానిపైనే…! 2022లో ఎన్నికలు జరగనున్నాయి… పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయనుంది అనేది ఒక పాయింట్, కాంగ్రెస్ తన చేతిలో ఉన్న పంజాబ్‌ను కూడా పోగొట్టుకోనుంది అనేది మరో పాయింట్… ఇది కాంగ్రెస్ కేడర్‌కు నిరాశను కలిగించేదే… అఫ్ కోర్స్, ఒపీనియన్ పోల్స్ నాటికీ ఒరిజినల్ పోలింగ్ నాటికీ బోలెడంత తేడా కూడా రావచ్చు, రాకపోవచ్చు… ఇప్పుడున్న స్థితి ఇదీ… కొన్ని ముఖ్యాంశాలు చెప్పుకోవాలి… ఫస్ట్ యూపీ… యోగీ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉందని బీజేపీలోనే తన వ్యతిరేకవర్గం ఈమధ్య నానాయాగీ చేసింది కదా… కానీ 40 శాతం ప్రజలు తననే మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారు… బీజేపీ 42 శాతం వోట్లతో 267 సీట్ల దాకా గెలవవచ్చునని ఓ అంచనా… ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా మరీ 3 శాతం ప్రజలు కూడా కోరుకోవడం లేదు… బీఎస్పీ వోట్లు గణనీయంగా తగ్గిపోయి, ఆమేరకు ఎస్పీ బాగుపడనుంది…
C-Voter Opinion Poll on UP(Seats & Vote Share)
BJP+ : 259-267 (42%)
SP+ : 109-117 (30%)
BSP : 12-16 (16%)
INC : 3-7 (5%)
OTH : 6-10 (7%)
మణిపూర్‌లో బీజేపీ చాలా కన్వీనియెంటుగా అధికారంలోకి వస్తుంది… కాంగ్రెస్ అయిదు శాతం వోట్ల తేడాతో వెనుకబడి ఉంది గానీ, ఆ తేడా ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేస్తుంది… కాకపోతే చిన్న స్టేట్ కాబట్టి పెద్దగా ఎవరికీ ఆసక్తి లేదు ఈ రిజల్ట్ పై… కన్వీనియెంటు గెలుపు కాబట్టి బీజేపీకి ఇక్కడ ఎన్నికల అనంతరం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టి ‘దుకాణం’ తెరవాల్సిన అవసరం ఏమీ ఉండకపోవచ్చు…
C-Voter Opinion Poll on Manipur (Seats & Vote Share)
BJP : 32-36 (40%)
INC : 18-22 (35%)
NPF : 2-6 (7%)
OTH : 0-4 (18%)
గోవా కూడా చిన్న స్టేటే… కాకపోతే ఇక్కడ కూడా బీజేపీ నానా వేషాలూ వేసింది ఆమధ్య… పార్టీలనే కొనుగోలు చేసింది… గోమంతకాలు, ఆప్ తదితరాలు బాగానే పుంజుకున్నా, కాంగ్రెస్ మరీ 15 శాతానికి పరిమితం కాబోతోంది… బీజేపీ 39 శాతం వోట్లతో కన్వీనియెంటుగా అధికారం నిలుపుకుంటుంది… వచ్చేసారి దానికి ఇక్కడ క్రయవిక్రయాలు, బేరసారాలతో పనిలేదు…సీఎం ప్రమోద్ సావంత్ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు…
C-Voter Opinion Poll on Goa(Seats & Vote Share)
BJP : 22-26(39%)
INC : 3-7(15%)
AAP : 4-8(22%)
OTH : 3-7 (24%)
ఉత్తరాఖండ్ గతంలో ఉత్తరప్రదేశ్‌లో భాగం.., బీజేపీకి మొదటి నుంచీ మంచి పట్టున్న ప్రాంతం… కాంగ్రెస్ ఇక్కడ పుంజుకోలేకపోతోంది… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 43 శాతం వోట్లతో అధికారం నిలుపుకుంటుంది… కాంగ్రెస్ 33 శాతం వోట్లను సాధిస్తుంది… బీజేపీకి కంఫర్టబుల్ లీడ్ వస్తుంది… కానీ సీఎంగా హరీష్ రావత్ పట్ల 30 శాతం ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు… అదొక్కటే కాంగ్రెస్‌కు ఊరట…
C-Voter Opinion Poll on Uttarakhand (Seats & Vote Share)
INC : 19-23(33%)
AAP : 0-4(15%)
BJP : 44-48 (43%)
ఇంట్రస్టింగ్ రిజల్ట్ పంజాబ్… అమరేందర్‌సింగ్, సిద్దూ వర్గాలు తన్నుకుంటున్నయ్… సయోధ్య కుదరడం లేదు… ప్రశాంత్ కిషోర్ మాయోపాయాలు ఇక్కడ పనిచేసే సీన్ కనిపించడం లేదు… 29 శాతం వోట్లతో 38, 46 సీట్ల మధ్య చతికిలపడేట్టుగా ఉంది… ఎలాగూ అకాలీదళ్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది, 22 శాతం వోట్లతో 16 నుంచి 24 సీట్లను గెలుచుకోవచ్చునని ఓ అంచనా… బీజేపీ గురించి మరిచిపొండి, జనం భగ్గుమంటున్నారు… విశేషం ఏమిటంటే, ఆప్ ఇక్కడ 35 శాతం వోట్లతో మ్యాజిక్ మార్కు దాకా రావచ్చునని సర్వే అంచనా వేసింది…
C-Voter Opinion Poll on Punjab(Seats & Vote Share)
INC : 38-46 (29%)
AAP : 51-57 (35%)
SAD : 16-24 (22%)
BJP : 0-1 (7%)
OTH : 0-1 (7%)
ఇవి ఊహాగానాలు కావు, ఓ ఒపీనియన్ పోల్ ఫలితం… ముందే చెప్పుకున్నట్టు పరిస్థితి ఇలాగే ఉండాలని ఏమీ లేదు… రేపు పోలింగ్ అనగా పరిస్థితి మారిపోవచ్చు కూడా… ఎటొచ్చీ ఓ రిలీఫ్ ఏమిటంటే… పీకే వంటి వ్యూహకర్తల్ని జనం పట్టించుకునే సీన్ కనిపించకపోవడం… అయితే బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడం, సమర్థ ప్రతిపక్షం ఇప్పటికీ ఓ సుదూరస్వప్నంలా కనిపిస్తుండటమే ఈ సర్వే చెబుతున్న అసలు సత్యం…!!
Share this Article