ఈరోజు ఏదో ఓ పాత తెలంగాణ ట్యూన్ జతకలిస్తే తప్ప అది సినిమా పాట కాదు, హిట్ కాదు… కాపీ కొట్టడంలో థమన్ గ్రేట్… ప్రాసపైత్యంలో రామజోగయ్య గ్రేట్… తెలంగాణతనాన్ని వాడుకోవడంలో తెలుగు నిర్మాతలు గ్రేట్… కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య పాటను, పదాన్ని, వాయిద్యాన్ని, దాని గానాన్ని అదేదో సినిమాలో వాడుకున్నట్టుగా వార్తలు… నిజమే, వాడేసుకున్నారు… భీమ్లానాయక్ ఆ సినిమా పేరు… పాట ఎత్తుకోవడమే ఓ లోతైన గొంతుతో మొగులయ్య హృదయ గానం… ఇక ఆ తరువాత అంతా జోగయ్య పైత్యంన్నర… ఆ ప్రాసలేమిటో లాఠీ గాయక్ ఏమిటో, ఆ ప్రాసల పద ప్రసవాలేమిటో పాపం, ఆ తెలుగు సినిమా కళామతల్లి కన్నీటికెరుక… ఇలాంటి విమర్శలు బోలెడు సోషల్ మీడియాలో…!! అబ్బే, ఇది తెలంగాణ పాటకు కట్టిన పట్టం అని కీర్తించినవాళ్లూ ఉన్నారు…!! సరే, ఎవరి ఆనందం వాళ్లది… కానీ ఫేస్బుక్లో చాలా పోస్టులు అన్నీ స్క్రోల్ డౌన్లో చూసీచూడనట్టు పోతుంటయ్ కదా… ఒక్క పోస్టు బాగా ఆకర్షించింది, దాని గురించి ఇంకేమీ చెప్పను, మీరే చదవండి… పోసాని కృష్ణమురళి మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది ఒక్కసారిగా…
ఆరేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతిలో “కిన్నెర కన్నీరు” అని మొదటి పేజీలో పెద్ద వార్తగా ఆంధ్రజ్యోతి మహబూబ్నగర్ రిపోర్టర్ అద్భుతంగా రాశారు.
Ads
ఆ వార్త చూసి చాలా రాతి హృదయాలు కరిగాయి కూడా..
తెలంగాణా సుప్రసిద్ధ ఆ ఆఖరి కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య ఆర్థిక దుస్థితి ని కళ్ళకు కట్టడం ఆ వార్త ఉద్దేశం..అదే రోజు మేము ABN లో మొగులయ్యతో రాత్రి 7 గంటలకు మహబూబ్ నగర్ నుంచి తీసుకుని వచ్చి చర్చ పెట్టాలని మన వంతు సాయం అందించాలి అని మా మూర్తి చెప్పారు..
సాయంత్రం 5 గంటలకు నాకు పోసాని కృష్ణ మురళి ఫోన్ చేసాడు..
చెప్పండి అన్నయ్యా.. అంటే కిన్నెర మొగులయ్య వార్త కన్నీరు పెట్టించింది సాయం చేయాలి అనుకుంటున్నా తమ్ముడు అన్నారు..
అసలే కరువులో ఉన్న వాడికి వర్షం ఎదురైనట్లు అనిపించింది
మీరు సాయం చేయాలనుకున్న మొత్తం
ఎవరితో అయినా పంపించండి స్టూడియో లో ఇప్పిస్తాను అన్నాను..
నేను బహుశా ఒక 5 వేలు సాయం చేయొచ్చు అని భావించాను…
కానీ అంత దూరం నుంచి పిలిచి స్టూడియో నుంచి వెళ్లేప్పుడు ఒక యాభై వేలైనా ఇచ్చి పంపిస్తే ఆ పేద కళాకారుడు కాస్త ఇబ్బందులకు దూరం అవుతాడు అని మనసులో ఉంది..
మొగులయ్య ఊహించినట్లే చిరిగిన ఒక్క జత బట్టలతో స్టూడియో చేరుకున్నారు.. డిబేట్ స్టార్ట్ అయ్యింది
నాయకులు, పెద్దవాళ్ళు సానుభూతి పర్వాలు సాగుతున్నాయి
డబ్బులయితే రాలడం లేదు..
మా మెంటల్ కృష్ణ అన్నయ్య “పోసాని” కోసం నేను వెయిటింగ్..
పోసాని కార్ వచ్చింది..
పోసాని కుటుంబ సమేతంగా వచ్చాడు
అదేంటి అని నేను షాక్ అయ్యాను..
స్టూడియోలో కూర్చోమన్నాను
అవసరమా అన్నాడు..
సాయం చేసే చేతులు కదా కూర్చుంటేనే మరింత మంది ముందుకువస్తారు అని సర్దిచెప్పి కూర్చోబెట్టాము..
పోసాని తన జేబులోంచి లక్ష రూపాయలు తీశారు
మొగులయ్య కాళ్లకు నమస్కారం పెట్టి
ఆయన ముందు పెట్టారు..
నాలుగు జతల మంచి కొత్త బట్టలు ఇచ్చారు..
ఇంకో మాట అన్నారు..
నీకు ఏ సాయం కావాలన్నా అర్ధరాత్రైనా నా తలుపుకొట్టు
నా ఫోన్ నెంబర్ తీసుకో అని రాసి ఇచ్చారు..
మేము అందరం అవాక్కయ్యాము..
ఒక కళాకారుడిగా కళ పట్ల పోసాని అన్నయ్యకు ఉన్న కమిట్మెంట్ అది..
ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే
ఆరోజు మొగులయ్య ఆకలితో సూసైడ్ చేసుకోకుండా బతికుండటానికి, అలా బతికి బట్టగట్టిన మొగులయ్య ఒక పాట పాడటానికి వెనక ఉన్న కారణం పోసాని కృష్ణ మురళి అని చెప్పడానికి..
ఈరోజు భీంలా నాయక్ తో పేరు వచ్చి ఉండవచ్చు
నైట్ కి నైట్ మొగులయ్య కి స్టార్ డమ్ తెచ్చిపెట్టి ఉండొచ్చు..
మీడియాకి ఈరోజే మొగులయ్య కొత్తగా కనిపించి TRP పెంచే అవకాశం అయి ఉండవచ్చు..
కానీ
మొగులయ్య పోసాని లాంటి వారికి చాలా పాత..
మొగులయ్య ఆర్ధిక కష్టాలలో ఆదుకోవడం కూడా పోసానికి చాలా పాత..
పోసాని మిగతా సినిమా వాళ్ళలా కాదు
నిఖార్సయిన మనిషి
నిండు మనిషి !
కళ గురించి తెలిసిన కళాకారుడు
ధైర్యం ఉన్న బ్రేవ్ హార్ట్..
అన్నయ్యా.. నువ్వు నీ మంచితనం వెయ్యేళ్లు బతకాలి అని కోరుకుంటున్నాను..
తమ్ముడు
క్రాంతి.
Share this Article