ఓ హీరోయిన్… ఒక హీరో… ఇద్దరూ ఇంట్రావర్టులే… ఒకరి పట్ల ఒకరి ప్రేమను కూడా వ్యక్తీకరించుకోలేరు… సిగ్గరులు… కొన్నేళ్లకు బండి గాడిన పడుతుంది… ప్రేమించుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అనే సూత్రాన్ని, పెళ్లే ప్రేమకు అంతిమ గమ్యం అనే తత్వాన్ని సినిమాలు, సాహిత్యం మనకు ఏళ్లకేళ్లుగా బాగా ఎక్కించాయి కదా… ఆ ప్రేమతత్వం మేరకే పెళ్లిచేసుకోవాలని వాళ్లు కూడా అనుకుంటారు… ఈలోపు హీరోకు ప్రమాదం జరుగుతుంది, ఆమె హతాశురాలవుతుంది… ఇక రెండో కృష్ణుడు ఆమె జీవితంలోకి వస్తాడు, అనగా రెండో హీరో… ఆ కృష్ణుడితో ప్రేమ… ఈలోపు మొదటి కృష్ణుడు హఠాత్తుగా వచ్చేస్తాడు……..
ఆగండాగండి… ఇది డియర్ మేఘా సినిమా కథ కదా అంటారా..? అవును, కన్నడంలో దియా పేరిట హిట్టయిన సినిమా కథ కదా..? అవును, దాని రీమేక్ ఇది… మరి అదే పేరుతో దాన్ని డబ్ చేసి గత నెల 19న తెలుగులో రిలీజ్ చేస్తామని అప్పట్లో ఓ ప్రిరిలీజ్ ఫంక్షన్ కూడా జరిపినట్టున్నారు… అవును, కానీ ఏమైందో తెలియదు… డియర్ మేఘ థియేటర్లలోకి వచ్చేసింది ఇప్పుడు… మరి డబ్బింగ్కూ రీమేక్కూ నడుమ ఏం జరిగిందో తెలియదు… (కన్నడ ప్రొడ్యూసర్లు రీమేక్ రైట్స్ అమ్మి, మళ్లీ తామే సొంతంగా డబ్ చేసి రిలీజ్ చేశారట, యూట్యూబులో కూడా ఉందట, ఇది మోసం కాదా… మరి తెలుగు నిర్మాతల మండలి ఏం చేయగలిగింది అనే అమాయకప్రశ్న మనం వేయకూడదు..? పెద్ద నిర్మాతల కోసం మాత్రమే ఆ మండలి… అదో డిఫరెంట్ సబ్జెక్టు, మళ్లీ చెప్పుకుందాం విడిగా….)
Ads
నిజం చెప్పాలంటే, ఈ నిర్మాతలు నిజాయితీగా ఉన్నారు… లేకపోతే ఆ కథను చకచకా తామే రాయించేసుకుని, సినిమా తీసేసి విడుదల చేసేవాళ్లు… రీమేక్ రైట్స్ కూడా అక్కర్లేదు… ఎందుకంటే… ఇదేమీ కొత్త కథ కాదు, అసలు కన్నడంలో తీసినవాళ్లే కాపీ కొట్టేశారు… కాపీ కొట్టినవాళ్ల కథను మనం కాపీ కొట్టడానికి కాపీ రైట్స్ ఏముంటయ్..? 1992లో దివానా అనే ఓ హిందీ సినిమా వచ్చింది… దివ్యభారతి హీరోయిన్, సినిమా బాగానే నడిచింది…
అన్నట్టు తెలుగులోనూ శ్రీకాంత్, సౌందర్య హీరోహీరోయిన్లుగా ప్రేమప్రయాణం అనే సినిమా కూడా వచ్చింది… (ఇదే పేరుతో మరో సినిమా వచ్చింది ఆమధ్య…) (సౌందర్య బాగా ఇష్టపడిన పాట ఈ ప్రేమప్రయాణం సినిమాలో ఉంది… ఎన్నో వరాల రూపంగా దొరికేదే అని స్టార్టవుతుంది ఆ పాట) అందాల రాక్షసి అని ఆమధ్య ఒక సినిమా వచ్చింది… అదే ఇదే… అయినా ముక్కోణపు ప్రేమకథలు మనకు కొత్తేముంది..? కాకపోతే ఈ విషాద క్లైమాక్స్ కన్నడంలో నచ్చిందేమో గానీ తెలుగులో ఎంతమేరకు నచ్చుతుందనేది డౌటే… పైగా కథనం ఎంతకూ కదలదు… స్పీడ్ లేదు… పాటలు ఎక్కవు… సినిమాలకు ప్రధానసూత్రం… కొత్త కథ చెప్పాలి లేదా పాత కథే కొత్తగా చెప్పాలి… ఇది పాత కథే, కొత్తగా కూడా చెప్పలేకపోయారు…
మేఘా ఆకాశ్ బాగానే చేసింది, ఇద్దరు హీరోలు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది… పవిత్ర లోకేష్ కూడా బాగా చేసింది… కానీ ప్రేమకథల్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయాలంటే సంగీతం బాగా కుదరాలి… అదిక్కడ మైనస్… కథ చెప్పడంలో మెళకువ కావాలి, అదీ మైనస్… ప్చ్, డియర్ మేఘా… బెటర్ లక్ నెక్స్ట్ టైమ్…!! సినిమా చూడటానికి తొందరేమీ లేదు… మరీ థియేటర్ల దాకా పడుతూలేస్తూ పరుగులు తీస్తూ వెళ్లి చూడాల్సినంత సీనేమీ లేదు… వెయిట్..,
ఓటీటీ ఉంది, టీవీ ఉంది… వస్తుంది…!! అవునూ, ఇంతకు తెలుగులోకి డబ్ చేసిన దియా ఏమైనట్టు..? ఎనీ ఐడియా..?! ఎలాగూ రీమేక్ రైట్స్ డబ్బులొచ్చాయి కదా అనుకుని డబ్ చేసిన వెర్షన్ అటక మీద పారేసి ఉంటారా..?! బహుశా ఈసారి మూడో కృష్ణుడినీ ప్రవేశపెట్టే మరో కథ రాయడంలో బిజీ అయిపోయి ఉంటారు..!! ఏముందిలే.., ఈసారి ‘దియా దిల్ దియా’ అని ఏదో దిక్కుమాలిన పేరు పెట్టేసి, బహుశా చకచకా ఆ సినిమా కూడా చుట్టేసి, ఇంకెవరికో దాని రీమేక్ రైట్స్ అమ్మేసి, అది రాకముందే తమ సినిమా డబ్ చేసి రిలీజ్ చేయడానికి లేదా ఏదో ఓటీటీకి అమ్మేయడానికి ప్లాన్ చేసి ఉంటారు, రుచిమరిగినట్టున్నారు కదా ఆల్రెడీ…!!!
Share this Article