ఓ తెలంగాణ జానపద వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య అలియాస్ కిన్నెర మెట్ల మొగులయ్యకు పోసాని కృష్ణమురళి లక్ష ఇచ్చాడు… గుడ్… ఏబీఎన్ చానెల్ ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసి కొన్ని విరాళాలు ఇప్పించే ప్రయత్నం చేసింది… గుడ్… పవన్ కల్యాణ్ 2 లక్షలిచ్చాడు… గుడ్… తెలుగు సినిమాకు ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ జానపదం రంగు, రుచి, వాసన, చిక్కదనం కావాలి కాబట్టి… ఏ పదప్రాసలు, ప్రయాసల జోగయ్యో రాసిన ఓ భజన పాటకు ఏ కాపీ సంగీతరాయుడో పూనుకుని, ఈయన కిన్నెర మెట్ల వాయిద్యపు శృతుల్ని, పల్లవిలోని లయగతుల్ని వాడేసుకుని ఉంటాడు… సో, నిర్మాతలు కూడా ఎంతోకొంత ఇచ్చే ఉంటారు… గుడ్… ఇన్ని వెరీ గుడ్ల నడుమ ఓ గడ్డు ప్రశ్న… మరి మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయలేదా..? చెప్పుకోవాలి…
మిగతా పాలన వ్యవహారాలు, విధాన నిర్ణయాలు తదితరాలెలా ఉన్నా… తన దృష్టికి వచ్చిన ఇలాంటి కళాకారుల దురవస్థల పట్ల కేసీయార్ ఉదారంగా వ్యవహరిస్తుంటాడు… కొన్ని వార్తలు చదివి తనే సాంస్కృతిక శాఖకు వివరాలు పంపించి, పెన్షన్లు ఇవ్వాల్సిందిగా ఆదేశించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి… మనసొస్తే మల్లి తరహా…, తను కనెక్టయితే అండగా నిలబడతాడు… ప్రత్యూష దగ్గర నుంచి పావలా శ్యామల దాకా బోలెడు ఉదాహరణలు… తన పార్టీకి, తన ప్రభుత్వానికి ప్రచారలబ్ధి కోసమే కావచ్చుగాక వందల మంది కళాకారులకు ప్రభుత్వం ఖజానా నుంచి జీతాలిచ్చింది ఓ సంస్థను ఏర్పాటు చేసి..! ఒక కాంతారావు భార్యకు ప్రత్యేక పెన్షన్ కావచ్చు… ఒక పావలా శ్యామలకు ప్రత్యేక పెన్షన్ కావచ్చు… చిత్రకారుడు భరత్ భూషణ్ కావచ్చు… పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు కావచ్చు… చాలామందికి స్పెషల్ పెన్షన్లు ఇస్తున్నది తెలంగాణ సాంస్కృతిక శాఖ… కాకపోతే ఆ సాయం ఫోకస్‌లోకి రావడం లేదు… ఇదే పావలా శ్యామల ఒకవైపు పెన్షన్ తీసుకుంటూనే నన్నెవడూ పట్టించుకోవడం లేదు మొర్రో అని మొత్తుకుంటుంది… మీడియాలో పదే పదే అదే ఫోకస్ అవుతోంది… ఇదొక ఉదాహరణ మాత్రమే…
Ads
ఇదే మొగులయ్యకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఏడేళ్లుగా ఎప్పుడు అవసరం వచ్చినా అండగా నిలిచింది… కడుపు నొచ్చినా, కాలు నొచ్చినా … ఆరోగ్య అవసరానికి, ఆర్థిక అవసరానికి కూడా ఎంతోకొంత సర్దుబాటు చేస్తూ ఆదుకుంది… ఉగాది పురస్కారం ఇప్పించింది… అంతెందుకు, మహబూబ్‌నగర్‌లో 500 గజాల స్థలం ఇచ్చి, ఓ ఇల్లు కట్టించాలని కూడా ప్రయత్నించింది, కలెక్టర్‌తో సంప్రదింపులు జరిపింది… కానీ ఇదే మొగులయ్య అక్కడ తనకు ఇల్లు వద్దని, సిటీలో కావాలని కోరడంతో, అది ఎక్కడికక్కడ ఆగిపోయింది… దర్శకుడు సాగర్‌చంద్రకు (కరీంనగర్) రెఫర్ చేసింది కూడా ఈ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణే… సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ గనుక దొరికితే మొగులయ్యకు ఆర్థికంగా మంచి వెసులుబాటు దొరుకుతుందని భావించారు… అంతేకాదు, మూడు నాలుగు నెలలుగా నెలకు పది వేల రూపాయల ప్రత్యేక పెన్షన్ కూడా మొగులయ్యకు ఇస్తున్నారు… కిన్నెరమెట్ల వాయిద్యకళ అంతరించిపోకుండా 35 మందిని ఎంపిక చేసి, శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు… పేద, వృద్ధ కళాకారులకు కేంద్రం కూడా కొంత సాయం చేస్తుంటుంది… లబ్దిదారుల సంఖ్యను, ఆ పెన్షన్ మొత్తాన్ని పెంచగలిగితే, వాళ్లకు రాష్ట్రం కూడా తన కంట్రిబ్యూషన్ జతచేయగలిగితే… కళకు మళ్లీ కాస్త ‘జీవకళ’…!!
Share this Article