.
నాగార్జునసాగర్ టు శ్రీశైలం… సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణాలు ప్రారంభించామనే తెలంగాణ టూరిజం వారి ప్రకటన, వార్తలు చాలా కనిపిస్తున్నాయి… వన్ వే, రిటర్న్, పెద్దలకు, పిల్లలకు ప్యాకేజీలు గట్రా కనిపిస్తున్నాయి… అవి చదువుతూ ఉంటే… అప్పట్లో… అంటే పదకొండేళ్ల క్రితం… నవంబరు నెలలో… ఓ మీడియా టీమ్ చేసిన యాత్ర ఒకటి యాదికొచ్చింది…
Ads
సాగర్ టు శ్రీశైలం టూరిజం యాత్ర అంటే… అది వేరు… అప్పటికే టూరిజం వాళ్లు ఓ మరబోటు నడిపించేవారు… కానీ సోమశిల టు శ్రీశైలం యాత్ర పూర్తిగా వేరు… వందల చదరపు కిలోమీటర్లుగా పరచుకున్న శ్రీశైలం బ్యాక్ వాటర్స్, అంటే ఆ సముద్రం మీద ప్రయాణం ఇది… సోమశిల నుంచి శ్రీశైలం యాత్ర అప్పట్లో చాలా క్లిష్టం, కష్టం కూడా… సాహసం కూడా…!
నమస్తే తెలంగాణ పాత్రికేయ బృందం ఒకటి పదకొండేళ్ల క్రితం సోమశిల నుంచి బయల్దేరింది… ఆ మీడియా టీమ్ యాత్ర ఉద్దేశం ఆ జలజర్నీని అనుభూతించడమే కాదు, టూరిజానికున్న అవకాశాల్ని ఎక్స్‌ప్లోర్ చేసి ప్రచురించడం కోసం…
హైదరాబాద్ నుంచి దాదాపు 170 కిలోమీటర్లు వెళ్తే కొల్లాపూర్… అక్కడి నుంచి 8 కిలోమీటర్లు వెళ్తే సోమశిల ఊరు… అప్పట్లో అది జస్ట్, ఓ మత్స్యకారుల చిన్న పల్లె… అక్కడ పుష్కర స్నానాల కోసం కట్టిన చిన్న ఘాట్ ఉండేది… అంతే…
దాదాపు పది గంటల ప్రయాణం… దాదాపు వంద కిలోమీటర్లు… కింద నీరు, పైన ఆకాశం… చుట్టుపక్కల దట్టమైన చెట్లతో గుట్టలు… అంతే… ఫోన్ ఉండదు, ఓ చేపలు పట్టే పడవలో ప్రయాణం ఓ సాహసమే… ఎందుకంటే..?
అనేకచోెట్ల చేపల కోసం విశాలంగా వేసిన చిక్కటి, గట్టి వలలు… ఓ దశలో ఒక నక్సలైట్ల టీమ్ ఆ వలలో చిక్కి భారీగా నష్టపోయింది కూడా… జిల్లా కార్యదర్శి సాంబశివుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు ఆ దుర్ఘటనలో… తమతో ఉన్న ఆ ఏరియా మత్స్యకారులు కూడా కాపాడలేకపోయారు… అంతటి దుర్గమ ప్రాంతాలవి…
చుక్కల కొండ అనే ఓ ప్రాంతం… దట్టంగా చెట్లు ఉండే రెండు గుట్టల నడుమ, చెట్ల కిందుగా బోటు వెళ్తుంటే చీకటి పడినట్టు అనిపించి చుక్కలు కనిపిస్తాయనే భావనతో జాలర్లు ఆ పేరు పెట్టారు… ఓ చిన్న చేపలు పెట్టే పడవలో ఆ జర్నీ అంటే ప్రకృతిలో ప్రయాణించడం… అదీ ప్రమాదంతోపాటు..!
నిజం… అంతకుముందు ఆ అడవులు, ఆ నీరు, ఆ ఏరియాల్లో నిత్యం పోలీసులు, నక్సలైట్ల సమరమే… పాత్రికేయ బృందానికి మధ్య మధ్య ఒకటీ అరా జాలర్ల బోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి… అంతే… పైనుంచి సర్రుమనే ఎండ… మధ్యలో కేవలం జాలర్లు మాత్రమే నివసించే చిన్న ఊరు… ఊరు కూడా కాదు, కొన్ని ఇళ్లు… కొన్ని గుట్టల మీద చిన్న చిన్న టెంపుల్స్…
సోమశిలలోనే అవసరమైనంత వండించుకుని… బోటులో పెట్టుకుని ఇక ప్రయాణం షురూ… ఆకలైనప్పుడు ఓ పక్కన గుట్ట ఒడ్డున బోటు ఆపుకోవడం, తినడం.,. కాసేపు స్నానాలు… మళ్లీ ప్రయాణం… నిజంగా పది గంటల ప్రయాణం… శ్రీశైలం పాతాళగంగ చేరాక, పైకి వెళ్లి ఓ సత్రంలో విడిది, తెల్లారి దర్శనం… బస్సులో హైదరాబాద్ తిరుగు ప్రయాణం…
మరపురాని ప్రయాణం… ఇప్పుడంటే సోమశిల రూపురేఖలు మారిపోయాయి… కాటేజీలు, రిసార్ట్స్, హరిత రెస్టారెంట్, లాంచీ… రయ్యున సాగిపోయే జలప్రయాణం… అప్పట్లో నమస్తే ఈ కథనాలకు పెట్టిన హెడింగ్ ‘ కృష్ణమ్మ పాపికొండలు’… ఇప్పుడదే నిజమైంది…
తెలంగాణ పాపికొండల యాత్రే ఈ సోమశిల టు శ్రీశైలం లాంచీ కూడా… సోమశిలను టూరిజం పాయింట్‌గా డెవలప్ చేసి, శ్రీశైలం దాకా లాంచీని నడిపించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ కృషి అభినందనీయం… దానికి ఓ దిశను చూపించింది మాత్రం నాటి నమస్తే ప్రత్యేక కథనాలే…
ఇప్పుడు యూట్యూబ్ చానెళ్లు నల్లమల మాల్దీవులు అని కూడా పేర్లు పెట్టేస్తున్నాయి… హైదరాబాద్ నుంచే గాకుండా ఇతర పట్టణాల నుంచి కూడా టూరిస్టులు ఈ యాత్రపై ఇప్పుడు బాగా ఆసక్తి చూపిస్తున్నారు… శ్రీశైలంలో నీరుంది కాబట్టి లాంచీ ప్రయాణం కూడా సులభం…
శ్రీశైలం తీసుకెళ్లి, దర్శనం అయ్యాక మళ్లీ అదే లాంచీలో వాపస్ వచ్చేయవచ్చు… లేదంటే వన్ వే బుక్ చేసుకుని, శ్రీశైలం నుంచి బస్సులో వాపస్ రావచ్చు… లాంచీలోనే లైట్ ఫుడ్… రేట్లే కాస్త ఎక్కువ అనిపిస్తున్నాయి… అంతే…
Share this Article