పాపం శమించుగాక… తెలుగు సినిమా ఒకప్పటి పాపులర్ కమెడియన్ బ్రహ్మానందాన్ని తెర మీద చూస్తేనే నవ్వొస్తుంది… అది తను సంపాదించుకున్న క్రెడిట్… ఒక దశలో అసలు బ్రహ్మానందం లేకుండా తెలుగు సినిమా లేదు అన్నంతగా పాపులారిటీని ఎంజాయ్ చేశాడు, అఫ్ కోర్స్, నవ్వించాడు, మంచి నటుడు… కామెడీలో బ్రహ్మాండమైన టైమింగ్… ఈమధ్య సినిమాల్లేవు, పట్టించుకున్నవాళ్లు లేరు… తనకు ఇష్టమైన, తెలిసిన ఆర్ట్ మీద దృష్టి పెట్టాడు… మరీ మోడర్న్ ఆర్ట్ తరహాలో ఎవడికీ అర్థం కాని చిత్రాలు గీయడం లేదు కానీ, తను గీసిన ఈ చిత్రం చూస్తే, వెంటనే బ్రహ్మానందాన్ని చూడగానే నవ్వొచ్చినట్టుగా మళ్లీ నవ్వొచ్చింది.,. ఫాఫం, బ్రహ్మానందం…
అంటే అన్నామంటారు గానీ… క్రియేటివిటీకి కూడా కాస్త బుర్ర ఉండాలండీ మై డియర్ బ్రహ్మానందం గారూ… మీరు బొమ్మలు బాగా గీస్తారు గానీ దానికి ఓ అర్థం, పరమార్థం అంటూ ఉండాలి కదా… మరీ దిక్కుమాలిన తెలుగు టీవీ సీరియల్ రచయితల్లాగా, దర్శకుల్లాగా మారిపోతే ఎలా మాస్టారూ..? అర్ధనారీశ్వరుడు బొమ్మలు బొచ్చెడు చూశాం, శివుడు-పార్వతిని సగం సగం దేహాలు కలిపేసి చిత్రాలు చాలామంది గీశారు… అవి భక్తి భావనను కలిగిస్తయ్… అంతేకాదు, శివపార్వతుల ఆత్మసంగమం గురించీ చెబుతయ్… మరి మీరేమిటి సార్, హరి, హరుడికీ అదే క్రియేటివిటీ చూపించేశారు..?
Ads
ఓహ్, కొత్తదనమా..? కానీ ఒక్కసారి బొమ్మ గీశాక మనేమేం గీశామో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా… ఇది తెలుగు సినిమా కాదు కదా మాస్టారూ, మనమేదో తీస్తాం, ప్రేక్షకుడి ఖర్మ అని సర్దిచెప్పుకోవడానికి..!! హరి వేరు కాదు, హరుడు వేరు కాదు అనే భావన గొప్పదే… కానీ ఈ హరిహర ఏకత్వం అనేది ఒకప్పుడు శైవులు, వైష్ణవులు తన్నుకుని చచ్చిన రోజుల్లో పాపులర్ ప్రచారం… ఏకంగా అయ్యప్పనే సృష్టించుకున్నాం, పూజిస్తున్నాం… అదో పెద్ద కథ… కానీ మరీ ఇలా హరి సగం, హరుడు సగం కలిసిపోయిన కలగలుపు ఏకదేహాన్ని గతంలో ఎవరైనా గీశారో లేదో తెలియదు గానీ… మీరో ప్రయోగం చేశారు…
పోనీ, భక్తితోనే చేశారు, కానీ ఆ బొమ్మ ఒకసారి చూడండి… మూడు కాళ్లు, మూడు చేతులు వచ్చాయి… అంటే హరి, హరుడు కలిస్తే ఈ మూడు కాళ్ల వింత రూపం ఏమిటి సార్..? పైగా వెంకటేశ్వర స్వామి స్థిరంగా ఓచోట నిలబడి ఆశీర్వదిస్తున్నాడు, మరోపక్కన నటరాజ స్వామి ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉన్నాడు… ఈ యాక్షన్ ప్లస్ ఇన్‌యాక్షన్ కలయిక ఏమిటి మాస్టారూ…? అబ్బే, మీరు గొప్ప గీతగాళ్లే, కాదనడం లేదు… కానీ మనం ఏదైనా గీస్తున్నప్పుడు, అదీ కోట్లాది మంది ప్రజల భక్తి మనోభావాలకు ముడిపడి ఉన్నప్పుడు కాస్త ఇంగితం, కాస్త సోయి, కాస్త బుర్ర కూడా ఉండాలి కదా సార్… అదుగో, ఇవే అంటే కోపాలు…
సంకల్పం, ఉద్దేశం, శ్రమ, ప్రయాస మంచివే కావచ్చుగాక… కానీ ఫైనల్ అవుట్ కమ్ ఏమిటో కూడా చూడలేని సోయిలేనితనం దేనికి మాస్టారూ..? ఇదేమైనా రాఘవేంద్రరావు సినిమాల్లోని పిచ్చి కామెడీ సీన్లా..? బుద్ధీ, బుర్ర గట్రా లేకుండా జనంపై వదిలేయడానికి..? పైగా నటరాజ స్వామి కాళ్ల కింద చచ్చే చావు చచ్చిన ఓ అసురుడి దేహం కూడా సగమే… మరోసారి చూడండి జాగ్రత్తగా… మీరే నవ్వుకుంటారు… అఫ్ కోర్స్, మన మైండ్‌లెస్ బొమ్మలకు మనం నవ్వుకోవడంకన్నా గొప్పతనం ఏముంటుంది..? ఓసారి నవ్వండి, గట్టిగా నవ్వండి… బొమ్మ చూసి పకపకా నవ్వుతున్న జనంలాగే…!! హరహరా… సారీ, హరిహరీ… హరహరా… క్షమించు ఈ భక్తుడిని… ఏదో నవ్వులాట అనుకున్నట్టున్నాడు… ఓ త్రిపాద, త్రిహస్త దేవా… నువ్వూ నవ్వుకో ఓసారి గట్టిగా…!!!
Share this Article