భజన గానీ, కీర్తన గానీ, డప్పు గానీ… జాగ్రత్త అవసరం, శృతి తప్పితే ఎదురు తంతుంది… ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రజ్యోతి పుంఖానుపుంఖాలుగా రాసే కథనాలు నిజానికి తెలుగుదేశానికి మంచి చేస్తున్నాయో, చెడు చేస్తున్నాయో చెప్పడం కష్టం… పదీపదిహేను చేతులతో ఎడాపెడా రాసేవాడికి, పేజీల్లో యథాతథంగా వేసేవాడికి కాస్త సంయమనం గనుక తప్పితే అసలుకే మోసం.,. అఫ్ కోర్స్, రాధాకృష్ణ కూడా మావాళ్లు భలే ఇరగదీస్తున్నారు అనుకుంటున్నాడేమో గానీ కొన్ని కథనాలు ఉల్టా దెబ్బ కొడుతున్నాయని గ్రహించడం లేదు… (ఏమో, లోకేష్ అంటే లోలోపల ఏమైనా కోపం గట్రా ఉన్నాయేమో కూడా తెలియదు)… ఆ కథనం ఏమిటయ్యా అంటే… ఇదీ… అందులో విషయం ఏమిటీ అంటే… వైసీపీ ఓ కొత్త కుట్రకు తెరతీసిందట… ప్రశాంత్ కిషోర్ టీం ఎవరో రిషి అనే వ్యక్తి నేతృత్వంలో మౌత్ పబ్లిసిటీ అనే కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు తెలిసిందట… మెల్లిగా జనంలోకి వెళ్లి, ముచ్చట్లు స్టార్ట్ చేసి, చంద్రబాబును మెచ్చుకుని, కానీ ముసలివాడయ్యాడు కదా, ఈసారి గెలిస్తే లోకేష్ సీఎంను చేస్తాడు అనే అనుమాన బీజాల్ని ఎక్కిస్తారట… దీనికోసం వైసీపీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారట… ఈ తప్పుడు వ్యూహం తెలిసిపోయి, తెలుగుదేశం కూడా అలర్టయిపోయి, కౌంటర్ స్ట్రాటజీలను రచిస్తోందట…
హమ్మయ్య.., ఇదీ ఆ కథనం సారాంశం… వైసీపీకి రిషి (ఒరియన్..?) పనిచేసేది నిజమేమో గానీ… అదే పీకే అనే సోషల్ చెట్టుకే మొలిచిన రాబిన్ శర్మ అనే కొమ్మ ప్రస్తుతం తెలుగుదేశానికి పనిచేస్తున్నాడని ఈ కథన రచయితకు తెలిసినట్టు లేదు, తెలిసీ దాచిపెట్టాడేమో అసలే తెలియదు… పైగా రిషి టీంకు ఇప్పటిదాకా ఈ ఆలోచన ఉందో లేదో తెలియదు గానీ, ఆంధ్రజ్యోతే మంచి ఆయుధాన్ని, ఆలోచనను అందించినట్టు అయిపోయింది… ‘‘ఒరేయ్ నాన్నా… చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, వచ్చే ఎన్నికల్లో గనుక గెలిపిస్తే లోకేష్‌ను సీఎంను చేసేస్తాడు, ఇది జనంలోకి తీసుకెళ్తే వైసీపీకి బెటర్…’’ అని చెబుతున్నట్టుగా ఉంది… లోకేష్‌ను ఓ అసమర్థుడిగా ముద్రవేస్తున్నట్టుగా ఉంది… ఇదీ అభ్యంతరకరం… దేశంలో ఎక్కడా లేదా పాపం..? ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీలన్నీ దాదాపు కుటుంబ, వ్యక్తి పార్టీలే కదా… హిందూ వారసత్వ ఆనవాయితీల మేరకు కొడుకులకు వారసత్వం దక్కుతూనే ఉంటుంది… ఎందుకంటే, పార్టీలు వాళ్ల ఆస్తులు… ఎగువన కాశ్మీర్ ఫరూక్ నుంచి దిగువన తమిళనాడు స్టాలిన్ దాకా… మగ వారసత్వాలే కదా… మరీ మగ దిక్కులేకపోతే ఆడవారసత్వం… కథన రచయితకు, పత్రికకు లోకేష్ పట్ల నిజంగానే దురుద్దేశాలు ఉండకపోవచ్చు, బాస్ కొడుకు మీద ఆ ద్వేషం ఎందుకు ఉంటుందిలే గానీ… ఈ కథన రచనలో కనబరిచిన అత్యుత్సాహం కాస్తా… పుసుక్కున చంద్రబాబు లోకేష్‌ను సీఎంను చేస్తాడో ఏమో, అది నష్టం సుమా అని ప్రజలకు పరోక్షంగా బోధిస్తున్నట్టు అయిపోయింది…
Ads
పాపం లోకేష్ మీద అసమర్థుడు అనే ముద్రవేయడం కూడా కరెక్టు కాదు… తనూ బాగా చదువుకున్నాడు… మంచి తెలుగులో మాట్లాడటం ఎలాగో నేర్చుకుంటున్నాడు… స్థూలకాయాన్ని కాస్త కత్తిరించుకుని, స్లిమ్‌గా తయారయ్యాడు… మాటలో పదును వచ్చింది… కానీ వయస్సు, అనుభవం తక్కువ కాబట్టి అప్పుడే చంద్రబాబు స్థాయిలో ‘ఆపరేషన్స్’ సాధ్యం కాకపోవచ్చుగాక… నేర్చుకుంటాడు కదా…! ఏం..? జగన్ పుట్టుకతోనే లీడరా..? కాలం నేర్పింది తనకు రాజకీయం ఏమిటో… తెలంగాణలో కేటీయార్ నేర్చుకోవడం లేదా..? బీహార్‌లో తేజస్వి, యూపీలో అఖిలేష్, కర్నాటకలో కుమారస్వామి, మహారాష్ట్రలో ఠాక్రే తదితరులు పదునెక్కడం లేదా..? వారసత్వ అవసరాలు అన్నీ నేర్పిస్తాయి… ఒక్క లోకేష్‌నే తప్పుపడితే ఎలా..? సో, ‘‘టార్గెట్ బాబు’’ అనే హెడ్డింగ్ స్పిరిట్ కాస్తా ‘‘టార్గెట్ లోకేష్’’ అన్నట్టుగా జనంలోకి వెళ్లిపోయింది…!!
Share this Article