Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రోజుకు ఎన్ని గంటలు..? 24…. కాబోదు, లెక్క తప్పుతోంది మాస్టారూ..!!

July 20, 2024 by M S R

ఇక రోజుకు 24 గంటలు కాదా?

దేనికయినా టైమ్ రావాలి.
ఎవరికయినా టైం బాగుండాలి.
టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్- కాలం, అల ఒకరికోసం నిరీక్షించవు.
కాలో జగద్భక్షకః – జగత్తును కాలం తినేస్తూ ఉంటుంది.
కాలోహి బలవాన్ కర్తా – కాలమే అన్నిటికంటే బలమయినది.
విష్ణువు రెండు కళ్లు సూర్య చంద్రులు. సూర్య చంద్రుల గమనమే కాలం. అందుకే కాలం మనకు దైవ స్వరూపం.

మంచి కాలం ఉన్నట్లే చెడు కాలం కూడా ఉంటుందనే నమ్మికతోనే వర్జ్యం, రాహుకాలం, యమగండాలను తప్పించుకునేందుకు తిథి వార నక్షత్రాలను చూస్తుంటాం. సుముహూర్తే సావధాన…అని దేవ దేవుడి పెళ్లికయినా మంచి టైమ్ చూడాల్సిందే.

Ads

మన గడియారాల్లో బ్యాటరీ అయి పోవడం వల్ల టైమ్ లేట్ కావచ్చు. ముందుగా తిరగవచ్చు. కానీ కాల చక్రం మాత్రం యుగయుగాలుగా గతి తప్పదు. మతి తప్పదు.

పాడు కాలం.
మంచి కాలం.
కష్ట కాలం.
కొంత కాలం.
ఎండా కాలం.
వానా కాలం.
చలి కాలం.
పరీక్షల కాలం.
జీవిత కాలం…ఇలా ప్రతి క్షణం, ప్రతిదీ కాలానికి లోబడి ఉండాల్సిందే. కనురెప్ప పడే కాలమే నిమిషం. కనురెప్ప పడదు కాబట్టే దేవతలు అనిమేషులు. నిమిషాలతో మొదలై గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు, యుగాలు, కల్పాలు, బ్రహ్మ కల్పాల దాకా అన్ని లెక్కలు కాలానికి ఆధీనమై ఉన్నవే. అన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సినవే.

మావి చిగురు తినగానే కోయిల పాడుతుందా?
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడుగుతుందా?
వసంతం వస్తోందని తెలిసి ప్రకృతి పురివిప్పి హొయలు పోతుందా?
ప్రకృతి పరవశిస్తోందని తెలిసి వసంతమొస్తోందా?
బండలు పగిలే ఎండలు పోగానే-
ఆకాశానికి చిల్లులు పడే వర్షాలను కురవమని చెబుతున్నదెవరు?
ఊరూ వాడా మునిగిపోయే వర్షాలు కాగానే ఎముకలు కొరికే చలి మంచును చల్లుతున్నదెవరు?
ఎండల్లోనే పండాలని మామిడికి టైమింగ్ ను సెట్ చేసిందెవరు?
ఎండల్లో గుండు మల్లెల మత్తు చల్లడానికి టైమింగ్ ను సెట్ చేసిందెవరు?
ఏ రుతువులో కాలం ఎలా ఉండాలో? ఎలా ఉండకూడదో? నియంత్రిస్తున్నదెవరు? పర్యవేక్షిస్తున్నదెవరు?

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగమన్నదెవరు? అలా తిరక్కపోతే మనకు రాత్రి పగళ్లు ఉండేవా? బతుకంతా చీకటే అయితే మన బతుకులు ఈమాత్రం అఘోరించేవా? బతుకంతా పగలే అయితే నిదురలేని లోకం పిచ్చిదైపోదా?

కాలానికి నియతి స్వభావం. కాలం దొర్లకపోతే కాలం గడవని లోకం పిచ్చిదైపోతుంది. పడమటి కొండల్లో దిగులుగా దిగిన సూర్యుడు తూరుపు కొండల్లో నవ్వుతూ నిదుర లేపడానికి రావాల్సిందే. కురిసే మబ్బులు, ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపులు, పూచే పువ్వులు, వీచే గాలులు, పెరిగే వయసులు, రాలే ఆకులు…సర్వం…సమస్తం కాలం చేతి మాయాజాలాలే.

పొద్దుపొడుపు- పొద్దుగుంకడాల మధ్య నడవాల్సిన మనకు కాలమే తోడు నీడ. కాలంతో పరుగులు పెట్టాలి. కాలానికి ఎదురీదుతున్నామనుకుంటూ, కాలగతిలోనే కొట్టుకుపోతూ ఉంటాం. గడిచిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కు తీసుకురాలేం. రావాల్సిన ఒక్క క్షణాన్ని కూడా ముందుగానే తీసుకురాలేం. కాలం చేతిలో ఆడే ఆట బొమ్మలం.

అనంతకాలానికి ఆది లేదు. తుది ఉండదు. కానీ మనకు మాత్రం ఆది- అంతాలు ఉంటాయి. ఉండి తీరాలి. మనం కాలానికి అతీతులం కాము. కాలాతీత విఖ్యాతుడు పరబ్రహ్మ ఒకడే ఉంటాడని త్యాగయ్య స్పష్టంగా చెప్పాడు.

మనవన్నీ దిన చర్యలే. ఉదయం లేవాలి. తినాలి. పడుకోవాలి. మళ్లీ లేవాలి. మళ్లీ పడుకోవాలి. ఇదే పునరపి…పునరపి…

సృష్టికి ఆటోమేటిక్ అలారం ఉంటుంది. దానికి ఇంకొకరు అలారం పెట్టి సమయానికి తగిన పనులు చేయాలని చెప్పాల్సిన పనిలేదు. మనకలా కాదు. అలారం తట్టి లేపాలి. గడియారం సమయం చెబుతూ తొందర పెట్టాలి. నిముషాల ముల్లు వేగంగా తిరగాలి. గంటల ముల్లు నెమ్మదిగా నడవాలి. భోజనానికి గంట కొట్టాలి. బడికి గంట కొట్టాలి. పూజకు గంట కొట్టాలి. ఉంటే గుండె గంట కొట్టాలి. పొతే చావు డప్పు కొట్టాలి. గడియారాన్ని చూస్తూ బతకాలి. టైమ్ వచ్చినప్పుడు గడియారాన్ని చూడకుండానే పోవాలి.

సృష్టి గడియారానికి- జీవ గడియారానికి- గోడ మీద లేదా చేతి గడియారానికి అంతర్గతంగా లంకె ఉంటుంది. పగలు పని చేయాలి. రాత్రి పడుకోవాలి. ఇది సృష్టి ధర్మం. మనమిప్పుడు పగలు పడుకుని రాత్రిళ్లు జడలు విప్పి నర్తిస్తున్నాం. ఆ చర్చ ఇక్కడ అనవసరం. ఆఫీసు వేళలు, ఇతర రోజువారీ కార్యక్రమాలు, సమస్త దైనందిన జీవితం ఈ జీవ గడియారం పరిధిలోనే ఉంటుంది. అలాగే ఉండాలి.

కాలం కొమ్మకు-
చిగురించిన యుగాలెన్నో?
కుసుమించిన పుష్పాలెన్నో?
కాచి…పండి…రాలిపోయిన పళ్లెన్నో?
చీకటి దుప్పటి కప్పుకుని రెప్పవేసిన రాత్రులెన్నో?
వెలుగుపూల రేకులు విచ్చిన వేకువలెన్నో?
వాలిపోయిన పొద్దుల్లో వర్ణాల సుద్దులెన్నో?
రాలిపోయిన కాలం ఆకుల మాటున వినిపించే జ్ఞాపకాలెన్నో?

అలాంటి కాలానికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. నిమిషానికి అరవై సెకెన్లు. గంటకు అరవై నిముషాలు. రోజుకు ఇరవై నాలుగు గంటలు. వారానికి ఏడు రోజులు. నెలకు నాలుగు వారాలు. సంవత్సరానికి పన్నెండు నెలలు- నాలుగు రుతువులు. పుష్కరానికి పన్నెండేళ్లు. ఇలా యుగాలు, కల్పాలు, బ్రహ్మకల్పాలు, మన్వంతరాల దాకా కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాల కాలాన్ని కచ్చితంగా లెక్కలు కట్టేవాళ్లం.

భూమిపై నానాటికీ పెరిగే వేడి- ‘భూతాపం’ (గ్లోబల్ వార్మింగ్)వల్ల గ్రీన్ ల్యాండ్, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ధ్రువప్రాంతాల్లో మంచు వేగంగా కరిగిపోతోంది. ఇదిలాగే కొనసాగితే మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి…క్రమంగా భూభాగం తగ్గుతుంది. సముద్రాలపై పడే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, భూ గురుత్వాకర్షణ శక్తిమీద సముద్రాల విస్తీర్ణం పెరిగే ఈ ప్రభావం పడి…భూ భ్రమణ వేగం నెమ్మదించే ప్రమాదం ఉంది. 24 గంటల రోజులో ఒక మిల్లీ సెకను పెరిగినా…అల్లకల్లోలమయ్యే విషయాలు చాలా ఉన్నాయి. ఇంటర్నెట్ ట్రాఫిక్, ఆర్థిక లావాదేవీలు, ఉపగ్రహాల ప్రయోగాలు-ప్రసారాల్లాంటివి తడబడి…తొందరపడి కోయిలలు ముందే కూసి…మన కొంపలు ముంచవచ్చు. లేదా వేళకు కూయక కూడా మన కొంపలు ముంచవచ్చు.

సులభంగా అర్థం కావడానికి ఇలా అనుకోవచ్చు. ఒక ఉపగ్రహాన్ని ఫలానా రోజు ఉదయం 9 గంటలా 9 నిముషాలా 9 సెకన్ల వేళకు అంతరిక్షంలోకి వెళ్లేలా బటన్ నొక్కితే…ఆ సమయం మన గడియారం ప్రకారం కచ్చితమే అయి ఉండవచ్చు కానీ…భూ భ్రమణంలో వచ్చిన నెమ్మది వల్ల అది 9 గంటలా 8 నిముషాలా 8 సెకన్లు అయి ఉంటుంది. ఇంకా లోతుగా వెళితే- కొన్ని యుగాల తరువాత గడియారాల్లో రాత్రి 12; పగలు 12 గంటలు తీసేసి…రాత్రి 11; పగలు 11 గంటలు పెట్టుకోవాల్సి రావచ్చు!

మరీ విడ్డూరం కాకపొతే- ఇవన్నీ అయ్యేవా! చచ్చేవా!
మన శరీరతాపం తీర్చుకోవడానికి భూతాపాన్ని ఎంతగా మండిస్తే మనమంత ప్రయోజకులం. శక్తిమంతులం. మన తరువాత ఈ తొక్కలో భూమి ఏమైతే మనకేమిటి?
మన తరువాత భూమి తన చుట్టూ తను తిరుగుతూ…సూర్యుడి చుట్టూ తిరిగితే ఎంత? తిరగకపోతే ఎంత?
నెమ్మదిగా తిరిగినా…అసలు తిరక్కపోయినా…మనకెందుకు దిగులు?

“భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు…”
అని మన వేమన ఎందుకని ఉంటాడో మనకెందుకు చర్చ?

“భూమ్మీద పుట్టామా!
భూమ్మీద పెరిగామా!
భూమ్మీద అనుభవించామా!
భూమ్మీద చచ్చామా!”
-అన్నవి తప్ప భూతాపాలతో భూభ్రమణ వేగం తగ్గి జరగబోయే పెను విపత్తుల గురించి మనకెందుకు చింత?  – పమిడికాల్వ మధుసూదన్     9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హఠాత్తుగా ఎందుకో గానీ హైదరాబాద్ మెట్రో నష్టాల పాట..!!
  • నిజ జీవిత తలపై రాజశేఖర్ ‘తలంబ్రాలు’… షీరోయిక్ పాత్ర…
  • సీతాఫలం తినడం ఓ కళ..! చెంచాతో తింటే దాన్ని అవమానించినట్టే..!!
  • కేటీఆర్ మగ రాజకీయ భాష… ఆడతనమంటే చేతగానితనమట…
  • BB9Telugu..! ఫాఫం కింగ్ నాగార్జునకే అగ్నిపరీక్ష… నో బజ్, నో వ్యూయర్స్…
  • ఫాఫం మిరయ్… ఆ నిర్మాతలు ఎవరో గానీ… థియేటర్ వెళ్లే పనిలేదు..!!
  • టార్గెట్ సాక్షి ఎడిటర్..! జగన్ సన్నిహితగణంపై పాలకుల ప్రత్యేక దృష్టి..!!
  • నేపాల్ అల్లర్ల విశ్లేషణలోనూ… అదే యాంటీ- జగన్, అదే ఆవు వ్యాసం…
  • పార్టీ పాలసీల్లో గందరగోళం, అస్పష్టత… అమరావతిపై యూటర్న్ అదే…
  • ‘కూలీ’ ఇచ్చి మరీ… కొరడాలతో కొట్టించుకోవడమంటే ఇదే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions