.
పీపుల్స్ వార్ ఆర్.కె.తో ఆఫ్ ది రికార్డ్ సంభాషణ
నక్సలైట్ దళాలకు దళాలు, అగ్రనేతలు లొంగిపోతున్నవేళ ఇది. వచ్చే మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నామరూపాల్లేకుండా చేస్తామని, కూకటివేళ్ళతోపాటు ఏరిపారేస్తామని హోమ్ మంత్రి అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో దాదాపు ఇరవై ఏళ్ళకిందట అప్పటి పీపుల్స్ వార్ కార్యదర్శి రామకృష్ణ (అక్కిరాజు హరగోపాల్)తో జర్నలిస్టుగా అడవిలో ఒకరోజు గడిపిన సంగతులు గుర్తుకొస్తున్నాయి.
Ads
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపాలని అప్పటికి ఇంకా అనుకోలేదు. నేనొక న్యూస్ ఛానెల్ చీఫ్ గా పనిచేస్తున్నాను. ఇంకో న్యూస్ ఛానెల్ ప్రతినిధి నాకు ఫోన్ చేసి పీపుల్స్ వార్ కార్యదర్శి మీడియాతో మాట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళే కొన్ని పేర్లు సూచించి…పిలిచారు. ఫలానా వారం రెడీగా ఉండు- అని చెప్పాడు. నలుగురు జర్నలిస్టులు, నలుగురు కెమెరా మ్యాన్లు బయలుదేరాము.(తేదీలు, మనుషులు, ప్రాంతాల పేర్లు ఉద్దేశపూర్వకంగానే ఇవ్వడం లేదు)
హైదరాబాద్ నుండి రాయలసీమలో ఒక పట్టణానికి వెళ్ళాము. మధ్యాహ్నం భోజనాలయ్యాక ఒక ఆసుపత్రి గేటు ముందు ఫలానా తెలుగు మ్యాగజైన్ పట్టుకుని నిలుచుని ఉండండి అని చెప్పారట. ఒక జర్నలిస్ట్ మిత్రుడు అలా నిలుచున్నాడు. రెండు గంటల నిరీక్షణ తరువాత ఒక బక్క పలచటి వ్యక్తి వచ్చి…ఫలానా మ్యాగజైన్ తో వచ్చింది మీరేనా? అని అడిగి మా అందరినీ ఒక వాహనంలో ఎక్కించుకుని సాయంత్రానికి ఒక చీకటి పల్లెలో దింపి…మరొకరికి (అతని చేతిలో ఏ కే ఫార్టీ సెవెన్ ఉంది. నక్సలైట్ యూనిఫార్మ్ లో ఉన్నాడు) అప్పగించి వెళ్ళిపోయాడు.
ఆ చీకట్లోనే ఒక గంట నడిపించి…ఒక గుడిసె దగ్గర కొద్దిగా సాంబారన్నం పెట్టించాడు. ఇంకో రెండు గంటలు నడిచాక రాత్రికి రెస్ట్ తీసుకుందాం. కాకపోతే ఇప్పుడు చీకట్లో కొండెక్కాలి. జాగ్రత్త అన్నాడు. అతడి చేతిలో టార్చ్ లైట్ ఉంది. భుజానికున్న బ్యాగులో రేడియో, బిస్కట్లు, వాటర్ బాటిళ్లు, టార్పలిన్ బట్ట, కొన్ని మందులు ఇంకా ఏవో ఉన్నాయి. మరో సాయుధ నక్సలైట్ వెంట రాగా అర్ధరాత్రికి కొండపైన ఒక చదునైన ప్రాంతానికి చేరాము. టార్పాలిన్ బట్టను పరిచి మీరు పడుకోండి- మేమిద్దరూ మీకు కాపలా ఉంటాము- అన్నాడు. కాలకృత్యాలకైనా మా తోడులేనిదే వెళ్ళద్దు. ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. టార్చ్ లైట్ ఎక్కువ వాడద్దు-అని హెచ్చరికలు చెప్పాడు.
ఇన్ని భయాలను ఏకరువు పెట్టాక నిద్ర ఎలా వస్తుంది? అంటూ నా పక్కన పడుకున్న జర్నలిస్ట్ మిత్రుడు అలా కంటిమీద కునుకులేకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. తెల్లవారకముందే సర్దుకుని మళ్ళీ నడక. ఎక్కడున్నామో తెలియదు. ఎటు వెళుతున్నామో తెలియదు. అలా ఉదయం నాలుగునుండి తొమ్మిది గంటలవరకు నడుస్తూనే ఉన్నాం. కొంతదూరమయ్యాక దారి కూడా లేదు. దట్టమైన అడవి. ఒక పాడుబడ్డ బావి దగ్గర ఆగాము. ఇక దిగుల్లేదు- కాలకృత్యాలు తీర్చుకుని రెడీ అవ్వండి. మరో గంటలో అన్న వస్తాడు- అన్నాడు. మూడు రాళ్లమీద ఒక గిన్నె పెట్టి ఉప్మా చేసి పెట్టారు.
పక్కనే కాలువలో గిన్నె కడిగి అందులోనే టీ చేసి పెట్టారు. అతడు చెప్పినట్లు సరిగ్గా గంట తరువాత రామకృష్ణ, మరో ఇద్దరు అగ్రనేతలు యూనిఫార్మ్ లో సాయుధులై వచ్చారు. పరస్పరం పరిచయాలు, పలకరింపులు అయ్యాక సాయంత్రంలోపు ఎవరెవరికి ఎంత సమయం కేటాయిస్తే సరిపోతుందో ప్రణాళిక వేసుకున్నాం. ఈలోపు హోరుగాలి. పెద్ద వర్షం. యూరియా గోనెసంచులతో అల్లిన బట్టను కొమ్మలమధ్య కట్టారు. వర్షం ఆగేలా లేదని అలాగే ఇంటర్వ్యూలు విడివిడిగా పూర్తి చేశాము. అయితే ఇంటర్వ్యూ కంటే…కెమెరాలు ఆపి బ్యాగుల్లో సర్దేశాక పిచ్చాపాటీ మాట్లాడినవే అసలైన విషయాలు. అందులో కొన్ని వ్యక్తిగతం. జర్నలిజం విలువలమేరకు ప్రస్తావించడానికి వీల్లేదు.
ప్రశ్న:-
నిన్న, ఈరోజు అయిదారు గంటలు అడవిలో నడిస్తేనే మాకిలా ఉంది. ముప్పయ్, నలభై ఏళ్ళు అడవిలో ఇలా ఎలా ఉంటున్నారు?
ఆర్.కె:-
ఒక లక్ష్యంతో పనిచేసేప్పుడు అడవి- ఊరు; పగలు-రాత్రి; ఎండావానా ఏమీ ఎక్కవు. అంతిమ లక్ష్యం మీదే దృష్టి ఉంటుంది. అడవి జీవితం ఎప్పుడో అలవాటైపోయింది.
ప్రశ్న:-
మీరు కోరుకునే సమసమాజం మీరు బతికి ఉండగా చూడగలరా?
ఆర్.కె:-
మార్పు కోసం ఇదొక ఉద్యమం. నేను చూడచ్చు. చూడకపోవచ్చు. కానీ అంతిమంగా ఉద్యమం గెలుస్తుంది. ఉద్యమంవల్ల ఎన్నో తాత్కాలిక ప్రయోజనాలు కూడా కలిగాయి(ఉదాహరణలు చాలా చెప్పారు). అంతిమ లక్ష్యం ప్రజలు గెలవాలి.
ప్రశ్న:-
దేశంలో 1990 ఆర్థిక సరళీకరణల తరువాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. చదువులు, పోటీ పరీక్షలు, విదేశాల్లో ఉద్యోగాలు, అక్కడే స్థిరపడడం ఇలా యువకుల దృక్పథం కూడా మారిపోయింది. యూనివర్సిటీలనుండి విద్యార్థులు ఇదివరకు ఎక్కువగా నక్సలిజంవైపు వచ్చేవారు. ఇప్పుడలా లేదు. నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజకీయాల్లో ఉన్నారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. సెటిల్మెంట్ల బిజినెస్ లో ఉన్నారు.
ఆర్.కె:-
విదేశీ వ్యాపారసంస్థలు దేశాన్ని దోచుకోవడం కంటే స్వదేశీ సంస్థలు దోచుకుంటే పర్లేదనే వాదన బలపడుతోంది. దోపిడీ ఏదైనా దోపిడీనే. బాగా చదువుకున్న యువకులు కెరీర్ వైపు దృష్టి పెట్టారు. నిజమే. పీపుల్స్ వార్ లోకి ఇదివరకు వచ్చినట్లు రావడం లేదు. అంతమాత్రాన సమస్యలు లేవనీ కాదు- నక్సలిజంలోకి వచ్చేవారి సంఖ్య తగ్గినట్లూ కాదు.
ప్రశ్న:-
ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలైనా ఉండి ఉండవచ్చు…కానీ ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మించిన ప్రత్యామ్నాయం ఉంటుందా? “తుపాకీ గొట్టంద్వారా రాజ్యాధికారం” ఎలా సాధ్యం?
ఆర్.కె:-
ఇది పూర్తిగా సైద్ధాంతిక చర్చ. మీరు మరీ “ప్రజాస్వామ్య పరవశం”లో ఉన్నారు. ఇంకెప్పుడైనా కార్యకారణ సంబంధాలతో డిటైల్డ్ గా మాట్లాడుకుందాం.
కొస తూట, పాట:-
బొమ్మ తుపాకులతో చిన్నప్పుడు ఆడుకున్నానో లేదో తెలియదు కానీ…నిజం తుపాకులు ఎలా కాల్చాలో ఈసందర్భంగా అక్కడి సాయుధ నక్సల్స్ కాసేపు నేర్పించారు.
సాయంత్రం వీడ్కోలుకు ముందు సక్సల్స్ మా ఎదురుగా వరుసగా నిలుచుని విప్లవ గీతాలు పాడారు. ఆర్ కె కూడా వంతపాడారు. మెదక్ దళంలో మహిళ(ఎన్ కౌంటర్లో చనిపోయింది) రాసి పాడిన కన్నీటి గీతం ఆర్ద్రంగా పాడారు. మీలో ఎవరైనా పాడతారా? అని ఆర్ కె అడిగితే- నేను దాశరథి “ఆ చల్లని సముద్రగర్భం” గీతం పాడాను. “అణగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో? ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో?” అన్న దగ్గర ఆర్. కె. కూడా గొంతు కలిపారు. ఒక్కొక్కరిని కౌగలించుకుని… పిడికిలి బిగించి లాల్ సలామ్ అని వీడ్కోలు చెప్పారు.
మళ్ళీ సాయుధులు వెంటరాగా రాత్రంతా నడిపించి ఒక చోట వదిలారు. యాభై అడుగుల దూరంలో తారు రోడ్డు ఉంటుంది. ఆర్ టీ సి బస్సులొస్తాయి. ఎక్కి వెళ్ళచ్చు- అంటూ చెట్లపొదల్లో మాయమైపోయారు. వారన్నట్లుగానే బస్సులో ఒక పట్టణానికి వెళ్లి… అటునుండి హైదరాబాద్ వచ్చాము.
ఎన్నో ఏళ్ళుగా బాగా పరిచయమున్న వ్యక్తి మాట్లాడినట్లు చాలా ఓపెన్ గా ఆర్.కె. మాట్లాడడం నాకు నచ్చింది. ఆఫ్ ది రికార్డ్ సంభాషణలో నేనేదైనా అడగచ్చా? అంటే “అది మీ రైట్. అందుకేగా పిలిచింది” అనడం ఇంకా బాగా నచ్చింది.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article