.
అమెరికాలో మాంచి ఐటీ కొలువు చేస్తుంటాడు మన హైదరాబాదీ ఒకాయన… పఠనాసౌలభ్యం కోసం తన పేరు యాదగిరి అనుకుందాం…
ఓరోజు పరుగుపరుగున ఓ డెంటిస్టు దగ్గరకు వెళ్లాడు… సమయానికి వేరే రోగులెవరూ లేరు, అందుకని ముందస్తు అపాయింట్‌మెంట్ లేకపోయినా టైం ఇచ్చాడు సదరు డెంటిస్టు…
Ads
ఎందుకైనా మంచిదని యాదగిరి ముందే అడిగాడు, పన్ను నొప్పితో మాట్లాడలేకపోతున్నాను అంటూ కాగితంపై రాసి చూపించాడు… ఎంత తీసుకుంటారు డాక్టర్ గారూ అని…! నిజమైన హైదరాబాదీ ఎవరైనా అంతే కదా… ముందస్తు బేరాన్ని మించిన సుఖం లేదు కదరా సుమతీ టైపు…
1200 డాలర్లు తీసుకుంటాను అన్నాడు డాక్టర్…
అబ్బే, మరీ ఎక్కువ అని రాశాడు యాదగిరి…
అనస్తీషియా ఇచ్చి, జాగ్రత్తగా పన్ను పీకేయాలి, సో, రేటు ఎక్కువే, ఖర్చవుతుంది మరి అని చెప్పాడు డాక్టరు…
ఇంకేమైనా చౌకగా పని పూర్తయ్యే మార్గం లేదా డాక్టర్ అనడిగాడు యాదగిరి మళ్లీ కాగితం మీదే… సుల్తాన్‌బజార్ బేరం తరహాలో…
డాక్టర్‌కు ఈ బేరం చిర్రెత్తింది.., అనస్తీషియా ఇవ్వకుండా పీకేస్తా, నొప్పి భరించగలిగితే వెంటనే వచ్చి ఈ కుర్చీలో కూర్చో, 300 డాలర్లు ఇవ్వు చాలు అన్నాడు కోపంగా…
వోకే, దానిదేముంది, హైదరాబాద్ రోడ్ల మీద టూవీలర్ నడిపిన వాడిని, ఈ నొప్పులు గిప్పులు జాన్తానై అని కాగితం మీద రాసి డాక్టర్‌కు చూపించి, యాదగిరి వెంటనే (Dental Engine) అనబడే చికిత్స కుర్చీలో కూర్చున్నాడు,..
డాక్టర్ పన్ను పీకేశాడు, అంతసేపూ యాదగిరి అలాగే నిర్వికారంగా కూర్చున్నాడు తప్ప కిమ్మనలేదు… నొప్పి కలుగుతున్న ఫీలింగ్ కూడా లేదు మొహంలో… పైగా ఒకటీరెండుసార్లు మరీ ట్రంపు తరహాలో చిరునవ్వినట్టు కూడా అనిపించింది…
డాక్టర్ మహాశ్చర్యపోయాడు…
మిస్టర్ యాదగిరీ, నొప్పిని నియంత్రించుకోవడంలో, భరించడంలో మీ నేర్పు, ఓర్పు సూపర్బ్… ఎంతో సాధన మీద గానీ సాధ్యపడదు… మీరు 300 డాలర్లు ఇవ్వనక్కర్లేదు, మిమ్మల్ని అభినందిస్తూ నేనే మీకు 500 డాలర్లు ఇస్తున్నాను అన్నాడు ఆ డెంటిస్ట్… ఇచ్చాడు, యాదగిరి డాక్టర్ వంక అదోలా చూస్తూ వెళ్లిపోయాడు…
సాయంత్రం ఎప్పటిలాగే ఓ క్లబ్బులో తోటి డెంటిస్టులతో మాట్లాడుతూ… ‘‘అలాంటి అసాధారణ వ్యక్తుల్ని నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ యాదగిరి నొప్పిరహిత పన్నుపీకుడు ఎపిసోడ్ మొత్తం చెప్పాడు ఆయన…
వెంటనే మరో డెంటిస్టు అదిరిపడి ఇలా చెప్పాడు… ‘‘వార్నీ, వాడు అసాధ్యుడురా బాబూ… ముందు నా దగ్గరకు వచ్చాడు… అడిగిన రేటు ఇచ్చేస్తానన్నాడు… అనస్తీషియా ఇచ్చి, బయట కాసేపు కూర్చోమన్నాను… ఆ తరువాత పిలిస్తే రాలేదు, బయటికొచ్చి చూస్తే లేడు… నీ దగ్గరకు వచ్చాడా..?’’
.
.
Share this Article