Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో మాస్ మహారాజ్… సినిమా మాస్ జాతర… పాటకు బూతాభిషేకం…

August 8, 2025 by M S R

.

“ఓలే ఓలే గుంట
నీ అయ్యకాడ ఉంటా
నీ అమ్మకాడ తింటా
నీ వొళ్ళోకొచ్చి పంటా

బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదు
మంచి లేదు మర్యాద లేదు
అంగీ లేదు లుంగీ లేదు పంచె లేదు
తాడు లేదు బొంగరం లేదు
నీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని…

Ads

.

పట్టుకుని కాళ్లు మొక్కి పోతా…” అన్న ఒకానొక పాటలో బూతు వినపడలేదా? కనపడలేదా? దానిమీద సిగ్గూ శరం లేదా అని నాలుగు మాటలు రాయకపోతే ఎలా? ఆమాత్రం బాధ్యత లేదా? అని బాధ్యతగల ప్రేక్షకులు, పాఠకులు అడుగుతున్నారు.

ప్రేక్షకుల ఆవేదనలో అర్థముంది;
కానీ ఆ పాటలో అర్థం లేదు.
ప్రేక్షకుల మనసు గాయపడింది;
కానీ ఆ సినిమా “మాస్ జాతర” మనసు బండబారింది.

ప్రేక్షకులు దాన్ని బూతు అన్నారు;
కానీ ఆ జాతరవారు న బూతో న భవిష్యతి అన్నారు.
శ్రోతలు వినలేక చెవులు మూసుకున్నారు; చదవలేక కళ్ళు మూసుకున్నారు;
కానీ ఆ సినిమావారు చెవుల్లో జోరీగలై వినిపిస్తూనే ఉన్నారు.

కలి పురుషుడు ప్రవేశించిన వేళ ఏయే అనర్థాలు కనపడతాయో, వినపడతాయో, జరుగుతాయో ముందే స్పష్టంగా చెప్పి పెట్టారు. అందులో ఇదొకటి అనుకోవాలి!

ఆధునిక సినీ సాహిత్య ప్రమాణాలతో చూస్తే ఇందులో “గుంట- ఉంట-తింట- పంట” అంత్యప్రాసలు అద్భుతంగా కుదిరాయి. శ్రీకాకుళంలో కూడా ఈమధ్య “పడుకుంటాను” అనడానికి “పంట” అని అంటున్నారేమో మనకెలా తెలుస్తుంది?

ఈ గేయరచయిత రెండు మాండలికాలను ఒకే పాటలో నాటి పండించిన కవికర్ణరసాయనం “పంట” పంటికింద రాయిలా తగిలి నొప్పిగా ఉన్నవారు దగ్గర్లోని పంటి డాక్టరును సంప్రదించాలి కానీ…రచయితను తప్పుపడతారా? పళ్లూడగొట్టుకోవడానికి ఏదో ఒక రాయిని తయారు చేయడానికే కదా ఈ రాతలు అని విశాల దృక్పథంతో అర్థం చేసుకోలేరా?

raviteja

నీయమ్మ! నీయక్క! నీ అయ్య! అన్నవి విభక్తి ప్రత్యయాల ప్రకారం సంబోధన ప్రథమా విభక్తిగా రచయిత అత్యంత వ్యాకరణ గౌరవంతో స్వీకరించిన సమున్నత పదబంధాలుగానే చూడాలి తప్ప…అందులో బూతును చూస్తే మన కళ్ళు పత్తి కాయల్లా పేలిపోతాయి!

నీ-అమ్మ అన్న చోట యడాగమం వచ్చి “నీయమ్మ” అవుతుందని యడాగమ సంధిగా బాలవ్యాకరణం చిన్నయసూరి చెప్పిన సూత్రం స్కూల్లో బట్టి పట్టలేదా? ఓహో మీరు ఇంగ్లిష్ మీడియమా? రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లిష్ గ్రామర్లో తెలుగు యడాగమం ఎందుకుంటుంది చెప్పండి? దానికి గీత రచయిత ఎలా బాధ్యుడవుతాడు-

పాపం? పదహారణాల సిక్కోలు తెలుగులో ఇచ్చాపురం రొయ్యలను దట్టించిన పాటను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక బూతు లెవెల్ తెలుగు నాటు బడుల్లో చదివి ఉండాలి.

భావంలో బుద్ధి, జ్ఞానం లేదని;
భాషలో మంచీ మర్యాద లేదని;
ఒంటి మీద లుంగీ, అంగీ లేదని;
కనీసం కింద పంచె కూడా లేదని;
తాడూ బొంగరం కూడా లేదని చెప్పడమే పాట ఉద్దేశమైనప్పుడు అవి ఉండాలని కోరుకోవడం చట్టరీత్యా నేరమవుతుంది!

“శ్రీకాకుళం చిలకా! గిలకా! పలకా! మొలకా!” అబ్బబ్బా! ప్రాసలకే పరవశం కలిగి…నిలువెల్లా గిలిగింతలతో పులకించిపోయే అంత్యాక్షరి విన్యాసం! అంత్య ప్రాసలతో నిజంగా ఒక జిల్లా బాషోన్నతిని, ఆత్మగౌరవాన్ని గోతిలో పాతిపెట్టారు సార్! మీ దెబ్బకు ఇక మేము ఉలకా! పలకా!

హీరో- హీరోయిన్ ప్రేమ పారవశ్యంలో ఒకరి ముక్కును ఒకరు కర్కశంగా రక్కుకునే సందర్భానికి పాటలో రక్కుళ్ళు ఎక్కువై రక్తం కారిందే తప్ప వాటిని గాయాలుగా చూడకూడదు. ఒకవేళ చూసినా శ్రీకాకుళం వంశధార, నాగావళి పరీవాహకప్రాంతాల్లో గాయాలే గేయాలై పాడుకుంటాయి తప్ప… పరస్పరం ముక్కులు రక్కుకున్న గాయాలకు కట్లు అవసరం లేదు! ఈఎన్టీ డాక్టర్ అవసరమే లేదు!

పాట ఎత్తుగడ సాకీలో చెప్పినట్లు శ్రీకాకుళం జిల్లా అంతా వెతికి… తిరిగి… పట్టుకుని… అక్షరమక్షరం కలమనే ఉలితో చెక్కిన లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేక సాహిత్య శిల్పమిది! దాని లోతులు అర్థం చేసుకోవడానికి ప్రత్యేక శరీర శిల్పశాస్త్ర అనాటమీ చదువులేవో మనకు ఉండి ఉండాలి!

అయ్యా! గీత రచయితగారూ!
మీ బుద్ధీ జ్ఞానం లేని పాటకు కాళ్ళెక్కడున్నాయో చెబితే యావత్ తెలుగు ప్రేక్షకులు, శ్రోతలు, పాఠకులు ఒకసారి పట్టుకుని మొక్కి పోతారు!

ఏయ్!
ఎవర్రా అక్కడ?
రేప్పొద్దున ఈపాటకు ఏ జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష అవార్డో వస్తే సన్మానం చేయడానికి కాశ్మీరీ శాలువలు సిద్ధం చేసుకున్నారా? లేదా?

ఏమిటి?
శాలువలో పెట్టి కొడతారా?
“బుద్ధీ జ్ఞానం ఉందా” మీకసలు?
పాట మరోసారి వినండి. అప్పుడు మీ బుద్ధి వికసించి… జ్ఞానంగా రూపాంతరం చెంది… గంట గంటకు గుంటలో నుండి లేచి… తింటా ఉంటది! పంటానంటది !!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018



మనం ఏం పాడుకుంటే, పిల్లలు అవే నేర్చుకుంటారు... బూతులు అందుకుంటారు... పైడీ, మంచి కార్టూన్ మిత్రమా

cartoon

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఐటీసీ స్కామ్..! షెల్ కంపెనీలతో దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్…
  • పెద్ద హీరోలకు వందల కోట్లు… కార్మికుల కడుపు నింపడానికి ఏడుపులు..?!
  • ఆ ఇద్దరూ అందాలను ఆరబోసిన మసాలా వంట.. సినిమా సూపర్ హిట్…
  • కేసీయార్ ‘స్వచ్చంద జైలు’… రేవంత్‌రెడ్డి సెటైరిక్ ‘పంచుల’ భాష…
  • *పోలీసుల ముక్కూచెవులు కోస్తూ… అమ్మవారికి రక్తార్పణం…*
  • హీరో మాస్ మహారాజ్… సినిమా మాస్ జాతర… పాటకు బూతాభిషేకం…
  • ‘‘మాకు అప్పగించండి… ఫోన్ ట్యాపింగ్ అరాచకం కథేమిటో తేల్చేస్తాం..’’
  • రేయ్ ఎవుర్రా మీరంతా… ఈ పాదపూజలు, నాగభజనలూ ఏమిటర్రా…
  • అదనపు అమ్మ స్తన్యం… ఎందరెందరో బిడ్డలపై ‘అమ్మతనం’…
  • చందమామపై ఓ విల్లా… ఎట్‌లీస్ట్ ఓ డబుల్ బెడ్‌రూం ఫ్లాట్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions