.
కర్ణాటక, కొడగు జిల్లా, కుశాల్‌నగర్ తాలూకాలో ఓ మారుమూల గిరిజన పల్లె. అక్కడ కురుబర సురేష్ (40) అతని భార్య మల్లిగె (38)లది ఒక చిన్న కుటుంబం. దినసరి కూలీగా పనిచేస్తూ, ఇద్దరు టీనేజ్ పిల్లలను పోషించుకుంటున్న సురేష్ జీవితం, 2020 డిసెంబర్‌లో ఒక్కసారిగా తలకిందులైంది.
ఒక రోజు మల్లిగె ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైంది. ఆందోళన చెందిన సురేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ, కొన్ని నెలల తర్వాత కథనం పూర్తిగా మారిపోయింది. కొంత దూరంలో ఒక గుర్తుతెలియని అస్థిపంజరం దొరికింది. దాంతో మిస్సింగ్ కేసు కాస్తా హత్య కేసుగా మారింది.
Ads
పోలీసులు హడావుడి పడ్డారు. “ఇది నీ భార్య మల్లిగెదే” అంటూ ఆ అస్థిపంజరాన్ని, దానిపై ఉన్న పాత బట్టలను చూపించి సురేష్‌ను భయపెట్టారు. భర్తనే దోషిగా చూస్తూ, దర్యాప్తు పేరుతో లాకప్‌లో అమానుషంగా నేరాంగీకారానికి హింసించారు. “నువ్వు ఒప్పుకోకపోతే నీ పిల్లలను లోపల వేస్తాం” అని బెదిరించారు. భరించలేక, అమాయకుడైన సురేష్ కన్నీళ్లతో తల వంచాడు.
“అవును… నేనే నా భార్యను చంపాను,” అని బలవంతంగా ఒప్పుకున్నాడు.
ఆ వెంటనే, పోలీసులు సరైన డీఎన్‌ఏ పరీక్ష ఫలితం కోసం కూడా ఆగకుండా, ఆ అస్థిపంజరం ఆధారంగా సురేష్‌పై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపారు. బయట ప్రపంచానికి, సురేష్ భార్యను చంపిన హంతకుడిగా ముద్ర పడ్డాడు.
రెండు సంవత్సరాల చీకటి
సురేష్ జైలు గోడల మధ్య పడి ఉన్నాడు. “నేను నిర్దోషిని, నేరం చేయలేదు,” అని అతను పదే పదే మొరపెట్టుకున్నా ఎవరూ వినలేదు. అతని ఇద్దరు పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడింది. చదువుకోవాల్సిన కొడుకు కృష్ణ కుటుంబం కోసం పనికి పోవాల్సి వచ్చింది.
న్యాయవాది పాండు పూజారి మాత్రం పోరాటం ఆపలేదు. కోర్టు ఆదేశాలతో, ఆ అస్థిపంజరానికి సంబంధించిన డీఎన్‌ఏ పరీక్ష నివేదిక ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఆ నివేదిక చెప్పిన సత్యం షాకింగ్‌గా ఉంది: ఆ అస్థిపంజరం మల్లిగెది కాదు!
ఈ సాక్ష్యం ఆధారంగా, సురేష్‌కి సెప్టెంబర్ 2024లో బెయిల్ దొరికింది. దాదాపు 18 నెలల తర్వాత, అతను హంతకుడిగా కాకుండా, కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా బయటకు వచ్చాడు.
క్లైమాక్స్: హోటల్‌లో సజీవంగా…
బయటకు వచ్చినా సురేష్ శాంతించలేదు. జైలు నుండి బయటపడిన సంతోషం కంటే, ఈ అన్యాయానికి కారణమైన తన భార్య ఎక్కడుందో తెలుసుకోవాలన్న కసి ఎక్కువైంది. తన స్నేహితులతో కలిసి రహస్యంగా గాలించడం మొదలుపెట్టాడు.
ఏప్రిల్ 1, 2025… మడికేరిలోని ఒక చిన్న హోటల్‌లో సురేష్ స్నేహితులు నమ్మలేని దృశ్యాన్ని చూశారు. అక్కడ మల్లిగె, తన పక్కన వేరే వ్యక్తితో కలిసి టీ తాగుతోంది!
వెంటనే పోలీసులకు సమాచారం అందింది. అనివార్యంగా మల్లిగెను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు హాలు నిశ్శబ్దంగా ఉంది. అప్పటివరకు హతమార్చబడిందని భావించిన మహిళ, సజీవంగా నిలబడింది.
న్యాయమూర్తి ఎదుట నిలబడి మల్లిగె చెప్పిన విషయం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది: “నేను అదృశ్యం కాలేదు, ఈయన (వేరే వ్యక్తి)తో కలిసి లేచిపోయాను. నన్ను చంపాడని నా భర్త జైలుకు వెళ్లాడని నాకు తెలియదు…”
సురేష్ ముఖంలో నిర్దోషిగా నిరూపితమైనందుకు వచ్చిన రిలీఫ్, తన భార్య ద్రోహం చేసిందన్న బాధ, పోలీసుల వేధింపులపై కోపం… అన్నీ కలిపి కనిపించాయి. సురేష్ అధికారికంగా ఆ కేసు నుంచి విముక్తుడు అయ్యాడు.
తుది పోరాటం
కోర్టు సురేష్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, జరిగిన అన్యాయం చిన్నది కాదు. ‘హంతకుడు’గా ముద్రపడి, 18 నెలలు నరకం అనుభవించిన సురేష్, తన న్యాయవాది ద్వారా కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
న్యాయస్థానం సురేష్‌కు లక్ష పరిహారం ఇవ్వాలని కర్ణాటక హోమ్ శాఖను ఆదేశించింది… కానీ “నన్ను ‘నిందితుడి’గా కాక, ‘బాధితుడిగా’ ప్రకటించండి. తప్పుడు కేసు పెట్టి హింసించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోండి. నా జీవితంలో కోల్పోయిన సమయానికి, పడిన వేదనకు రూ. 5 కోట్ల పరిహారం చెల్లించండి…” అని సురేష్ కోర్టులో కోరుతున్నాడు.
నిజ జీవితంలో ఊహించలేని ఈ ‘డ్రామా ఆఫ్ ఇన్జస్టిస్’, న్యాయ వ్యవస్థలోని లోపాలను, పోలీసుల నిర్లక్ష్యాన్ని బలంగా ప్రశ్నిస్తూ, ఒక సామాన్య మనిషి పడిన వేదనకు, అసాధారణ పోరాటానికి నిదర్శనంగా మిగిలింది…
Share this Article