Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జీమూత భల్లుడు… తెలుగు సినీ మహానగరంలో ఓ మాయగాడు…

July 7, 2025 by M S R

.

Director Devi Prasad.C…  నేను దర్శకత్వం వహించిన “బ్లేడ్‌బాబ్జీ” సినిమా హిట్ అవ్వగానే రెగ్యులర్‌గా సినిమాలు తీసే కొందరు నిర్మాతలు నన్ను సినిమా చెయ్యమని అడిగినా, ఎవరూ అడ్వాన్స్ ఇవ్వని తరుణంలో ఓ కొత్త నిర్మాత ఫోన్‌లో మిమ్మల్ని కలవాలి సర్ అంటే రండి సర్ అన్నాను.

కాలింగ్‌ బెల్ మోగగానే నేనే డోర్ ఓపెన్‌ చేశాను. ఎదురుగ్గా నుదుటన ఎర్రటి కుంకుమ బొట్టుతో, తెల్లటి దుస్తుల్లో, మెడలో లావుపాటి గోల్డ్ చైన్‌తో, చేతులకు బరువైన ఉంగరాలతో, ఓ చేతికి భారీ బ్రేస్‌లెట్‌తో, మరో చేతికి చిన్నసైజు గోడ గడియారంలాంటి వాచ్‌తో ఓ భారీ విగ్రహం నవ్వుతూ ఉండటంతో లోపలికి ఆహ్వానించాను.

Ads

ఫోన్‌లో ఆయన ఇంటి పేరే చెప్పారు గానీ ఒంటి పేరు చెప్పలేదు. ఆ ఇంటి పేరు కూడా భారీగానే ఉంది. ఆయన్నందరూ అలాగే పిలుస్తారట. పేరేమైనా గానీ నాకా విగ్రహాన్ని చూడగానే ఎందుకో విఠలాచార్య గారి ఓ సినిమాలోని “జీమూత భల్లుడు” అనే పేరు గుర్తొచ్చింది.

తప్పేగానీ దీని సిగతరగ మనసు మహా కోతి కదండీ. కాఫీలయ్యాక ఏవో నాకర్ధంకాని తన విజయవంతమైన వ్యాపారాల గురించి చెప్పి మీ సినిమాలు చూశాక మీతోనే సినిమా ప్రొడక్షన్ మొదలుపెట్టి ఓ 50 సినిమాలు తియ్యాలనుకుంటున్నట్లు చెప్పి, మీరెవరితో చేసినా, ఎలాంటి కధతో చేసినా నాకు ఓకే అని రెమ్యూనరేషన్ ఎంతో చెప్పమన్నారు “భల్లుడు” గారు.

అప్పటికాయన నాకు ముక్కూమొహం తెలియని మనిషి గనుక నాకే ఎక్కువ అనిపించేంత ఓ ఫిగర్ చెప్పాను ఎలాగూ బేరసారాలు మామూలే కదా అని. ఆయన వెంటనే “డన్” అని అరిచాడు.

“డబ్బు విషయాలలో నేను చాలా కరాఖండీగా ఉంటానండి అక్కడే కదా స్నేహాలు చెడిపోయేది. ఓవారంలో మంచిరోజు చూసి పెద్దమ్మగుడిలో పూజ చేసి ఓ పెద్ద ఎమౌంట్ అడ్వాన్స్ ఇస్తాను, ఎప్పుడైనా మీకివ్వాల్సిన డబ్బే కదా” అన్నారాయన.

ఓ నాలుగు రోజుల తర్వాత కాల్ చేసి ఓ రోజు మా ఆఫీస్ కి భోజనానికి రాగలిగితే మీరు ఆఫీస్ చూసినట్లూ ఉంటుంది సర్ అంటే సరేనన్నాను. ఆయనే స్వయంగా వచ్చి ఓ పెద్ద కారులో సోమాజీగూడలో ఓ పెద్ద అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న వారి ఆఫీస్‌కి తీసుకెళ్ళారు. చాలా ఆడంబరంగా ఉంది.

తన రూంలోకి తీసుకెళ్ళి సినిమా ఐపోయే వరకూ ఇది మీ రూమే సర్ అన్నారు. అప్పటికే అక్కడ తెల్ల దుస్తులలొ మరో ఇద్దరు, చిన్నవయసులోనే నెత్తి మీద జుట్టు ఊడినట్లున్న ఓ పాతికేళ్ళ కుర్రాడు ఉన్నారు.
పరిచయ కార్యక్రమాలు, సినిమా కబుర్లు అయ్యాక భోజనాలు.

భూమ్మీద నడిచేవి, నీళ్ళలో ఈదేవి, గాల్లో ఎగిరేవి కర్రీలయిపోయి డైనింగ్ టేబుల్ పైన ఉన్నాయి. “మా “ఇంటి పేరు” గారు ఎప్పుడూ ఇంతేనండీ, ఆతిధ్యం అదుర్స్” అంటూ భల్లుడు గారిని తెగ పొగిడేశారు తెల్ల దుస్తుల మిత్రులు.

అప్పటికప్పుడు పంచాంగంలో ముహూర్తం చూసి, ఎల్లుండి నేనే వచ్చి తీసుకెళ్ళి, పెద్దమ్మ గుడిలో అడ్వాన్స్ ఇస్తాను సర్ అన్నారు నిర్మాత గారు. ఏమిరా దేవీప్రసాదూ, నీ పంట ఇలా పండింది అనుకుంటుండగా ఆ ఎల్లుండి వచ్చేసింది. కానీ ఆయన రాలేదు. కాల్ వచ్చింది. “సారీ సర్, క్యాష్ సడెన్‌గా బిజినెస్‌కి మళ్ళించాల్సి వచ్చింది. మళ్ళీ ఎల్లుండి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి చెక్కు ఇస్తాను ఆన్నారు. ఆ ఎల్లుండి మళ్ళీ వచ్చింది. ఈసారి ఆయనా రాలేదు ఫోన్‌ కాలూ రాలేదు.

లైట్ తీసుకోవటం అలవాటే కనుక వదిలేశాను. ఆయన వదలకుండా వారం తర్వాత కాల్ చేసి ” బెజవాడలో ఉండే మా గురువు గారొకాయన ఈ నెలంతా నీ టైం బాగోలేదు ఏ పనీ మొదలుపెట్టొద్దు అన్నారు సర్. అప్పటి వరకూ నేను మీకు లైన్లోకి కూడా రాను, ఆ తర్వాతే మాట్లాడతాను” అన్నారు.

ఓ ఏడెనిమిది నెలల తర్వాత నేను సూపర్‌గుడ్ ఫిలింస్ సినిమా చేస్తున్నప్పుడు ఓ రోజు కె.కె.టవర్స్ దగ్గర మిత్రులతో కలిసి కాఫీ తాగుతుండగా, వెళ్తున్న కారాపి ఓ తెల్ల దుస్తుల వ్యక్తి రోడ్ క్రాస్ చేసి నా దగ్గరకొచ్చాడు నవ్వుతూ.

“మేమే ఈ వారంలో మీ దగ్గరకు వద్దామనుకుమంటున్నాం సర్, ఇంతకీ మన సినిమా ఎప్పుడు సర్ అన్నాడు.
“మన సినిమా” ఏంటి అనుకుంటూ మీరూ…? అని నేను నసుగుతుంటే “ఆరోజు ‘ఇంటిపేరు’ గారి ఆఫీస్ లో కలిసి భోజనం చేశాము కద సార్” అంటే అప్పుడు గుర్తొచ్చింది.

మీరు సినిమా స్టార్ట్ చేశాకే మేమిచ్చిన డబ్బులు మాకు తిరిగి ఇస్తానన్నాడు సర్ ఆ “ఇంటిపేరు గాడు అన్నాడు. డబ్బులేంటి….? అన్నాను.

“అదే సార్, మీరు సినిమా చెయ్యటానికి ఒప్పుకున్నారు కదా అప్పుడు. మీకూ ఇంకా ఎవరికో అడ్వాన్స్‌లు ఇవ్వటానికి డబ్బు ఎడ్జెస్ట్ చెయ్యమంటే చేశాము. ఆరోజు అక్కడున్న మా ఫ్రెండ్ కజిన్‌ని సెకెండ్ హీరోగా పెట్టటానికి కూడా మీరొప్పుకున్నారని చెప్పాడు” అన్నాడు. నాకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయి ఎంతిచ్చారు అన్నాను.

“నేను పది లక్షలు, మా ఫ్రెండ్ నాలుగు లక్షలు పైనే” అన్నాడు. నేను జరిగినదంతా చెప్పి, నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మీరెళ్ళి వాడిని పట్టుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి” అన్నాను. ఇంకెక్కడ పట్టుకోవటం సార్, మొదట రెండుమూడుసార్లు మాట్లాడాడు. తర్వాత ఆ ఫోన్ నెంబర్ తీసేశాడు. ఇప్పుడసలు పత్తా లేడు. ఆ ఆఫీస్‌కెళితే వాడెవడో మాకు సంబంధం లేదంటున్నారు” అన్నాడు.

అవునూ, మీరూ మీరూ మంచి ఫ్రెండ్స్ అన్నారు కదా ఆ రోజు అంటే … ” మా ఖర్మ సర్, అంతకుముందు రెండు నెలల ముందే మాకు పేకాట క్లబ్‌లో పరిచయం అయ్యాడు. రెండుసార్లు పార్టీలిచ్చాడు” అన్నాడు. అమ్మ “జీమూత భల్లుడూ”……..! అని అవాక్కవ్వటం నా వంతైంది…. ______ దేవీ ప్రసాద్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ కాలేశ్వర కదనం దేనికి..? కదం, కవాతు దేనికి..? బీఆర్ఎస్ రాంగ్ స్ట్రాటజీ..!!
  • కాపీ వీడియోల వడబోత సరే… కంటెంట్ స్టాండర్డ్స్ మాటేమిటి మరి..?!
  • హీరో మహేశ్ బాబును వదలని సాయి సూర్య ‘రియల్’ తలనొప్పి…
  • మార్ మత్ చోడో …. పండుగ సాయన్న కథలో కీలకమైన ట్విస్టు ఇదే…
  • ఆల్ ఇండియా ర్యాంకర్స్… ఆ సీన్… వివాదం పెరిగి దర్శకుడి క్షమాపణ…
  • కామాఖ్య గుడిలో తెలుగు నాయకుల భగాలాముఖి గుప్త పూజలు..!!
  • జీమూత భల్లుడు… తెలుగు సినీ మహానగరంలో ఓ మాయగాడు…
  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions