.
చంద్రబాబు అనితర సాధ్యుడు… ఏదైనా చేయగలడు, ఏదైనా చెప్పగలడు… జనాన్ని నమ్మించగలడు… ఇప్పుడు అమరావతిలో ఏకంగా 1750 కోట్లతో ఎన్టీయార్ భారీ విగ్రహం పెడతాడట… ఎందుకు..?
ఎన్టీయార్ మీద ఆంధ్రుల అభిమానాన్ని, ఆయన వారసత్వాన్ని పదిలంగా కాపాడుకోవడం కోసం… వెన్నుపోటు పొడిచిన చేతులతో దండలు వేసి, దండాలు పెట్టి.., ఆయన పేరును, బొమ్మను వాడుకోవడం కోసం… కటువుగా అనిపించినా నిజం ఇదే కదా…
Ads
ఒకవేళ మళ్లీ జగన్ గనుక అధికారంలోకి వస్తే… వస్తే… రుషికొండ ప్యాలెస్ దగ్గర వైఎస్ విగ్రహాన్ని ఈ ఎన్టీయార్ విగ్రహంకన్నా రెండు అడుగుల అదనపు ఎత్తుతో ప్రతిష్టిస్తాడు… టీడీపీ జగన్‌కు ఓ కొత్త ఆలోచన ఇచ్చినట్టే…
అసలు చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే..?
నిత్యం ఎన్టీయార్ నామస్మరణ చేసే చంద్రబాబు గానీ, దాదాపు 30 మంది వరకూ ఉన్న ఎన్టీయార్ వారసులు గానీ ఎవరూ పట్టించుకోని మరో అంశం ఇది… ముసలితనంలో ఆయన్ని ఒంటరిగా వదిలేసిన ఆయన కుటుంబం చివరకు చెన్నైలోని ఎన్టీయార్ నివాసాన్ని కూడా అమ్మేసుకుంది… దాన్నొక స్మారకంగా ఉంచుకోవాల్సింది…

అవును, ఎన్టీయార్ పిల్లలందరూ అక్కడే పుట్టారు… హిట్లు, సూపర్ హిట్లు… ఎన్టీయార్ 30 ఏళ్ల ఎదుగుదలకు సాక్షి ఆ ఇల్లు… మరీ శకపురుష్, యుగపురుష్, రాముడు, కృష్ణుడు అనే అర్థరహిత విశేషణాలు, అత్యంతాతిశయోక్తి అలంకారాలు అవసరం లేదు గానీ… ఆంధ్రా నుంచి తిరుపతికి వెళ్లే టూరిస్టులు పనిలోపనిగా చెన్నై వెళ్లి, అక్కడ ఎన్టీయార్ దర్శనం కూడా చేసుకునేవారు… ఇది మాత్రం నిజం…
చెన్నై, టీ నగర్, బజుల్లా రోడ్డులోని ఆ ఇంటిని 1953లో భార్య బసవతారకం పేరిట కొన్నాడు ఎన్టీయార్… వెయ్యి గజాలు… ఎవరో బెంగాలీల నుంచి కొన్న ఆ ఇంటి ఎదురుగానే దాసరి ఉండేవాడు… ఇంతకీ ఎన్టీయార్ ఇంటిని ఎవరు కొన్నారు..?
చదలవాడ శ్రీనివాసరావు… ఎన్టీయార్ వీరాభిమాని… గతంలో ఈయన, తన సోదరుడు తిరుపతిరావుతో కలిసి తిరుపతి, చెన్నై టూరిస్ట్ బస్సులు నడిపించేవాడు… ఆర్థికంగా బాగా ఎదిగిపోయాడు… హఠాత్తుగా చెన్నై వెళ్లినప్పుడు ఆ ఇంటిని చూసి, తనే ఎందుకు కొనకూడదు అనుకున్నాడు… సంప్రదింపులు స్టార్ట్…

ఎలాగూ వారసులకు ఆ ఇల్లు ఏమీ పట్టదు… దిక్కూదివాణం లేని ఇంటిని తన అభిరుచికి అనుగుణంగా డీమోడలింగ్ చేయాలనేది చదలవాడ ఆలోచన… ఆ ఏరియాలో ఉన్న విలువ ఆధారంగా ఓ రేటు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు… ఇంటికి జీపీఏ హోల్దర్లయిన మోహనకృష్ణ, రామకృష్ణ గార్లు రిజిస్టర్ చేసేశారు…
ఎన్టీయార్ కుటుంబానికి ఆ ఇంటితో ఉన్న అనుబంధం తెగిపోయింది… నిజానికి ఆర్థికంగా తన వారసులు ఇంత ఉన్నత స్థితిలో ఉండటానికి కారకుడైన ఆ ఎన్టీయార్ కోసమైనా… వాళ్లే ఆ ఇంటిని ఓ జ్ఞాపకంగా, ఓ స్మారకంగా మార్చి ఉండాల్సింది… అఫ్‌కోర్స్, చంద్రబాబు కూడా..!!
“ఎన్టీఆర్‌కి బర్మా టేక్ అంటే ఎంతో ఇష్టం… అందుకే ఇంటిలో రామారావుకు ఇష్టమైన ఫర్నిచర్‌ని ఇప్పుడు బర్మా టేక్‌తో చేయిస్తున్నాను… రామారావు ఈ ఇంటిలో ఎక్కడ ఏ కుర్చీలో కూర్చునేవారో… ఎక్కడ డైనింగ్ చేసేవారో వాటన్నిటినీ కొత్తగా చేయించి అవే ప్రదేశాలలో ఉంచుతాను… పాత ఉడ్ స్థానంలో కొత్త ఉడ్ వస్తుంది… ఇంట్లో మార్పులేమీ వుండవు… అప్పటి రామారావు ఇల్లులానే వుంటుంది… గేట్ కూడా బర్మా టేక్‌తో చేయిస్తున్నాను… ఆ గేట్ పై ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు రూపాలను చెక్కిస్తాం…’’ అంటున్నాడు శ్రీనివాసరావు…

ప్రస్తుతం ఇంటి నవీకరణ పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి… బర్మా టేక్ సహా కలప అంతా హైదరాబాదు నుంచే శ్రీనివాసరావు టింబర్ ఎస్టేట్ నుంచే వెళుతోంది… మరి… ఇకముందు కూడా ఆ ఇంటిని ప్రజలు సందర్శించడానికి అవకాశం ఉంటుందా అని ఎవరో అడిగితే… ‘‘తప్పకుండా… ఆ ఇంటిని ప్రజలకు అందుబాటులో ఉంచేస్తాం… ఎవరైనా ఇక్కడికి రావచ్చు… ఇంట్లోకి వచ్చి చూడచ్చు… ఎటువంటి అభ్యంతరం కానీ, ఆంక్షలు కానీ ఉండవు…’’ అన్నాడాయన…
కొసమెరుపు :: ఆ ఇంటి హాలులో రామారావు బంగారు విగ్రహం ప్రతిష్ఠించాలన్నది ఆయన ఆలోచన..! జ్ఞాపకాలు పట్టని అనేక రక్తవారసులకన్నా ఒక్క వీరాభిమాని మేలు కదరా సుమతీ..!!
Share this Article