.
- శంకర్‌రావు శెంకేసి (79898 76088) ….. గోదావరి తీరాన ‘నాయుడి గారి మేడ’: నేడో రేపో కాలగర్భంలోకి…
దుమ్ముగూడెం.. గోదావరి తీర ప్రాంతం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉంది. ఒకప్పుడు బ్రిటీష్ వారి ఏలుబడిలో ఉండేది. పచ్చని అడవులకు, విలువైన అటవీసంపదకు ఈ ప్రాంతం ఆలవాలం. దుమ్ముగూడెం అనగానే అందరికీ బ్యారేజీ గుర్తుకురావొచ్చు. కానీ చరిత్ర పుటల్లోకి ఎక్కని ‘నాయుడి గారి మేడ’ అనే మూడంతస్తుల మహల్ అక్కడ కొలువుదీరి కనిపిస్తుంది.
చిక్కని అడవిలో నిర్మాణమైన ఆ భవనం కాల ప్రవాహంలో గొప్ప చరిత్రకు వేదికగా నిలిచింది. నాలుగు తరాల వారధిగా వెలిగి, బ్రిటీష్ అధికారులకు మకాంగా విలసిల్లి దాదాపు 150 ఏళ్ల పాటు ఏజెన్సీకే తలమానికంగా ప్రకాశించింది. ఎంతో ఘన చరిత్ర గలిగిన ఆ మేడ.. ఇప్పుడు ఎవరికీ పట్టని భూత్ బంగ్లాగా మారింది. నేడో రేపో కాలగర్భంలో కలిసిపోయే దశకు చేరింది. ఆ కథేమిటో తెలుసుకోవాలంటే దుమ్ముగూడెం వెళ్లాలి….
Ads
(కోట్ల సన్యాసయ్య నాయుడు)
కోట్ల సన్యాసయ్య నాయుడు స్వస్థలం విజయనగరం. ఆయన తండ్రి కోట్ల పోతన్న కలప, టింబర్ వ్యాపారం చేసేవారు. తండ్రి నుంచి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సన్యాసయ్య నాయుడు నూనుగు మీసాల వయస్సులోనే వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టారు. తల్లిదండ్రులను ఒప్పించి కుటుంబమంతటినీ భద్రాచలం సమీపంలోని గోదావరి తీరప్రాంతానికి తీసుకువచ్చాడు. అక్కడ ఊరును పొందిచ్చాడు.
గ్రామ మనుగడకు అవసరమైన కులవృత్తిదారులను విజయనగరం నుంచి రప్పించాడు. ఇది 1850ల నాటి ముచ్చట. తమ్ముడు కోట్ల లక్ష్మణస్వామితో కలిసి రాజమండ్రి, మద్రాసు, భద్రాచలం ఏజెన్సీలో చేపట్టిన కలప వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. అటు ఊరూ విస్తరిస్తూ వచ్చింది. కలప వ్యాపారిగా అనతికాలంలోనే సన్యాసయ్య నాయుడు ప్రసిద్ధి పొందాడు. వెంకటాపురం నుంచి భద్రాచలం వరకు భూములు కొనుగోలు చేశాడు.
బహుశా 1865లో కావొచ్చు.. దుమ్ముగూడెంలో అర ఎకరం స్థలంలో భారీ భవన నిర్మాణానికి సన్యాసయ్య నాయుడు అంకుర్పాణ చేశారు. బ్రిటీష్ ఇంజనీర్ల నుంచి ఇంటి ప్లాన్ తీసుకొని, జర్మనీ నుంచి నిర్మాణ కార్మికులను రప్పించారు.
బర్మా నుంచి కలపను, జర్మనీ నుంచి రంగు రంగుల అద్దాలను తెప్పించారు. రైలు పట్టాలను పోలిన ఇనుప కడ్డీలను పునాదులకు ఉపయోగించారు. ఇంటి నిర్మాణంలో వాసాలకు నల్ల జిట్రేగిని, దర్వాజలకు బ్లూ బెర్రీ కర్రను, స్తంభాలకు రోజ్ వుడ్‌ను వాడారు. పై అంతస్తుల్లోకి వెళ్లేందుకు చెక్కమెట్లను నిర్మించారు.
(ఒకప్పుడు నాయుడి గారి మేడ ఇలా…)
సింహద్వారాన్ని దాదాపు రెండేళ్లపాటు చెక్కారు. గానుగ సున్నంలో బెల్లం, కోడిగుడ్లను కలిపి గోడలను, స్లాబ్‌ను కట్టారు. ఫ్లోరింగ్‌కు పోర్ట్‌ల్యాండ్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన సిమెంట్ మిశ్రమాన్ని వాడారు. ఈ ఫ్లోరింగ్ గ్రానైట్‌ను మించి స్మూతగా ఉంటుంది. ఐదేళ్ల అవిరామ పనులతో రెండంతస్తులు, పైన పెంట్‌హౌజ్‌లను పోలిన రెండు గదులతో అద్భుతమైన మేడ సిద్ధమైంది.
మొదటి సగ భాగం భవనమైతే, మిగిలిన సగభాగం పెంకులతో మండువా ఇల్లులా నిర్మించారు. హాల్స్ కాకుండా మొత్తం 42 గదులు కొలువుదీరాయి. ధారాళమైన వెలుతురు, గాలి ఈ భవనం సొంతం. అప్పుడు కరెంటు లేకపోవడంతో చెక్కలతో చేసిన ఫ్యాన్లను బంట్రోతులు నిరంతరం తాళ్లతో తిప్పేవారు. రాత్రిళ్లు కిరసనాయిల్ దీపాలను వాడేవారు. కాలక్రమంలో ఈ భవనం నాయుడు గారి మేడగా ప్రసిద్ధి పొందింది.
సన్యాసయ్య నాయుడు వ్యాపారిగా రాణించడంతో ఆయన మేడకు ఎంతోమంది రాకపోకలు సాగించే వారు. నిత్యం 150 మందికి భోజనాలు వడ్డించే వారు. వంటగదిలోని పొయ్యిలు రోజంతా వెలుగుతూనే ఉండేవి. 1865- 70 మధ్య తీవ్రమైన కరువు తలెత్తినప్పుడు దుమ్ముగూడెం ఏజెన్సీలోని ప్రజలకు ఆర్నెల్ల పాటు సన్యాసయ్య నాయుడు ఉచితంగా గంజి అందించి వారి ప్రాణాలను కాపాడారట.
దీంతో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ‘రావు సాహెబ్’ అనే బిరుదునిచ్చి గౌరవించింది. సన్యాసయ్య నాయుడు వెంకటాపురం నుంచి భద్రాచలం వరకు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. ఒక్కడిగా మొదలు పెట్టి ఒక వ్యవస్థను నిర్మించి తన దక్షతను చాటుకున్నారు. బ్రిటిష్ అధికారులు సైతం ముందస్తు అనుమతి తీసుకొని మరీ అయనను కలిసేవారని చెబుతారు.
సన్యాసయ్య నాయుడు భార్య పేరు చంద్రమ్మ. ఆమె పుట్టినిల్లు విజయనగరంలోని నెల్లిమర్ల. వీరికి ఒక కుమార్తె సీతారత్నం. ఆమెను కూడా విజయనగరానికే చెందిన రామారావుకు ఇచ్చి వివాహం చేశారు. సన్యాసయ్య నాయుడుకు పుత్ర సంతానం లేకపోవడంతో సీతారత్నం కుమారుడిని దత్తత తీసుకున్నారు.
సన్యాసయ్య నాయుడు తమ్ముడు కోట్ల లక్ష్మణస్వామికి మధుసూదన్‌రావు, విజయ రుక్మిణి సంతానం. అందరూ మేడలోనే ఉమ్మడిగా జీవించేవారు. సన్యాసయ్య నాయుడు బతికున్నంత కాలం ఆ మేడలో గొప్ప వైభవం వర్దిల్లిందని చెబుతారు. నాయుడు మంచి వేటగాడే కాదు, సాంస్కృతిక కళల ప్రియుడని, ఉదార వాది అని చెబుతారు.
ఇప్పటికీ ఆ మేడలో వీణ, జంతువుల చర్మాలు, కొమ్ములు కనిపిస్తాయి. రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులు టౌన్‌హాల్ నిర్మాణానికి ఉపక్రమించినప్పుడు.. సన్యాసయ్య నాయుడు అందుకవసరమైన కర్రను ఉచితంగా సరఫరా చేశారు. ఈ విషయాన్ని వీరేశలింగం పంతులు తన జీవిత చరిత్రలో సైతం రాసుకున్నారు.
(శివమధు చైతన్య… ముని మనవడు)
ఇక్కడ సీన్ కట్ చేస్తే.. సన్యాసయ్య నాయుడు, లక్ష్మణస్వామి సోదరుల మరణానంతరం ఆస్తి పంపకాల్లో దుమ్ముగూడెం మేడ.. లక్ష్మణస్వామి కుమారుడు మధుసూదన్‌రావుకు దక్కింది. ఆయన కుమారులు జయసింహా, శాంతారాం, శ్రీనివాస్.. ప్రస్తుతం మేడకు వారసులుగా వున్నారు.
ల్యాండ్ సీలింగ్ చట్టంతో వారసులకు చెందిన వేలాది ఎకరాల మిగులు భూములు ప్రభుత్వ పరం అయ్యాయి. నిజానికి సన్యాసయ్య నాయుడు మరణానంతరం నుంచే మేడ వైభవం కొడిగట్టడం ప్రారంభమైనా, కాలగతిలో వచ్చిన మార్పులు మరింతగా తోడయ్యాయి.
వారసులు జయసింహా, శాంతారాం, శ్రీనివాస్.. జీవన గమనంలో భాగంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. 1978నుంచి 86 వరకు మేడను గోదావరి గ్రామీణ బ్యాంకుకు అద్దెకు ఇచ్చారు. 2010 సంవత్సరం నాటికి మేడ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. చెట్లు, పుట్టలు పెరిగి భూత్ బంగ్లాగా మారిపోయింది. నిర్వహణ లేకపోవడంతో వర్షాలకు నానుతూ క్రమంగా కూలిపోవడం మొదలైంది.
గోదావరి ఉప్పొంగిన పలు సందర్భాల్లో మేడ మొదటి అంతస్తు మునిగిపోయేది. అయితే కిటికీలకు నాడు వాడిన రంగు రంగుల అద్దాలు నేటికీ తమ ప్రభను కోల్పోకపోవడం విశేషం. అద్భుతమైన నిర్మాణ కౌశలంతో ఒకప్పుడు దేదీప్యమాన్యంగా వెలిగిన ‘నాయుడు గారి మేడ’.. నిర్వహణ లేక ఇప్పుడు అరుంధతి సినిమాలోని మహల్‌గా మారి భయం గొలుపుతోంది. ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
(నాటి భవంతి నేడు ఇలా…)
‘మేడకు మరమ్మతులు చేయించాలని, గత వైభవం తీసుకురావాలని మాకూ ఉండేది. కానీ మా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. పూర్తిగా మరమ్మతులు చేయించాలంటే కోటి రూపాయలు అవసరం అవుతాయి. పైగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దుమ్ముగూడెం ప్రాంతం పూర్తిగా మునిగే పరిస్థితులు వున్నాయి.
అందుకే మరమ్మతుల గురించి ఆలోచించడం లేదు. ఐదేళ్ల క్రితం యూకేకు చెందిన వీరవెల్లి డేనియల్ రవీంద్ర సుందర్ అనే గైనకాలజీ డాక్టర్ మా మేడను కోటి రూపాయలకు కొనేందుకు ముందుకు వచ్చారు. ‘పాస్ట్ గ్లోరీ’ అనే కాన్సెప్టుతో తాను పునరుద్ధరిస్తానని చెప్పారు. కానీ మా కుటుంబసభ్యుల షరతుల వల్ల ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు..’ అని వారసుడు కోట్ల శాంతారాం కుమారుడు శివమధు చైతన్య తెలిపారు. సన్యాసయ్య తమ్ముడికి ఇతను ముని వనవడు అవుతాడు. ప్రస్తుతం రాజమండ్రిలో ఉంటున్నారు.
(నాయుడు గారి మేడ)
తమ మేడ ప్రమాదకరంగా మారిందని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లక ముందే దానిని కూల్చివేయాలని శివమధు చైతన్య భద్రాద్రి కలెక్టర్‌కు విన్నవించారు. ఈ క్రమంలో రోడ్లు భవనాల శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాయుడు గారి మేడను వెంటనే కూల్చివేయాలని రెవెన్యూశాఖకు సిఫారసు చేసింది.
అంటే మరికొద్ది రోజుల్లో మేడ పేకమేడలా నేలమట్టం అవుతుందన్న మాట. మూల మూలకూ సోషల్ మీడియా చొచ్చుకుపోతున్న నేటి రోజుల్లో… నాయుడి గారి మేడ చర్రిత ఎక్కడా రికార్డు కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
వారసుల వైపు కారణమేదైనా కావొచ్చు.. 150 ఏళ్ల ‘నాయుడి గారి మేడ’ నిర్వహణ లోపంతో ఆయువు తీరి శిథిలావస్థకు చేరింది. అనేకానేక లెక్కల వల్ల దాని పునరుద్ధరణ, పునురుజ్జీవంపై వారిలో ఎన్నటికీ ఏకాభిప్రాయం రాకపోవచ్చు. అంతిమంగా ఒక గొప్ప వారసత్వ సంపద కాలగర్భంలో కలిసిపోవడం మాత్రం ఖరారై పోయింది…..
Share this Article