మనిషికి జ్ఞానం ఎక్కువైనా ప్రమాదమే… మన బుర్ర హరాయించుకోలేదు… కొలాప్స్ అయిపోయి, మనిషి పిచ్చోడైపోతాడు… నిజం… ఇక్కడ లక్ష పుస్తకాలు చదివిన, 80 వేల పుస్తకాలు చదివిన, కంప్యూటర్ నేనే కనిపెట్టిన, సెల్ ఫోన్ నా సృష్టే అని సొల్లే జ్ఞానుల గురించి కాదు… నిజంగానే అపరిమిత జ్ఞానాన్ని పొందిన వారి గురించి…
బీహార్… బసంతపూర్ జిల్లా… ఎవరికీ తెలియని ఓ మారుమూల పల్లె… 1942లో పుట్టాడు… తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్… పేరు వశిష్ట నారాయణ్… జార్ఖండ్‌లోని నేతర్‌హట్‌లో బడి… తరువాత పాట్నా సైన్స్ కాలేజీలో చదువు… అక్కడ తన గణిత ప్రతిభ అందరి దృష్టికీ వచ్చింది… అలవోకగా పెద్ద పెద్ద క్లిష్టమైన ఈక్వేషన్లకు సైతం మనసులోనే గుణించుకుని జవాబులు చెప్పేవాడు…
కాలేజీ ప్రిన్సిపాల్ ఆ ప్రతిభ చూసి చకచకా పై క్లాసులకు ప్రమోట్ చేశాడు… 1969లో అలా పీహెచ్డీ కూడా అయిపోయింది తనది… తన ప్రతిభ గుర్తించిన ప్రొఫెషర్ జాన్ కెల్లీ తనకు అమెరికాలో కాలిఫోర్నియా యూనివర్శిటీలో, బెర్కిలీలో చదవడానికి ఏర్పాట్లు చేశాడు… దాదాపు దశాబ్దం ఉన్నాడు అక్కడ వశిష్ట…
Ads
తరువాత ఇండియాకు తిరిగి వచ్చాడు… ఐఐటీ కాన్పూర్‌లో టీచింగ్ ప్రొఫెషన్… టీఐఎఫ్ఆర్ ముంబై, ఐఎస్ఐ కలకత్తా… తను ఓ గొప్ప మెంటార్… తరువాత డెస్టినీ ఎదురుతిరిగింది… స్కిజోఫ్రెనియాకు గురయ్యాడు… తద్వారా విడాకులు, తన విద్యాప్రతిభ క్షీణించింది… ఆసుపత్రుల చుట్టూ తిరిగేవాడు… తరువాత ఓరోజు రైలులో వెళ్తూ మాయమైపోయాడు… సీన్ కట్ చేస్తే…
తన స్వగ్రామంలో తేలాడు… అక్కడికి ఎందుకు వచ్చాడు..? ఎలా వచ్చాడు..? తనకే తెలియదు… వచ్చేశాడు అలాా, అంతే… మళ్లీ చికిత్సలు షురూ… బెంగుళూరులోని NIMHANS చేర్చారు, అక్కడి నుంచి ఢిల్లీలోని IHBAS కు మార్చారు… హీరో శతృఘ్నసిన్హా సాయం చేసేవాడు… కొద్దిగా కోలుకున్నాక మాధేపురలోని BNMU లో టీచింగుకు రీఎంట్రీ దొరికింది… కానీ తన ప్రతిభ ఏమిటో తనకే తెలియని దురవస్థ…
2019లో 72 ఏళ్ల వయస్సులో కన్నుమూశాడు… తనకు మరణానంతరం పద్మశ్రీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం… అమెరికాలో ఉన్నప్పుడు బెర్కిలీలోని ఆ యూనివర్శిటీ మాత్రమే కాదు, నాసా వంటి సంస్థలూ తన సేవల్ని వాడుకున్నాయని చెబుతారు… గణిత మేధావి రామానుజన్ వారసుడిగా చెప్పేవారు అందరూ… చంద్రుడిపైకి మనిషిని పంపించిన అపోలో మిషన్ రోజుల్లో నాసా కంప్యూటర్లు మొరాయిస్తే వశిష్ట నారాయణ్ సాయం చేశాడంటారు…
గణితం అంటేనే ఇండియా… పెద్ద పెద్ద విద్యావేత్తలు కూడా ఆశ్చర్యపోయేలా… కంప్యూటర్‌తో పోటీపడే, కాదు, మిన్నగా మెరిట్ చూపించిన చాలామంది పుట్టారు ఇక్కడ… ఒకదశలో వశిష్ట నారాయణ్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కొన్ని థియరీలను కూడా చాలెంజ్ చేశాడు… తరువాత ఏమైంది..? విధి వక్రించింది… ఆ జ్ఞానం బరువును ఆ మెదడు తట్టుకోలేకపోయింది… దెబ్బతింది… అదీ విధి…!!
Share this Article