.
.. [ రమణ కొంటికర్ల ] .. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోనా కమ్మని ప్రదేశమూ అనేవాళ్లు కొందరు. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా భావించి ఎక్కడి నుంచో వచ్చి మరెక్కడో ఆచార, వ్యవహారాలు, జీవన విధానమిష్టపడి ఎక్కడైనా ఉండిపోగలవారు ఇంకొందరు. అలాంటి రెండో రకమే మనం చెప్పుకోబోతున్న జర్మన్ వాసి హీంజ్ జోహన్నస్ పాల్.
ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఇండియాకొచ్చాడు. ఇక ఇటే ఉండిపోయాడు. ఒడ్డూ, పొడుగుతో ఆకట్టుకునేలా కనిపించే సదరు జర్మనియన్ పూర్తిగా కుర్తా, పైజామా వంటి సంప్రదాయ దుస్తుల్లో కేరళైట్సే అబ్బురపడేలా కనిపించడం విశేషం. ఇండియాకు వచ్చిన తర్వాత హీంజ్. జే. పాల్ కాస్తా ప్రేమ్ మనస్విగా మారిపోయాడు. అదే ఆయన పేరుగా స్థిరపడింది.
Ads
1993లో మొట్టమొదటిసారిగా పూణేలోని ఓషో కమ్యూన్ ప్రెస్ ఆఫీస్ లో కో ఆర్డినేటర్ గా పనిచేసేవాడు హీంజ్. జే. పాల్. అక్కడ పాల్ కు అలోక్ అనే ఓ మళయాళీతో పరిచయమేర్పడింది. అప్పుడతను పాల్ ను కేరళకు రావాలని ఆహ్వానించాడు. అలోక్ కోరినట్టే ఓసారి కేరళకెళ్లిన పాల్.. తొలిచూపులోనే కేరళతో ప్రేమలో పడిపోయాడు.
నిజంగానే అది దేవతల భూమిగా కనిపించింది. ముఖ్యంగా అక్కడి నాలుకెట్టు భవనాలు.. అంటే మన ప్రాంతంలో చతుశ్రాల భవంతుల్లా కనిపించే ఇళ్ల నిర్మాణశైలి పాల్ ను విశేషంగా ఆకట్టుకుంది. దానికి తోడు.. త్రిసూర్ ఆలయంలో ఏటా జరిగే పూరం ఉత్సవాలు పాల్ ను బతికితేగితికితే కేరళ్లోనే బతకాలనేంత ఇన్స్పైర్ చేశాయి.
అలా అక్కడే ఓ 200 ఏళ్ల నాటి కిందటి ఓ పాత నాలుకెట్టు మాడల్ హౌజ్ ను కొనుగోలు చేసి త్రిసూర్ లోనే సెటిలైపోయాడు. పుట్టుకతో జర్మన్ అయినప్పటికీ… తన ఛాయిస్ మాత్రం అక్కడి జీవనవిధానం నచ్చడంతో కేరళగా మారిపోయింది. అక్కడే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ లో పనిచేసేవాడు పాల్.
ముఖ్యంగా త్రిసూర్, అరట్టుపుళ, పేరువానాలో జరిగే పూరమ్ ఉత్సవాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడు పాల్.
ఇంతకీ పూరమ్ అంటే ఏంటి..?
ఇది కేరళలో ఓ ప్రధాన వేడుక. కొచ్చి మహారాజైన సాక్తన్ తంపురన్… 1790-1805 మధ్య కాలంలో ఘనంగా నిర్వహించిన ఓ పండుగ. ఓ సంప్రదాయ పండుగగా మారి… పూర్ణిమ నాడు పూర్ణచంద్రుడు వచ్చే రోజు నిర్వహించే వేడుక. సుమారు పది లక్షల మంది హాజరయ్యే అతి పెద్ద దక్షిణాది పండుగ ఇది. త్రిసూర్ లోని వడక్కునాథన్ ఆలయంలో జరిగే ఈ వేడుక చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు.
ఇలాంటి పండుగలు వేడుకలు.. పాల్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే కుటియట్టం వంటి నాటకంతో కూడిన బ్యాలే ప్రదర్శనలూ పాల్ ను కేరళకే కట్టిపడేశాయి. అంత విభిన్నమైన వైవిధ్యం తనకింకెక్కడా లభించదనే భావనో, ఏమో.. మొత్తానికి ఇండియాకు వలస వచ్చిన పాల్.. కేరళకు వెళ్లాక 30 ఏళ్ల పాటు అక్కడే అలా ఉండిపోయాడు.
ప్రస్తుతం పాల్ అలియాస్ ఇండియన్ నేమ్ ప్రేమ్ వయస్సు 84 సంవత్సరాలు. తనకు కేరళ ఉద్యోగపరంగా కన్నా కూడా.. విభిన్నరకాల ప్రజలతో తనను మమేకం చేసి.. వారి జీవనవిధానాల్లోని వైవిధ్యంతో వ్యక్తిగతంగా తనను కేరళ్లోనే కట్టిపడేసిందంటాడు పాల్. అలాగే, విశాల దృక్పథాన్ని అలవర్చుకునేందుకు దోహదపడిందంటాడు.
ముఖ్యంగా ఇంటాక్.. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ సంస్థతో పనిచేయడం మూలాన చారిత్రాత్మక ప్రదేశాల పరిరక్షణ కోసం పనిచేయడం, సంప్రదాయ భవన నిర్మాణాలను కాపాడుకోవాలన్న ఆసక్తి పెరగడం, అదే సమయంలో సమకాలీన జీవన విధానంలో సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లవంటివెన్నో తన జాబ్ లో చూశానంటాడు ప్రేమ్ అలియాస్ పాల్.
అయితే, ఇప్పుడు 84 ఏళ్ల పాల్ తాను కేరళలోని త్రిసూర్ లో కొన్న ఇంటిని అమ్మేసి.. అక్కడ తను సంపాదించుకున్న ఇతర ఆస్తులనూ అమ్మేసి తిరిగి జర్మన్ వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఎంత త్వరగా కేరళతో, అక్కడి మనుషులతో అటాచ్ అయ్యాడో.. 30 ఏళ్ల పాటు కలిసి జీవించి మమేకమయ్యాడో.. ఇప్పుడు డిటాచ్ మెంట్ కోరుకుని తిరిగి తన జన్మస్థలమైన జర్మనీ బాట పట్టాడు.
ఈ ఘర్ వాపసీ.. పాల్ కు ఒకింత థ్రిల్ కావచ్చుగానీ.. అదే సమయంలో, కేరళను వీడుతున్నానన్న బాధా అంతకంటే ఎక్కువే మొదలైంది. అంతేకాదు, ఎక్కడో జర్మన్ నుంచి వచ్చి సొంత మనుషులకంటే ఎక్కువగా కలిసిపోయి.. తమ సంస్కృతిని ప్రేమించి దగ్గరైన ఓ వ్యక్తి ఉన్నపళంగా వెళ్లిపోవడం ఇప్పుడు త్రిసూర్ వాసుల కళ్లల్లోనూ ఒకింత కన్నీళ్లు నింపుతున్న ఘట్టం.
ఇంతకీ తనకు కేరళలో ఏం నచ్చిందని, కేరళ నుంచి తిరిగి వెళ్లిపోతే మీరు బాగా మిస్సయేదేంటని ఎవరైనా అడిగితే పాల్ చెప్పే మాట… అమ్మనూర్ కుట్టం చాక్యార్.. అలాగే, అమ్మనూర్ రజనీష్ చాక్యార్ వంటి సంస్థలు శ్రీ వడక్కమ్నాథన్ ఆలయంలోని కూతంబలంలో ప్రదర్శించే కూడియట్టం ప్రదర్శనలని చెబుతున్నాడు. అంతలా అక్కడి సాంస్కృతిక ప్రదర్శనలు పాల్ ను కేరళ రాష్ట్రానికి కట్టిపడేశాయి.
కూడియట్టం ప్రదర్శనలకు క్రమం తప్పకుండా వెళ్లిన పాల్.. కేరళ సంస్కృతీ, సంప్రదాయాలపై ప్రచురితమైన పలు పుస్తకాల భాండాగారాన్ని తయారుచేసుకున్నాడు. వాటన్నింటినీ చదివి అక్కడి సంస్కృతీ, సంప్రదాయాలను తనకున్న ఆసక్తితో తెలుసుకున్నాడు.
ఇప్పుడా పుస్తకాలన్నీ ఓ గ్రంథాలయానికప్పగించాడు పాల్. ఇక తను ముచ్చటపడి కొనుగోలు చేసిన చతుశ్రాల భవంతి కేరళలో నాలుకెట్టు అని పిల్చుకునే భవనాన్ని ఒట్టపాలెంకు చెందిన ఓ పెట్టుబడిదారుల బృందం కలిసి కొనుగోలు చేసి దాన్ని వారసత్వ సంపదగా కాపాడాలని నిర్ణయించుకుంది….. అవునూ, ఇంత ప్రేమించే కేరళను వదిలేసి ఎందుకు వెళ్తున్నాడు..? అది మాత్రం చెప్పడు… చెప్పలేదు… చివరి రోజుల్లో అమ్మ వంటి జన్మస్థలి ఒడిలోనే ఒరిగిపోవాలనేమో…!!
Share this Article