పోలీసులు ఎక్కడైనా పోలీసులే… మన వాళ్లు కావచ్చు, యూపీ పోలీసులు కావచ్చు, అమెరికా పోలీసులు కూడా కావచ్చు… వాళ్లేది అనుకుంటే అది చేస్తారు… దెయ్యంతో వాంగ్మూలం తీసుకోగలరు… పిటిషన్ తీసుకుని, ఆ దెయ్యానికి పడని వ్యక్తులపై నేరమూ మోపగలరు… కోర్టులో ఛార్జి షీటు కూడా దాఖలు చేయగలరు… చివరకు ఓ న్యాయవాదికి వకాలత్‌నామా కూడా ఇప్పించగలరు… ఈ కేసూ అదే…
ఇది ఉత్తరప్రదేశ్ కేసు… ఖుషినగర్ ఏరియా… శబ్దప్రకాష్ అనే వ్యక్తి 2011లో మరణించాడు… కానీ 2014లో, అంటే మూడేళ్ల తరువాత తన పేరుతో కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఓ పిటిషన్ ఫైలయింది… ప్రాపర్టీ వివాదాలు… శబ్దప్రకాష్‌కు పడని వ్యక్తులపై ఈ పిటిషన్ రాగానే పోలీసులు ఏ ఎంక్వైరీ లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… చేశారు కదా, శబ్దప్రకాష్ వాంగ్మూలం కూడా రికార్డు చేశారు..! చేశారు కదా, దాని ఆధారంగా కోర్టులో ఛార్జి షీటు కూడా దాఖలు చేశారు… అందులో సదరు దెయ్యాన్ని (దెయ్యం అని రాయలేదు లెండి, శబ్దప్రకాష్ అనే రాశారు) ప్రాసిక్యూషన్ సాక్షిగా చూపించారు…
విమల్ కుమార్ పాండే అనే లాయర్ సదరు మృతుడి ద్వారా వకాలత్‌నామా (తన తరఫు న్యాయవాదిగా వ్యవహరించడానికి అనుమతి) మీద సంతకమూ చేయించుకున్నాడు… ఏ వ్యక్తులపై ఈ కేసు నమోదైందో వాళ్లు చెప్పినా వినిపించుకున్నవారు లేరు… దాంతో కోర్టులో పిటిషిన్ వేశారు, ఆ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని..!
Ads
కేసు జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టు దాకా వచ్చింది… జడ్జి సౌరభ్ శ్యామ్ షంషేరీ ఆ వివరాలు విని ఆశ్చర్యపోయాడు… ఏమమ్మా, నీ భర్త మరణించాడు నిజమేనా సదరు మృతుడి భార్యను అడిగాడు… అవును సార్ అంటూ ఆమె డెత్ సర్టిఫికెట్ సమర్పించింది కోర్టుకు… మరి 2011లో మరణించిన వ్యక్తి పోలీసులకు ఎలా ఫిర్యాదు చేశాడు, ఈ వాంగ్మూలం ఎవరిచ్చారు..? చూడబోతే పోలీసులతో మరణించిన శబ్దప్రకాష్ ఆత్మ లేదా దెయ్యంతో డీల్ చేసినట్టున్నారు అని తీవ్ర వ్యాఖ్య చేశాడాయన…
అసలు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎవరు..? ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు..? స్టేట్‌మెంట్ రికార్డు చేసింది ఎవరు..? మొత్తం ఎంక్వయిరీ చేయాల్సిందిగా ఖుషినగర్ ఎస్పీని ఆదేశించిన కోర్టు సదరు దెయ్యం పెట్టిన కేసును కొట్టేసింది… అంతేకాదు, అసలు ఏమీ చూసుకోకుండా వకాలత్‌నామా మీద ఎవరి సంతకం తీసుకున్నారని న్యాయవాదిని ప్రశ్నించి, ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది… దీన్ని పాఠంగా తీసుకోవాలని హైకోర్టు బార్ అసోసియేషన్‌కూ సూచించింది..!!
Share this Article