1973 లోకి వచ్చేసాం . 1972 లో రాజుకున్న జై ఆంధ్ర ఉద్యమం 1973 లో కూడా కొనసాగింది . బాపు-రమణ-కె వి మహదేవన్ల అపూర్వ సృష్టి . A great classic . Musical feast . ఈ అందాల రాముడు సినిమా… ఫస్ట్ రన్ లో ఢాం . జనానికి ఎందుకనో ఎక్కలేదు . గోదావరి నేపధ్యంలో సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్నీ హిట్టే . కానీ , ఈ సినిమా మిపహాయింపు అయింది . రిపీట్ రన్సులో బాగా ఆడింది . గోదావరిలో బోట్ మునిగిపోయిందని తన మీద తానే కార్టూన్ వేసుకున్నాడు మహానుభావుడు బాపు .
ప్రపంచంలో కనిపించే భిన్న మనస్తత్వాలు కలిగి ఉన్న అన్ని పాత్రలూ ఉంటాయి . ఓ చిన్న కాలనీలో ఉండే వారందరూ భద్రాద్రికి బోటులో బయలుదేరుతారు . ఆ కాలనీ పేరు పంచవటి . రాముడి మీద బాపుకున్న అపార అపేక్ష అలాంటిది . వీళ్ళ కామన్ ప్రజల బోటుకి ఓ కోటీశ్వరుని బోట్ సంధానం చేయబడుతుంది . రకరకాల పరిణామాలు . ఎన్నెన్నో సందేశాలు . ఆ సాధారణ జనం బోటులో బయలుదేరిన వృధ్ధురాలి ఇల్లు వదలి పారిపోయిన కొడుకే ఆ కోటీశ్వరుడని తెలుస్తుంది చివర్లో .
ఆ కోటీశ్వరుడిగా నాగభూషణం , ఆయన ముద్దుల కూతురుగా నూతన నటి లత , కోటీశ్వరుడి ఆస్తిని కొట్టేయాలనే దురుద్దేశంతో ఉండే సెక్రటరీగా ధూళిపాళ , ఆ సెక్రటరీకి తోడు దొంగగా మరో నూతన నటుడు నిత్య పెళ్ళికొడుకు నూతన్ ప్రసాద్ . అతనికి ఇదే మొదటి సినిమా . సరంగుగా మాడా , అట్లు అమ్మే పాత్రలో సూరేకాంతం , రాధాకుమారి , అప్పుల అప్పారావుగా రాజబాబు , ఝాన్సీ , కాకరాల , రావి కొండలరావు , పొట్టి ప్రసాద్ ప్రభృతులు నటించారు .
Ads
ప్రత్యేకంగా చెప్పుకోవలసింది బాపు-రమణలు తెలుగు వారికి అందించిన గ్రేట్ పాత్ర తీతా . అంటే తీసేసిన తాసీల్దార్ . అల్లు రామలింగయ్య నటించిన ఈ తీతా పాత్ర తెలుగునాడులో బుడుగు లాగా వీర పాపులర్ . That is Bapu-Ramana combination .
పాటలు . బాపు మరో బమ్మెర పోతన . మరో త్యాగయ్య . ఏ సినిమా అయినా పాటలన్నీ అలాగే వ్రాయించుకుంటాడు . మము బ్రోవమనీ చెప్పవే సీతమ్మ తల్లీ అనే రామకృష్ణ పాడిన పాట , పలుకే బంగారమాయేరా అందాల రామా అనే మంగళంపల్లి వారు పాడే పాట , రాముడేమన్నాడోయ్ సీతారాముడేమన్నాడోయ్ అనే రామకృష్ణ మరో పాట అద్భుతమైన హిట్ పాటలు .
ఎదగటానికి ఎందుకురా తొందరా ఎదర బ్రతుకంతా చిందర వందర అనే పాట తెలుగు ప్రజల నానుడి పాట అయింది . కురిసే వెన్నెలలో మెరిసే గోదారిలా విరబూసిన రామకృష్ణ , సుశీలలు పాడిన పాట ఎంతో శ్రావ్యంగా , అందంగా ఉంటుంది . సమూహ భోజనంబు సంతోషమైన విందు పాట మన వివాహ భోజనంబు పాటని గుర్తుకు తెస్తుంది .
ఈ సినిమాకు మరో గొప్ప ప్రత్యేకత ఏమిటంటే టైటిల్స్ వేసేటప్పుడు నేపధ్యంలో పలుకే బంగారమాయేరా పాట , ఆ పాటకు తగ్గ శాస్త్రీయ నృత్యం మహాద్భుతం . నాట్యకారిణి పేరు కనకదుర్గ . చూసి తరించాల్సిందే . ముళ్ళపూడి వెంకట రమణ విరచిత జనతా ఎక్స్ప్రెస్ ఆధారంగా సినిమాకు అనుకూలంగా మలచబడింది .
ప్రత్యేకంగా చెప్పుకోవలసింది అక్కినేని పాత్ర , ఆ పాత్రకు ఆయన నటన . నాస్తికుడు అయిన అక్కినేని ఆస్తికుడి పాత్రలో కొన్ని సన్నివేశాలలో జీవించాడనే చెప్పాలి . 1973 వ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డు , ఉత్తమ రచయిత అవార్డు రమణకు దక్కాయి .
చాలా తరచుగా టివిలో వస్తుంటుంది . శ్రీరామ నవమి నాడు ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది . Don’t miss . యూట్యూబులో కూడా ఉంది . చూసి ఉండకపోతే పొరపాటున కూడా మిస్ కాకండి . It’s a musical and visual feast . ప్రతీ ఫ్రేంలో బాపు కనిపిస్తుంటాడు . An unmissable , pious movie of Bapu-Ramana-K V Mahadevan trio . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
ఈ పోస్టుకు గద్దె సుధాకర్ యాడ్ చేసిన ఇంట్రస్టింగు ఏమిటంటే… ‘‘సినిమా సక్సెస్ కానప్పటికీ బాపు రమణ గార్లు తమ మీద తామే సెటైర్లు వేసుకుంటూ పత్రికల్లో ఇచ్చుకున్న ప్రకటనలు ఆ తర్వాత పాత పేపర్లలో చూపించారు… సినిమా రిలీజ్ అయిన వందో రోజున నేడే 100 రోజు అని ప్రకటన వేసి, కింద ఇంకో డబ్బై రోజులు ఆడినట్టైతే… అంటూ భలే చమత్కారం చేశారు…
Share this Article