.
ఒక ఫోటో చూద్దాం… గొప్ప ఫోటో… గొప్ప అంటే టెక్నికల్‌గా కాదు… దాని సందర్భం, దాని వెనుక కథ… ఒక నాయకుడు జనంలోకి ఎప్పుడు వెళ్లాలి… జనంలో ఎలా ఉండాలి… జనమే రాజకీయంగా బతకాలి అని చెప్పే ఫోటో…
ఇప్పటి పార్ట్ టైమ్, ట్విట్టర్, ఫామ్ హౌజ్ పొలిటిషయన్లకు అర్థం కాని ఫోటో అది… షూటింగుల మధ్య విరామాల్లో, వ్యాపారాల నడుమ దొరికే గ్యాపులో రాజకీయాలు చేయడం కాదు… రాజకీయం అనేది ఓ సాధన… ఓ కమిట్మెంటు…
Ads
ఒక ఏనుగు… దానిపై ఇందిరాగాంధీ… ఇదే ఫోటో… అబ్బే, ఏనుగుపై ఇందిరాగాంధీ ఎక్కితే గొప్పదనం ఏమిటి అని చప్పరించేయకండి… ఆ కథలోకి వెళ్దాం… ఎమర్జెన్సీ అనంతరం ఎన్నికల్లో జనం ఇందిరాగాంధీని ఛీకొట్టారు… ఆ కథ అందరికీ తెలిసిందే కదా… ఆమె కూడా ఓడిపోయి, ఇంటి నుంచి కదల్లేదు చాలారోజులు…
అసహనంగా చూస్తోంది సరైన టైం కోసం… ఈ అతుకుల బొంత జనతా ప్రభుత్వం నాలుగు రోజులు కూడా ఉండదని ఆమెకు తెలుసు… తనను ఛీకొట్టారని జనాన్ని ఈసడించుకోలేదు ఆమె… జనం దృష్టిని తనవైపు పాజిటివ్‌గా ఎలా మళ్లించుకోవాలని మాత్రమే ఆలోచిస్తోంది…
బీహార్… బెల్చి అనే ఓ మారుమూల అటవీ గ్రామంలో భూస్వాములు 11 మందిని నరికి చంపారు… అందులో 8 మంది దళితులు… వార్త బయటికి రావడమే లేటుగా వచ్చింది… ఇందిరాగాంధీ ఇంటి నుంచి బయటికొచ్చింది…
అప్పటికే ఆమెకు అరవయ్యేళ్లు… ఆమె ఓడిపోయి అప్పటికి జస్ట్, 5 నెలలు… రైలు ఎక్కింది… పాట్నా చేరింది… అక్కడి నుంచి జీపుల్లో ఆ ఊరి వైపు బయల్దేరారు… ఇప్పుడున్నట్టు ప్రైవేటు టీవీలు, ఇంత మీడియా లేదు కదా… ఢిల్లీ నుంచి ఇద్దరు రిపోర్టర్లు, ఒక కెమెరామెన్… పాట్నాలోని నలుగురు రిపోర్టర్లు…
కొంతదూరం పోయాక వర్షం… టైర్లు దిగబడుతున్నయ్… కొంతదూరం పోగానే జీపులు మొరాయించాయి… ట్రాక్టర్ అయితే కాస్త బెటర్ అని అప్పటికప్పుడు ఎలాగోలా తీసుకొచ్చారు… అది కూడా కొంతదూరం పోయి ఆగిపోయింది… ఆమె దిగి నడక మొదలుపెట్టింది…
ఎంత దూరమైనా సరే, నడిచి వెళ్దాం అన్నది మొండిగా… ఓచోట నీటిప్రవాహం… ఆమె దిగింది… మోకాళ్లపైదాకా నీళ్లు, చీరె తడిసిపోయింది… చలి, వణుకు… అక్కడ ఓ గ్రామవాసి పరుగున వచ్చి, ఆమెను ఆపి, అప్పటికప్పుడు ఓ ఏనుగును పట్టుకొచ్చాడు… ఎక్కమన్నాడు…
నో బ్యాలెన్స్.., అది అంబారీ కాదుగా… కూర్చోవడం సరిగ్గా తెలియకపోతే కిందపడిపోవడమే… ఎలాగోలా నేరుగా ఆ ఊరు చేరింది… ‘‘నా దళితులకు ఇంత అన్యాయం జరిగితే ఇంట్లో కూర్చుంటానా..? మీ కన్నీళ్లు పట్టని సర్కారు సంగతి చూద్దాం’’ అని గర్జించింది… అలాగే మళ్లీ వెనక్కి వచ్చింది ఆ ఏనుగుపైనే… ఆ తరువాత అలా చాలా ఊళ్లు తిరిగింది… అనేకచోట్ల ఆమెతోపాటు ఒకరిద్దరు లోకల్ చోటామోటా నాయకులు మాత్రమే…
ఒకవైపు తనపై విచారణలు, మరోవైపు పర్యటనలు… కానీ కుంగిపోలేదు, ఇంట్లో పడుకుండిపోలేదు… తను ఫైటర్… అగ్రదేశాల నేతలకే చెమటలు పట్టించిన ధీశాలి ఆమె… అలాంటి టెంపర్‌మెంట్ ఉన్న నాయకత్వం మళ్లీ ఈ దేశం చూడకపోవచ్చు బహుశా…
చివరకు ఆమె పర్యటనలతో ఏమైంది..? తరువాత కొన్నాళ్లకే ఆమె హస్తిన పీఠం ఎక్కింది… అతుకులబొంత సర్కారును జనం బంగాళాఖాతంలోకి ఈడ్చిపారేశారు… రాజకీయాల్లో ఓ టైం వస్తుంది, దాన్ని ఒడుపుగా పట్టుకున్నవాడు విజేత అవుతాడు… అదే ఈ ఫోటో చెప్పేది… (ఈరోజు ఇందిరాగాంధీ జయంతి)
Share this Article