( ……. ఆకుల అమరయ్య ……… ) బీకాంలో ఫిజిక్స్.. జంతుశాస్త్రంలో బోటనీ.. ఆకాశం నుంచి రుదిరం.. టెంపులంటే కణతనే మరో అర్థముందనే తెలియక ఆలయమేనని బలంగా బల్లగుద్ది మరీ చెప్పే నడమంత్రపు కాలమిది. అటువంటి కాలంలో ఉసిళ్లు (వర్షాకాలంలో వచ్చే రెక్కల పురుగులు), పుట్టకొక్కులు (ముష్రూం), ఖగోళ శాస్త్రం (స్పేస్ సైన్స్), బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide), విషావరణం (పొల్యూషన్), శ్వాసించే గృహం (ఎయిర్ కండిషన్డ్ హౌస్), తొవ్వోడు (డ్రెడ్జర్) అంటే ఎవరికి తెలుస్తుంది, చెప్పండి.. అజ్ఞానానికి అంతుండని మాట నిజమే. అవదులుండని మాటా వాస్తవమే. అందుకెవరు మినహాయింపు కాదు. తెలియకపోవడం తప్పుకాదు. తెలుసుకోక పోవడమే తప్పు. అందుకే చట్టాలు కూడా.. అజ్ఞానం ఎల్లకాలం పెట్టుబడి కాదంటున్నాయి. తెలియకపోతే తెలుసుకోమంటున్నాయి.
కరక్కాయలతో కోట్ల మాదిరే…
కరక్కాయలతో కోట్లు సంపాయించడం, విస్కీ, బ్రాందీ, కర్పూరంతో కరోనాను కట్టడి చేసే మాయా కాలం కదా.. నిప్పుకు పెట్రోల్ తోడైనట్టుగా వాట్సాప్ యూనివర్శిటీలు, యూట్యూబు చానెళ్లు ఉండనే ఉండే. నిజం నిగ్గుతేలేలోగా అబద్ధం అందర్నీ పలకరించి వస్తోంది. దీంతో ఏది మిస్ ఇన్ఫరమేషనో (తెలియక చెప్పేది), ఏది డిస్‌ఇన్ఫరమేషనో (తెలిసి తప్పుచెప్పడం) తెలియని స్థితి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగే పోతోంది.
జర్నలిజం మూల సూత్రాలలో 5 *w*లతో పాటు.. when you have a doubt you cut it out… అనేదొకటైతే, తెలియందాన్ని పక్కోణ్ణి అడగనైనా అడుగన్నది మరొకటి. ఈ రెండున్నట్టు తెలిసినా మావాళ్లు పెద్దగా పట్టించుకోరు. మనకు తెలియందేముందేమనే దీమాతో రాస్తుంటారు. కొంపకు తిప్పలు తెచ్చుకుంటుంటారు. అటువంటి కొని తెచ్చుకునే కష్టాలకు చెక్ పెట్టేందుకే అప్పుడప్పుడు జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ అకాడమీలు, మీడియా అకాడమీలు, ప్రభుత్వ, ప్రైవేటు జర్నలిజం కళాశాలలు పాత్రికేయులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటాయి. (అమెరికాలోనైతే ప్రతి జర్నలిస్టూ ఆర్నెల్లకోసారైనా శిక్షణకు వెళ్లాల్సిందేనట) రాజకీయ, ఆర్ధిక, సామాజిక, నేర, చట్ట, మానవాసక్తికర అంశాల చుట్టే ఈ శిక్షణ తిరుగుతుంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల రిపోర్టింగ్‌పై చాలా చాలా తక్కువ. ఇప్పుడా లోటు భర్తీకి ఎన్.ఐ.టీ (వరంగల్), సైన్స్ కమ్యూనికేషన్, పాపులరైజేషన్ అండ్ ఎక్స్‌టెన్షన్ (స్కోప్– తెలుగు), ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్‌మెంట్ నడుంకట్టాయి.
సైన్స్ రిపోర్టింగ్‌పై శిక్షణ తక్కువే…
ప్రెస్ అకాడమీ నిర్వహించిన చాలా తరగతులకు నేనూ ఓ రిసోర్స్‌పర్సన్‌గా వెళ్లా. కొన్ని శిబిరాలకు నేనూ కోర్సు డైరెక్టర్‌గా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో మేమూ జర్నలిస్టుల పునశ్చరణ తరగతులను నిర్వహించాం. అక్కడెక్కడా సైన్స్ రిపోర్టింగ్‌పై క్లాస్ ఉన్న గుర్తు లేదు. సిఫార్ అనే స్వచ్ఛంద సంస్థ మాత్రం హెచ్‌ఐవీ, ఎయిడ్స్ పై నాతో సహా ఓ ఐదాగుర్ని మాస్టర్ ట్రైనర్స్‌గా మార్చి 23 జిల్లాలూ తిప్పింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు అచ్చంగా సైన్స్ రిపోర్టింగ్ మీద నిన్న (సెప్టెంబర్ 23న) శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారంటే ముచ్చటేసింది. విందాంలెమ్మని నేనూ, మిత్రుడు రాంబాబూ ఉస్మానియాకి వెళ్లాం.
…..
’సంద్యా జీవులం, సందేహభావులం
ప్రశ్నలే, ప్రశ్నలు…
జవాబులు సంతృప్తి పరచవు
మాకు గోడలు లేవు
గోడలను పగులగొట్టడమే పని’ అంటాడు శ్రీ.శ్రీ.
జర్నలిస్టులకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. సైన్స్ రిపోర్టింగ్‌కైతే మరీనూ… మాలో చాలా మందికి మాకు తెలిసిందే శాస్త్రం. గట్టుకు ఆవల ఇంకా చాలా ఉందన్నా సరే ఓపట్టాన నమ్మం. మీడియాలో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి బోలెడంత చరిత్ర ఉందని తెలిసిన వాళ్లు మాలో చాలా తక్కువేనని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుత మీడియాలో వార్తంటే రాజకీయం, క్రైం, సెక్స్, సినిమా. చదువరులైనా, చూపరులైనా వీటికే ఎక్కువ.
ప్రెస్ కమిషన్ చెప్పినా ఖాతరు లేదు…
1952లో జస్టిస్ జీఎస్ రాజ్యాధ్యక్ష ఛైర్మన్‌గా ఏర్పాటైన తొలి ప్రెస్ కమిషన్… పత్రికల్లో 60 శాతం చోటును వ్యవసాయ, అభివృద్ధి వార్తలకిమ్మని చెప్పింది. అప్పటికింకా పత్రికా రంగం వ్యాపారమయం కాలేదు. ఆ రోజుల్లోనే ఆ మాటను పట్టించుకున్న వాళ్లు లేరు. ఇకనిప్పుడు ఎవరు పాటిస్తారు? వ్యాపారమే లక్ష్యమని పబ్లిక్గా చెప్తున్నప్పుడు ఇంకెవరు వింటారు? ఈవేళ ఏ మీడియాను తీసుకున్నా 70 శాతం రాజకీయ వార్తలే.
Ads
1960, 70లలో సైన్స్ వార్తలకిచ్చిన చోటు, ప్రత్యేక అనుబంధాలు ఇప్పుడు లేవు. స్పెషల్ రిపోర్టర్లు లేరు. డెస్క్‌లు లేవు. పరిశోధకులో, సంస్థలో, శాస్త్రవేత్తలో, శాస్త్ర, సాంకేతిక రంగాల ప్రముఖులో చెప్పిందో, రాసిచ్చిందో వార్త. ఓ క్రాస్ చెకింగ్ ఉండదు. ఎవరి నిర్దారణ ఉండదు. అది ప్రకటనలో, యాడ్వటోరియలో, ఏ పాడోపచ్చిబద్ధలో తెలియదు. వ్యాపారస్తుడే రచయిత, ప్రకటనకర్త. డోలో కంపెనీ దేశం యావత్తు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అలో లక్ష్మణా అంటుంటే వేల కోట్ల వ్యాపారం చేసింది.. అంటే ఎంత గూడుపుఠాణీ జరిగుండాలి? తెర వెనుక ఎంత బాగోతం నడిచుండాలి?
అదంతా పాపులర్ సైన్సేనా?…
సైన్స్ అనేది మనిషి తన కోసం తయారు చేసుకున్న ఓ సాధనం. ప్రస్తుత వ్యాపార ప్రపంచంలో సైన్స్ కూడా ఓ లాభమే తప్ప మానవ క్షేమం కాకుండా పోయింది. లాభమే ధ్యేయంగా పని చేసే పెట్టుబడిదారీ వ్యవస్థలు ప్రకృతిని సర్వనాశనం చేస్తూ ఆ మొత్తం వినాశనానికి ప్రపంచ మానవులందరూ కారణమైనట్టు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దాన్ని జనానికి విడమర్చి చెప్పే సైన్స్ జర్నలిస్టులు గానీ మీడియా సంస్థలు గానీ లేకపోవడం విషాదం.
అలాగే, పాపులర్ సైన్స్ పేరిట జరిగే ప్రచారంలో శాస్త్రమెంతో? మూఢాచారమెంతో కనిపెట్టే పరిస్థితి లేదు. ఉన్న డేటా మైనింగ్‌ను కొల్లగొట్టే శక్తియుక్తులు లేవు, అన్నింటికీ మించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న జర్నలిస్టులు కరవవుతున్నారు. అందువల్ల సైన్స్ పట్ల ఆసక్తి ఉన్నవాళ్లైనా ప్రజలకు మంచి, కచ్చిత సమాచారాన్ని ఇచ్చేందుకు sci-hub, plos one, lancet..లాంటి వెబ్ సైట్లను ఉపయోగించుకోమని, సామాజిక బాధ్యతను మర్చిపోవొద్దని రిసోర్స్ పర్సన్స్‌గా వచ్చిన జర్నలిస్టులు యు.సుధాకర్ రెడ్డి, నాగసూరి వేణుగోపాల్, ఆర్.సుధాభాస్కర్, కేజీడీ సురేష్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్ మోహనరావు, ప్రొఫెసర్ కె.స్టీవెన్సన్, ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్ ఏ. రామచంద్రయ్య వంటి వాళ్లు సలహా ఇచ్చారు.
అయితే ఇటువంటి శిక్షణ కోసం నిర్వాహకులు ముందుగా ఆయా మీడియా సంస్థల సంపాదకుల్నో, ఇతర బాధ్యుల్నో కలిసి వాళ్ల వద్ద శాస్త్ర, సాంకేతిక రంగాల వార్తల్ని చూసే జర్నలిస్టుల్ని పంపించమని అడిగితే బాగుండేది. అప్పుడు తాలు తక్కువై యాక్టివ్ జర్నలిస్టుల హాజరీ పెరిగుండేది. ఇండియాలో సైన్స్ రిపోర్టింగ్ మొదలై రెండొందల ఏళ్లు దాటింది. 1818లో ప్రారంభమైన సైన్స్ వార్తల కవరేజీపై మళ్లీ ఇంతకాలానికైనా శిక్షణ ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం. అందుకు నిర్వాహకులను అభినందించాలి…. – అమరయ్య ఆకుల, సీనియర్ జర్నలిస్టు, 93479 21291
Share this Article