.
‘‘నాదగ్గర చదువుకున్నవాడే… ఒకసారి నేను జరిపిస్తున్న పెళ్లికే ఫోటో గ్రాఫర్‌గా వచ్చాడు… అక్కడికి నేను వద్దని వారిస్తూనే ఉన్నాను… తాళికట్టగానే వరుడితో వధువు గదుమ పైకి ఎత్తిపట్టుకుని పుసుకు పుసుకుమని ముద్దులు పెట్టించాడు… పందిట్లో అందరూ మురిపెంగా చూస్తున్నారు… ఆ అమ్మాయి ఇబ్బందిని ఎవడూ పట్టించుకోలేదు…
ఆ తర్వాత ఇంకో ఫోటో గ్రాఫర్… తనూ నా విద్యార్థే… వాడిని పిలిచి వారీ నీ భార్య వచ్చిందా అని అడిగా… అగో ఆ పంజాబీ డ్రెస్ వేసుకున్నది నా భార్యే సార్…పెండ్లి అయి ఏండేండ్లు… ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు సర్ అని చూపించిండు…
Ads
ఓయ్, పిలగా, పోయి నీ భార్యను ఒక ముద్దు పెట్టుకొని వస్తావా అనడిగాను… సార్, మీరు కూడా ఏందీ… గింత మందిలో ఎంత వికారంగా ఉంటది సార్ అన్నాడు… వారీ ఏడేండ్ల నుంచి సంసారం చేస్తున్న మీకే ఇంత సిగ్గుగా ఉంటే రెండు నిముషాల కింద పుస్తె కట్టించుకున్న ఆమెకు ఎలా ఉంటదిరా అన్నాను…
సార్, ఇది ఇప్పటి ట్రెండు… మీరొచ్చిన లగ్గాలకు ముద్దులు పెట్టనీయనులే అన్నాడు… మూతికి మీసం కూడా సరిగ్గా రాని చిన్న పిల్లలు భుజాన వీడియో కెమరా పట్టుకొని, తైల సంస్కారం లేని జుట్టు, రెండు మూడు రోజులుగా స్నానం లేకుండా, చెమటలు తడిసి అట్టలు కట్టిన జీన్స్ ప్యాంట్ తో మండపం అంతా కలియ తిరిగి…
ఎంతో కొంత అనుభవం, వయసులో పెద్ద అని కూడా చూడకుండా పురోహితులను ఏక వచనంతో పక్కకు జరుగు అనుడు, తొక్కుకుంట బోవుడు … చికాకుగా ఉంది… ప్రతి పెళ్లిలోనూ ఇదే తంతు… శాస్త్రీయ తంతు ఎవడికీ పట్టదు… ఫోటోలు, వీడియోలు, ఫోజులు… అసలు జరిగే తంతును ఫోటోలు, వీడియోలు తీయాలి, అది ఒరిజనల్, నేచురల్…
మరి ఇదేంటి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లే పెళ్లిళ్లు జరిపిస్తుంటే, అదీ కృతకంగా… అందరూ దాన్నే ఆమోదిస్తుంటే… మరి నేను జరిపింతే తంతుకు విలువ ఏమున్నట్టు..? విలువ లేని పని నేనెందుకు చేయాలి…? అప్పుడే అనుకున్నాను, ఇక పెళ్లిళ్లకు పంతులుగా వెళ్లకూడదు అని… రోజురోజుకూ అది బలపడి, ఇక మనసు మొరాయిస్తోంది…
ఆత్మను చంపుకోవడం అవసరమా..? ఎవడు బతకలేక..? పెన్షన్ వస్తుంది… చిన్నతనంలోనే, అంటే పదిహేనో ఏట ఉపనయనం చేసుకున్నా… టెన్త్ చదువుతూనే పౌరోహిత్యంలోకి అడుగుపెట్టాను… సుమారు యాభై రెండేండ్లపాటు వందలాది శుభ, అశుభ, వైదిక కార్యక్రమాలూ చేసాను… రాత్రి సందె లగ్నాలు.. కాగడాల వెలుతురులో చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి…
సాధారణంగా ఆపరం చేసేవారు శుభకార్యాలు చేయరు… యజమానులు ఒప్పుకోరు… కానీ గ్రామీణ ప్రాంతాలలో పురోహితుల కొరత మూలాన రెండూ చేస్తున్నాను… ఈ మధ్య కాలంలో ఫోటోగ్రాఫర్లే పంతుళ్లు కదా… మమ్మల్ని పక్కకు తోసి మరీ మండపం అపవిత్రం చేస్తున్నారు… అవును, మేం మెల్లిగా ఇక పక్కకు తొలగిపోవాల్సిన రోజులు వచ్చినట్టే కనిపిస్తోంది…
దినాలు చేసేటప్పుడు బూడిది ఎత్తి పోసేటప్పుడు గంగెడ్ల వాళ్ళు అడిగినన్ని పైసలు ఇవ్వకపోతే కాష్టంలోని బూడిద కుప్పపై పడుకొని వసూలు చేస్తారు… అలాగే జిలకర బెల్లం పెట్టేటపుడు పోలు మీద ఫోటోగ్రాఫర్ వెల్లకిలా పడుకొని, పిల్ల పిలగాని ముక్కులో వెంట్రుకలు కనిపించే విధoగా ఫోటోలు తీస్తున్నారు… ప్రివెడ్డింగ్ పైత్యాల గురించి ప్రస్తావించడం అనవసరం ఇక…
మంగళస్నానాలు, పసుపులు దంచడాలు, రిసెప్షన్లు, సత్యనారాయణవ్రతం… సంగీత్, హల్దీ, బ్యాచ్‌లర్ పార్టీ… అన్నీ చేయించేది వాళ్లే… పెళ్లికి నిర్వాహకుల ఆర్థిక స్థోమతను బట్టి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంఖ్య పెరుగుతోంది… ఇప్పుడు డ్రోన్ షూట్స్ కామన్… సినిమాటిక్ వెడింగ్ వీడియోగ్రఫీ… కాస్ట్‌లీ, ట్రెండీ… యాభై ఏళ్ల నా పౌరోహిత్యానికి ఇక స్వస్తి పలికాను, నావల్ల కావడం లేదు… వశపడతలేదు…
నిజానికి కాష్టం దగ్గర కూర్చొని కర్మలు చేయడం ఇబ్బంది… ఎంతో పరిహారం చెల్లించుకోవాలి… మీకు ఈ రెండింటిలో ఏది ఇష్టమైంది, ఎందుకు అని అడిగితే… దినాలు చేయడమే ఇష్టం అని చెప్పాను…
ఎందుకంటే… అక్కడ ఫోటో, వీడియోగ్రాఫర్లు ఉండరు… కృతకమైన సినిమా ఫోజులు పెట్టేవాళ్లు ఉండరు కదా… ఇంకా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారివైతే, కర్తలు, పురోహితుడు, ఒకరిద్దరు సహాయకులు తప్ప ఎవరూ ఉండరు… హాయిగా, ఓపికగా, శ్రద్ధతో చేయించవచ్చని చెప్పాను…
ఇప్పుడు హాయిగా ఉంది… పెళ్లిళ్లు చేయించకపోతే డబ్బు రాదు, అంతే కదా… నో ప్రాబ్లం, ఇంకా ఇంకా నా మనసు చంపుకోలేను, వివాహ తంతును నా కళ్లముందే అపవిత్రం చేయలేను… ఫోటోగ్రాఫర్ల తప్పేముంది..? వాళ్లదీ మాలాగే కడుపు నింపుకునే వృత్తే కదా… కానీ దేనికైనా ఓ పద్ధతి అవసరం… అది లోపించినప్పుడు, వధూవరుల తల్లిదండ్రులు, బంధువులు కూడా శాస్త్రీయ తంతుకన్నా ఫోటోల తంతే ముఖ్యం అంటున్నప్పుడు… ఇక నాకు వేరే గత్యంతరం కనిపించలేదు…
చివరగా… నన్ను ఒకాయన అడిగాడు అయ్యగారూ, ఎనుకటి నుంచీ మీరు అవే మంత్రాలు చదువుతున్నారు కదా, బాల్య వివాహాలు చేసిన ఆ రోజుల్లో జీవితాంతం చివరిదాకా కలిసే ఉన్నారు దంపతులు…ఇప్పుడే ఎందుకు ఎక్కువ పెటాకులు అవుతున్నాయని…!
నాకు తెలిసి అప్పట్లో ఒకసారి మాంగల్యం కట్టేవాళ్లు కదా… ఒకసారే మెట్టెలు తొడిగేవాళ్లు… ఇప్పుడు ఒకసారి నేను పెట్టించాక, ఫోటోగ్రాఫర్ల సంఖ్య ఆధారంగా అన్నిసార్లు యాంగిల్ ఫోటోల కోసం మళ్లీ కడుతున్నారు, మళ్లీమళ్లీ మెట్టెలు తొడుగుతున్నారు కదా అన్నాను… అసలే కడుపులో మండుతోంది మరి..!! (ఇది కల్పన కాదు, వాస్తవమే… ఓ అయ్యవారి బాధే…)
Share this Article