Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లతమ్మా… ముందుగానే నీ చావువార్త రాసిపెట్టిన నికృష్టం నాది, క్షమించు…

February 6, 2022 by M S R

ప్రమాదస్థలికి వెళ్లే పోలీసులకు, మార్చురీ కాపలాదార్లకు, పోస్ట్‌మార్టం డాక్టర్లకు, పంచనామా అయ్యేవరకు శవం దగ్గర పడిగాపులు గాసే విలేజ్ సర్వెంట్లకు, ఉరితీసే తలార్లకు…. ఇలా చాలామందికి సున్నిత హృదయం ఉంటే తట్టుకోలేరు… మనసు వికలమైపోతున్నా సరే డ్యూటీ ముఖ్యం… సెంటిమెంట్ సూట్ కాదు… అలాగే జర్నలిస్టులకు కూడా…! ఇవి కూడా రాక్షస కొలువులు… ఎవరైనా ఐసీయూలో ఉన్నారని తెలిస్తే చాలు, ముందుగానే కథనాలు రాసి పెట్టుకుని, పిట్టకు పెట్టినట్టు వెయిట్ చేయడం… చావు కోసం ఎదురుచూపు…

బయటికి చెప్పుకోవడానికి బాగుండదు, కానీ డ్యూటీయేమో చేయకతప్పదోయ్ అంటుంది… ఏ మీడియా హౌజులోనైనా తప్పదు ఇది… ఫోటోలు, విశేషాలు, వీడియోలు రెడీ చేసుకుని, కథనాలు రాసుకుని, వీడియో ప్యాకేజీలు కూడా ఎడిటింగ్ చేసి రెడీ పెట్టుకుని… రెడీటుషూట్ అన్నట్టుగా ఉంచాలి… స్థూలంగా చూస్తే కొంత ఇన్‌హ్యూమన్ అనిపిస్తుంది… కానీ కొలువు కోణంలో తప్పేముంది..? తప్పేదేముంది..? అప్పటికప్పుడు అన్నీ సేకరించి, ఎడాపెడా కథనాల్ని కుమ్మేయలేం కదా… పత్రికల వాళ్లకు కాస్త నయం, టైం ఉంటుంది… కానీ సైట్లకు, టీవీలకు కాలంతో పరుగే కదా… వేరేవాళ్లతో పోటీ కదా…

టీన్యూస్ జర్నలిస్ట్ Ajay Kumar Kodam…   సోషల్ మీడియాలో రాసుకున్న ఓ పోస్టు అందుకే కనెక్టయింది… జర్నలిస్టులు కాదు, జర్నలిస్టులు కానివాళ్లు చదవాలి ఓసారి… ఇది అదే…

Ads



ఈ పాపాలగుప్తుడిని కమించు .. లతా దీదీ 😢 జర్నలిస్టు జీవితం తలారి కంటే క్రూరమైనది. తలారి ఐనా నయం.. ఉరిశిక్ష పడ్డ నిందితులకు చివరి క్షణంగా నిర్ణయించి సమయానికి.. తన పని తాను చేస్తాడు. కానీ .. జర్నలిస్టు బతుకు అంతకంటే దారుణం. రాబందులు కూడా చనిపోయిన శవాల కోసం వెదుక్కుంటాయి. కానీ జర్నలిస్టులది మాత్రం.. బతికున్నవాళ్లు ఎప్పుడు శవాలుగా మారుతారా అని పిశాచాల్లా ఎదురుచూసే దుస్థితిని విధిగా భావించే దౌర్భాగ్యం. అలాంటి చావుల కోసం తండ్లాడే చకోర స్థితిలోనే.. ఎందరో సెలెబ్రిటీలను, నాయకులను, ప్రముఖులను .. తొందరి పడి చంపేస్తుంటారు.

ఆ తర్వాత నిస్సిగ్గుగా .. అబ్బే అదంతా తూచ్‌ అని బ్రేకింగ్ న్యూస్‌లతో తుడిచేసుకుంటారు. కానీ.. మనస్సాక్షి ఇంకా కొసప్రాణంతో కొట్టుకుంటున్న కొందరికి మాత్రం చీ ఏంట్రా ఈ దరిద్రపు బతుకని .. హృదయం తరుక్కుపోతుంది. అలాంటి సందర్భాలు ఎదుర్కోని జర్నలిస్టు ఉండడు కావొచ్చు. నా జీవితంలోనూ ఇలాంటి అమానవీయ అనుభవాలు కొన్ని లేకపోలేదు. అలాంటి వాటిలో వాజ్ పేయి గురించి రాయాల్సిన సందర్భం చాలా వేదనకు గురిచేసింది. నిజానికి మీడియా సంస్థలు వాజ్‌ పేయిని ముందుగానే చంపేసి.. అక్షర రాక్షసాలతో కన్నీటి నివాళులు రాసి పెట్టుకొని రెండు మూడేళ్లు ఎదురుచూసాయి.

పాపం ఏం చేస్తారు వృత్తి ధర్మం అనుకున్నా.. గుండెల నిండా అభిమానం ఉన్నా సరే.. ఇదిగో పోయాడట… రేపు ప్రకటించేస్తారట అంటూ మాట్లాడుకుంటూ.. ఆ వార్తను ఎంత గొప్పగా చెప్పాలో ప్రణాళికలు వేసుకోవడం కంటే దుర్భరం ఏముంటది. నిజంగా ఆ బాధను అధిగమించేందుకు ఎన్ని పెగ్గులు రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తూ… మరెన్నో సిగరెట్లను దహనం చేయాలో… పొగచూరిన గుండెను ఉక్కిరిబిక్కిరి ఐతేగానీ.. ఆ తలపులను మస్తిష్కం నుంచి విదిలించుకోలేని బాధ.

నిన్న రాత్రి కూడా ఇదే దుర్మార్గమైన అనుభవాన్ని అనుభూతించాల్సిన శాపగ్రస్త తలరాత నాది. ఖర్మగాలి నైట్ షిఫ్ట్. పోగానే చిన్న సూచన. లతా మంగేష్కర్ పరిస్థితి విషమంగా ఉందట అని నోట్. షరామామూలుగా ఆమె పాటలతో ఓ అరగంట ప్రోగ్రాం రెడీ.. నువ్వు ముందస్తుగా ఓ ప్యాకేజీ రాస్కోమని. ఎక్కడో గుండెలో కలుక్కుమన్న బాధ. ఐనా.. జీతగత పనోళ్లం కదా. తప్పదు. కానీ, ఎక్కడో ఆలోచనలు స్తంభించిపోయాయి. మెదడు పతనావస్తలో .. సిగ్గులేదురా నీకు అని తిట్టిపోస్తున్న అనుభూతి.

93 ఏళ్ల పెద్దావిడ.. నెల రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నదని తెలుసు ఐనా సరే. ఆ అమరగాయని ఇకలేదు అన్న పదం టైప్ చేయాలంటే .. వేళ్లు మొరాయించాయి. మనస్సేమో నీకిదేమి ఖర్మరా నికృష్టుడా., ఆమె బతికి ఉండగానే ఆ పదం .. ఎలా ఊహిస్తున్నావని బూతులు తిట్టింది. ఐనా.. తప్పని పరిస్థితిలో .. ఆమె ప్రోఫైల్ రాసేశాను. ఎక్కడా ఆమె అనారోగ్యం గురించి కానీ.. ఆమె పరిస్థితి విషమం అని కానీ.. ఆమె ఇకలేరు అన్న మాటగానీ రాకుండా .. కాస్త మనిషి తత్వంతోనే రాయగలిగాను.

ఆ ప్యాకేజీని వాయిస్ కు ఇస్తున్నప్పుడు కూడా… ఆమెకు ఏమీ కాకుండా కోలుకొని ఇంటికి చేరుకోవాలనే కోరుకున్నా. ఆ ప్యాకేజీ ఎడిట్‌ ఐనా.. ఎప్పటికీ ప్లే కాకుండా అలా స్టేల్ అయిపోవాలని నా రాతకు నేనే శాపం పెట్టాను. తెల్లగా తెల్లారింది. లతా దీదీ గురించి ఎలాంటి నెగెటివ్ వార్త వినిపించలేదు. హాయిగా ఔట్ పంచ్ కొట్టి ఇంటికి చేరుకున్నాను.

కాస్త రిఫ్రెష్ అయ్యానో లేదో.. వాట్సప్ టింగ్ మంది. ఏంటా అని చూస్తే.. లతా నో మోర్ అన్న దరిద్రపు గొట్టు బ్రేకింగ్‌. ఒక్క క్షణం .. గుండె ఆగినంత బాధ. ఆ ప్యాకేజీ రాయకుండా ఉంటే బాగుండేది కదా అన్న పాపచింతన. ఏమో.. నా దిక్కుమాలిన రాత వల్లే .. ఈ దారుణం జరిగిందేమో అన్న దోషభావన. ఓరీ .. రాతల చిత్రగుప్తుడా .. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా అని.. అంతరాత్మ చెర్నాకోలతో చెడామడా బాదినట్టు విపరీతమైన ఆవేదన. సారీ .. లతా దీదీ. .. నీ స్వరానికి మరణం లేదు. నా పాపానికి నిష్కృతి లేదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions