Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోలీసులే కాపాడారు… పోలీసులే ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు!!

October 8, 2026 by M S R

.

ఒక సైకిల్‌ బెల్‌… నా ప్రాణాన్ని కాపాడింది …. 1990–91 ప్రాంతం. నేను అప్పట్లో ఆంధ్రభూమి స్ట్రింగర్‌గా పటాన్‌చెరూ పారిశ్రామిక ప్రాంతాన్ని కవర్ చేసేవాడిని. ఆ రోజుల్లో ఆ పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక సంఘాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉండేది. ఒకవైపు ఐఎన్‌టీయూసీ. మరోవైపు ఐఎఫ్‌టీయూ… ఇక్రిశాట్‌, ప్రతాప్‌ స్టీల్స్‌, పటోడియా స్పిన్నింగ్‌ మిల్‌, జిన్నారం ప్రాంతాల్లో కార్మిక సంఘాల మధ్య వివాదాలు ఉండేవి. నేను మాత్రం ఏ వర్గానికీ చెందినవాడిని కాదు. ఎవరి కార్యక్రమం జరిగినా, ఎవరి సమస్య వచ్చినా వార్తగా రాసేవాడిని.

పటోడియా ఎన్నికలకు ముందు ఐఎఫ్‌టీయూ బహిరంగ సభ పెట్టాలనుకుంది. పటాన్‌చెరు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సభ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. సభ మొదలైంది. పౌరహక్కుల నాయకులు బాలగోపాల్ తదితరులు మాట్లాడుతున్నారు. కొద్దిసేపటికే పోలీసులు సభలోకి వచ్చారు. మైక్‌ ఆపేశారు. సభను చెదరగొట్టారు.

Ads

ఆ విషయాన్ని యూనియన్ నాయకులు పటాన్చెరులోని తమ పార్టీ ఆఫీసుకు తెలియచేశారు… దీంతో పార్టీ కార్యకర్త ఒకరు press note తీసుకుని పటాన్చెరులో నన్ను కలిశారు.. సమస్య తీవ్రత అర్థం చేసుకున్న నేను ఆ రాత్రి బస్సెక్కి పటాన్‌చెరు నుంచి సికింద్రాబాద్‌లోని ఆంధ్రభూమి కార్యాలయానికి వెళ్లాను. జరిగిన విషయాన్ని డెస్క్‌కు ప్రకటన, వార్త ఇచ్చాను.. సీనియర్లు విషయం తీవ్రతను అర్థం చేసుకున్నారు.

నా భుజం తట్టి “వెళ్లిపో… ఇంటికి వెళ్లి పడుకో” అన్నారు. ఆర్‌సీపురం పోలీస్‌స్టేషన్‌ దగ్గర బస్సు దిగి సైకిల్‌ తీసుకున్నాను. హుడా కాలనీలోని మా ఇంటికి వెళ్ళడానికి.. ఆ రోజుల్లో ఆర్‌సీపురం పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే చాలామంది యువ కానిస్టేబుళ్లు నా వయసువాళ్లే. వాళ్లతో నాకు మంచి స్నేహం ఉండేది. నేను స్టేషన్‌లోకి వెళ్తే వాళ్లు నన్ను రిపోర్టర్‌గా మాత్రమే చూసేవారు కాదు. స్నేహితుడిలా పలకరించేవారు. నేను అధికారులతో మాట్లాడుతున్నప్పుడు మంచి నీళ్లు తీసుకొచ్చేవారు. స్టేషన్‌ గేటు బయట కలిస్తే అవన్నీ మర్చిపోయి సరదాగా మాట్లాడేవాళ్లం. టీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్లం.

ఆ రాత్రి కూడా అలాంటి స్నేహితుడే నా వెంట వచ్చాడు. మంజీరా పైప్‌లైన్‌ ప్రాంతం మీదుగా నేను సైకిల్‌పై వెళ్తుంటే వెనుక నుంచి సైకిల్‌ బెల్‌ వినిపించింది. తిరిగి చూస్తే రామచంద్రపురము పోలీస్‌స్టేషన్‌లోని నా స్నేహితుడైన కానిస్టేబుల్‌. అతను నాతో కలిసి గంగారం వరకు సైకిల్‌పై వచ్చాడు. దారిలో నాతో ఇలా అడిగాడు..

“పటాన్‌చెరు వెళ్లావా?” అని అడిగాడు. “వెళ్లా.” అతను కాసేపు మౌనంగా ఉన్నాడు. అక్కడ ఏదో జరిగింది… వాళ్ళ వార్తలు విషయంలో “జాగ్రత్తరా… పై ఆఫీసర్స్‌ నీ మీద కోపంగా ఉన్నారు. ఎవరికి లేనిది ఆ ఆంధ్రభూమిలోనే ఎక్కువగా బసిరెడ్డి వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటున్నారు” అని చెప్పాడు. పటాన్‌చెరు సీఐ నీ మీద గుర్రుగా ఉన్నాడు.. అక్కడి నుంచి పై అధికారులకు విషయం వెళ్తోందని కూడా చెప్పాడు. “జాగ్రత్తగా ఉండు” అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. అప్పుడు అతను చెప్పిన మాటలను నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇంటికి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోయాను.

journalist

మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు గంగారం పేపర్‌ పాయింట్‌కు వెళ్లాను… రోజు ఇక్కడే నేను పేపర్ బాయ్ గా పనిచేసేది.. ఆంధ్రభూమి బండిల్‌ తీసుకుని పేపర్‌ తెరిచాను. లోపలి పేజీల్లో మొదట నా వార్త కనిపించలేదు. తర్వాత నిరాశగా పేపర్ మూస్తూ ఉంటే ముందు పేజీలో కనిపించింది— “హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్.. సభను అడ్డుకున్న పోలీసులు”.

నా వార్త ముందు పేజీలో ఉంది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. డెక్కన్‌ క్రానికల్‌లో కూడా ఈ ఘటన ప్రముఖంగా వచ్చింది. పౌరహక్కుల నాయకుడు బాలగోపాల్‌ తదితరులు పాల్గొన్న విషయం, పోలీసుల తీరుపై వారి అభిప్రాయాలు కూడా వచ్చాయి. నా డేట్లైన్‌తో వార్త రావడం నాకు గర్వంగా అనిపించింది.

మధ్యాహ్నం ఆర్‌సీపురం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాను. నన్ను ప్రతిరోజూ ఆప్యాయంగా పలకరించే ఆ యువ కానిస్టేబుళ్లు ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నారు. ఇంతకుముందు నన్ను చూసి నీళ్లు తీసుకొచ్చే వాళ్లు, గేటు దగ్గర టీ తాగుతూ మాట్లాడే వాళ్లు ఆ రోజు మాత్రం నా వైపు చూడకుండా పక్కకు జరిగిపోయారు. అది నాకు అర్థం కాలేదు.

సీనియర్‌ ఎస్‌ఐ నియంతుల్లా ఖాన్‌ గారు కూడా సాధారణంగా నన్ను ఇష్టపడేవారు. నేను పలకరించాను. ఆయన పట్టించుకోకుండా ముఖం తిప్పుకున్నారు. సీఐ జబ్బార్‌ గారి గది నుంచి కోపంగా మాట్లాడుతున్న గొంతు వినిపించాయి. ఒక హోంగార్డు వచ్చి “అన్నా… మీరు బయటకు వెళ్లండి. మీకేం పని?” అన్నాడు. నేను బయటకు వచ్చాను.

అక్కడి నుంచి పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాను. సీఐ అంజయ్య బయటకు వచ్చారు. నన్ను కోపంగా చూశారు. మీసం సవరించుకుంటూ జీపులో సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం వైపు వెళ్లిపోయారు. నేను స్టేషన్‌లోకి వెళ్లాను. అక్కడ కూడా అందరూ నన్ను పరాయివాడిలా చూశారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సికింద్రాబాద్‌లోని ఆంధ్రభూమి కార్యాలయానికి వెళ్లాను. అక్కడ సీనియర్లకు విషయం చెప్పాను. వాళ్లు నవ్వుతూ “టెన్షన్‌ పడుతున్నావా?” అన్నారు.

హైకోర్టు ఈ వార్తను సీరియస్‌గా తీసుకుందని, హక్కుల సంఘాలు పిటిషన్‌ వేశాయని, ప్రభుత్వం కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. పటాన్‌చెరు సీఐపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. కార్మికులకు జరిగిన అన్యాయం… వారి ప్రకటనలో విషయం ఉండటముతో నిప్పు రగిలింది..

తిరిగి ఆర్‌సీపురం వచ్చి సైకిల్‌ తీసుకుని ఇంటికి వెళ్లాను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో జరుగుతుందన్న భావన వెంటాడింది.
మరుసటి రోజు మళ్లీ తెల్లవారుజామున గంగారం పేపర్‌ పాయింట్‌కు వెళ్లాను. ఈసారి పేపర్‌ తీసుకునే సమయంలో చేతులు కొద్దిగా వణికాయి. నా అన్న మురళి గమనించి “ఏమైందిరా?” అని అడిగాడు. “ఏమీ లేదన్నా” అన్నాను. ఆంధ్రభూమి రెండో పేజీ తెరిచాను. “పటాన్‌చెరు సీఐని సస్పెండ్ చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులు… ఎస్పీ పర్యవేక్షణలోపంపై ఆగ్రహం…” అంటూ పెద్ద వార్త. మా డెక్కన్ క్రానికల్ తో పాటు ఇతర ఇంగ్లిష్‌ పేపర్లలోనూ ఇదే అంశం ప్రముఖంగా వచ్చింది. అప్పుడే మొదటి రోజు జరిగిన సంఘటన ఎంత పెద్ద పరిణామానికి దారితీసిందో నాకు అర్థమైంది.

తర్వాత మధ్యాహ్నం ఇంటి నుంచి బయటపడి సైకిల్‌ను rc puram పోలీస్‌స్టేషన్‌ బయటే పెట్టి.. bus లో పటాన్‌చెరులోని సభ నిర్వాహకుల కార్యాలయానికి వెళ్లాను. నన్ను చూసిన వాళ్లు ఎంతో ఆనందంగా ముందుకొచ్చి కౌగిలించుకున్నారు. “నీ వార్త మా పోరాటానికి నైతిక బలం ఇచ్చింది” అన్నారు. నాకు పెద్దగా ఆనందము ఏమి కలగలేదు.. నా డ్యూటీ చేశా అంతే..

అక్కడి నుంచి పీజేఆర్ శిష్యుడు.. పటాన్చెరు ఎంపీపీ నందీశ్వర్‌గౌడ్‌ ఇంటికి వెళ్లాను. ఆయన ఐఎన్‌టీయూసీ కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తి. నన్ను చూసి మొదట కొద్దిగా ముఖం చిట్లించినా తర్వాత నవ్వుతూ “అన్నా… వాళ్లకు బాగా సపోర్ట్‌ చేశావుగా” అన్నారు. నేను నవ్వుతూ “అదేమీ లేదు… వాళ్ల సభ వాళ్లు చేసుకుంటే అయిపోయే దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేయించారు?” అన్నాను. అప్పుడే ఈ వ్యవహారం వెనుక కార్మిక సంఘాల పోటీ, ఎన్నికల నేపథ్యం ఎంత ఉందో నాకు అర్థమైంది.

కొన్ని రోజుల తర్వాత ఉదయం ఒక పిడుగులాంటి వార్త వచ్చింది. పటోడియా మిల్లులో రాత్రి కార్మికుల మధ్య జరిగిన ఘర్షణలో ఐఎన్‌టీయూసీకి చెందిన ఐదారు మంది చనిపోయారన్న సమాచారం. వెంటనే స్పిన్నింగ్ మిల్లుకు వెళ్లాను. మిల్లులో రక్త ప్రవాహం ఎర్రగా కనిపించింది. జిల్లా కలెక్టర్‌, అధికారులు, ఎస్పీ, జిల్లా– రాష్ట్ర స్థాయి విలేకరులు అక్కడికి వచ్చారు. నేను ఆ రోజు పెద్దగా వార్త రాయకుండా అక్కడి పరిస్థితులను గమనిస్తూ ఉన్నాను. ఏడుపులు… ఆర్తనాదాలు… కోపం… పీజేఆర్‌ కూడా అక్కడికి వచ్చి ఆవేదనతో “ప్రతీకారం తప్పదు” అన్నారు. ఆ దృశ్యాలు చూసి నేను ఇంటికి వచ్చి పడుకున్నాను.

మరుసటి రోజు పేపర్‌ పంచిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటి గేటు దగ్గర ఉన్న లెటర్‌బాక్స్‌ తెరిచాను. రెండు మూడు ప్రెస్‌నోట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఐఎఫ్‌టీయూ లెటర్‌హెడ్‌పై ఉంది. చదవడం మొదలుపెట్టగానే నా శరీరం వణికింది. ఆ ప్రెస్‌నోట్‌లో పటోడియా హత్యాకాండకు సంబంధించి ఐఎఫ్‌టీయూ నాయకత్వం పలు ఆరోపణలు చేసింది. అవి ఐఎఫ్‌టీయూ చేసిన ఆరోపణలు.

ఆ ప్రెస్‌నోట్‌ మొత్తాన్ని చదివి సాయంత్రం ఆంధ్రభూమి కార్యాలయానికి వెళ్లాను. మఫసిల్‌ డెస్క్‌ ఇన్‌చార్జి రంగారెడ్డి గారికి చూపించాను. ఆయన చదివి “రాసి ఇవ్వు” అన్నారు. నాకు భయం వేసింది. అయినా ఆ ప్రెస్‌నోట్‌లోని విషయాలను వార్తగా రాసి డెస్క్‌కు ఇచ్చాను. వార్త ప్రచురించే నిర్ణయం డెస్క్‌దే.

మరుసటి రోజు ఆంధ్రభూమిలో ప్రముఖంగా “మైసూరా… నీకిది తగునా…” అంటూ హెడ్డింగ్‌ వచ్చింది. పటోడియా హత్యాకాండకు జనార్దన్‌ కుయుక్తులే కారణమని ఐఎఫ్‌టీయూ ప్రెస్‌నోట్‌లో చేసిన ఆరోపణలు వార్తలో ఉన్నాయి. ఆ ఆరోపణలు నావి కావు. ఐఎఫ్‌టీయూ ఇచ్చిన ప్రెస్‌నోట్‌లో ఉన్నవి. నేను వాటిని వార్తగా డెస్క్‌కు ఇచ్చాను.

మరునాడే మా ఇంటి దగ్గర పొరుగింటి ల్యాండ్‌లైన్‌కు ఆఫీసు నుంచి ఫోన్‌ వచ్చింది. “వెంటనే ఆఫీసుకు రావాలి” అన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కార్యాలయానికి వెళ్లాను.

స్టేట్‌ బ్యూరోలో కాంగ్రెస్‌ బీట్‌ చూసే సురేందర్‌ గారు నన్ను చూసి తీవ్రంగా ఆగ్రహించారు. “నీ ఇష్టం వచ్చినట్లు రాస్తావా… మైసూరా.. పీజేఆర్‌ దొబ్బుతున్నారు.. ఎవడివిరా నువ్వు?” అన్నారు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను కొత్త రిపోర్టర్‌ను. పక్కనే ఉన్న రామకృష్ణ గారు కొంత కోపంగా, కొంత ప్రశాంతంగా “ఇలాంటి పెద్ద వార్తలు మాకు చెప్పాలిగా” అన్నారు. “సార్‌… నాకు తెలియదు. నేను కొత్త. డెస్క్‌కు ఇచ్చి వెళ్లిపోయాను” అన్నాను.

  • సురేందర్‌ గారు ఇంకా కోపంగా “వీడు రాస్తాడు… వాళ్లు పెడతారు… దొబ్బులు మనం తినాలి” అన్నారు. రామకృష్ణ గారు నన్ను చూసి “ప్రెస్‌నోట్‌ ఏమీ లేకుండా నువ్వే వార్త రాశావని పీజేఆర్‌ అంటున్నాడు. నిజమేనా?” అని అడిగారు. “సార్‌… ఇందులో నా సొంతం ఏమీ లేదు. ఇదిగోండి ప్రెస్‌నోట్‌” అని చూపించాను. ఇద్దరూ చదివారు. సురేందర్‌ గారు “అరె… అది ఎలా ఉంటే అలాగే రాస్తావా నువ్వు? ఏమి రిపోర్టర్‌విరా?” అన్నారు.

నేను డెస్క్‌కు ఇచ్చానని చెప్పాను. అప్పుడు మాఫసిల్‌ డెస్క్‌ ఇన్‌చార్జి రంగారెడ్డి గారు, మూర్తి గారు వచ్చారు. “అవును… వార్త మేమే వేశాం. ప్రభుత్వం కాదు అంటే స్టేట్‌ బ్యూరో వివరణ ఇవ్వండి. అంతే కానీ మా రిపోర్టర్‌ను ఇబ్బంది పెట్టవద్దు” అన్నారు. నన్ను తమతో తీసుకెళ్లారు. భుజంపై చెయ్యి వేసి “ఏమీ భయపడవద్దు. వెళ్లిపో” అన్నారు. నేను ఇంటికి వచ్చాను.

రెండు మూడు రోజులు బయటకు వెళ్లలేదు. రిపోర్టింగ్‌కు వెళ్లాలన్నా భయమే. అప్పటివరకు వార్త కోసం పరుగులు తీసిన నేను ఇంట్లోనే కూర్చున్నాను.

నాలుగో రోజు రాత్రి సుమారు తొమ్మిది గంటలు. ఇంటి బయట నుంచి సైకిల్‌ బెల్‌ వరుసగా వినిపించింది. బయటకు వచ్చాను. అదే నా పోలీసు స్నేహితుడు.
కొద్దిదూరం నాతో కలిసి నడిచాడు. అతని కళ్లలో నీళ్లు ఉన్నాయి.
“అన్నా… నువ్వు రెండు మూడు రోజులు ఇక్కడ ఉండవద్దు. ఇప్పుడే వెళ్లిపో” అన్నాడు.
నేను ఏమీ మాట్లాడలేదు.

అతను తనకు తెలిసిన సమాచారంగా నాకు చెప్పిన మాట— “నీ ఎన్‌కౌంటర్‌ ప్లాన్‌ అయ్యింది… ఐఎఫ్‌టీయూ కొరియర్‌ అని ముద్ర వేస్తున్నారు… మా పెద్దవాళ్లు… ప్రభుత్వం… అందరూ ఉన్నారు…” అని చెప్పాడు.
అతను ఏడుస్తున్నాడు.
“ఇది నా ఒక్కడి కబురు కాదు అన్నా… నీ మేలు కోరుకునే మా అందరిదీ” అన్నాడు.
నా చెయ్యి పట్టుకున్నాడు. నన్ను కౌగిలించుకున్నాడు. తర్వాత నెమ్మదిగా చీకట్లోకి వెళ్లిపోయాడు.

ఆ ఎన్‌కౌంటర్‌ నిజంగా ప్లాన్‌ అయిందా లేదా అన్నది నేను స్వయంగా నిర్ధారించుకోలేకపోయాను. కానీ ఆ రాత్రి ఒక పోలీసు కానిస్టేబుల్‌ తనకు తెలిసిన సమాచారంగా, తన ఆందోళనగా నాకు ఇచ్చిన హెచ్చరిక మాత్రం నా జీవితంలో చెరగని అనుభవంగా మిగిలిపోయింది.

ఇంట్లోకి వెళ్లాను. అమ్మను నిద్రలేపాను. నిజం చెప్పే ధైర్యం రాలేదు. “ఆఫీసులో పని ఉంది… రెండు రోజులు రాను” అని మాత్రమే చెప్పాను.
అమ్మకు తెలియదు… తన కొడుకు ఉద్యోగం కోసం కాదు… తన ప్రాణం గురించి వచ్చిన ఒక పోలీసు స్నేహితుడి హెచ్చరికను నమ్మి ఇంటి నుంచి బయలుదేరుతున్నాడని.
నేను బయలుదేరాను.

వెనుక చీకట్లో మెల్లగా మాయమవుతున్న ఆ సైకిల్‌ బెల్‌ మాత్రం నా చెవుల్లో చాలా కాలం మోగుతూనే ఉంది.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే… నన్ను భయపెట్టింది కూడా పోలీసులే. నన్ను స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లమన్నది కూడా పోలీసులే. నా మీద ఏదో జరుగుతోందని హెచ్చరించింది కూడా పోలీసులే.
కానీ ఆ రాత్రి నా ప్రాణం గురించి చెప్పి నన్ను ఇంటి నుంచి బయటకు పంపింది కూడా పోలీసులలోని ఒక మనిషే.

అందుకే నా జీవితంలో పోలీసులంటే ఒకే జ్ఞాపకం కాదు.
పోలీసులే నన్ను కాపాడారు… పోలీసులే నన్ను ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు.
మధ్యలో మాత్రం… ఒక సైకిల్‌ బెల్‌… నా ప్రాణాన్ని కాపాడింది. దివంగత జర్నలిస్ట్ నేత రామలింగారెడ్డి తదితరులు నా విషయంలో జోక్యం చేసుకోవడం… ఆందోళన చేయడంతో నా ఎన్కౌంటర్ కథకు బ్రేక్ పడింది.
మీ సత్తెన్న 9701538700

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోలీసులే కాపాడారు… పోలీసులే ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు!!
  • ఆ ఆశ్రమ సందర్శనకు కోహ్లీ 5 కోట్లు ఫీజు..? అదీ వ్యాపారమేనా..?
  • SIR – ఈ ఆందోళనల అసలు లక్ష్యం దేశంలో అశాంతి – కల్లోలం !!
  • నూకలు బాకీ ఉంటే… యముడే దిగొచ్చినా ప్రాణాలు తీయలేడు !!
  • బ్లడీ రోమియో – కాదు, బ్లడ్ రోమియో – మరో బ్లడీ ప్యారడైజ్ !!
  • నకిలీ బతుకులు … BRS సోషల్- ఫేక్ ప్రచారాలపై బిగ్‌టీవీ ఫైర్..!!
  • అవతలి వైపు వచ్చిన ప్రశ్న – ఎన్‌కౌంటర్ కథ తెలియదా? ఫీల్డ్‌కు కొత్తా..?
  • అచ్చం కరోనా పుట్టుకలాగే..? బయోవెపన్ తయారీ దశలో ప్రమాదం..?
  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions