.
ఘజియాబాద్ లోని ఓ కుటుంబం… అతడు వచ్చాడు… మీ బిడ్డను, గుర్తుపట్టలేదా… 30 ఏళ్ల క్రితం ఏడేళ్ల వయస్సులో ఎవడో నన్ను కిడ్నాప్ చేశాడు…
తరువాత వాడి నుంచి తప్పించుకున్నాను, దేశమంతా ఎటెటో తిరిగాను… మీడియా, సోషల్ మీడియా ద్వారా మన ఇంటి ఆచూకీ కనిపెట్టాను, వచ్చేశాను అన్నాడు…
Ads
వెంటనే బాబూ అని ఆ మహేశ్ బాబు సినిమాలోలాగా పెద్ద వదిన కౌగిలించుకుని తిండి తినిపించలేదు… నేను బెంజ్, నేను ప్లాస్మా అంటూ ఏ ఆడపిల్లా త్రిషలా వచ్చి హత్తుకోలేదు… కావచ్చు, వాడే వీడు కావచ్చు, సరే, వచ్చాడులే అనుకున్నారు కుటుంబసభ్యులు… మీడియాకు కూడా మస్తు ఎమోషనల్ సంగతులు చెప్పాడు… అందరూ అమాయకంగా రాసేసి సంతోషపడ్డారు…
కానీ ఏదో సందేహం… వాడి చూపు, వాడి భాష, వాడి మాట, వాడి బిహేవియరే ఏదో తేడాగా ఉంది… ఓ పెద్దాయన పోలీసులకు చెప్పాడు… ఏదో డౌట్ కొడుతోంది, కాస్త కనిపెట్టండి సార్ అనడిగాడు… పోలీసులు నిఘా వేశారు…
ఓసారి తీసుకుపోయి మర్యాద చేశారు… మరీ సీబీఐ ప్రకాష్ రాజ్‌లా ఇంకేమిటి పార్థూ సంగతులు అంటూ క్షమించేసి వదిలేయలేదు… ఆ మర్యాదలో సదరు పార్థుడు మొదట కథలు చెప్పాడు… నిజాలు చెప్పలేదు… పోలీసులు డీఎన్ఏ టెస్టు చేయించారు… దాంతో బయటపడిపోయింది యవ్వారం… అప్పుడు మర్యాద తీవ్రత పెంచారు…
తనది రాజస్థాన్… పేరు ఇంద్రరాజ్ అలియాస్ రాజ్ అలియాస్ భీమ్… తన తల్లి చనిపోయాక ఇలా ఇతరుల ఇళ్లల్లో అబద్ధాలు చెప్పి తలదాచుకుంటున్నాననీ, తిండి కోసం ప్రయాస అని మొదట్లో పోలీసులకు చెప్పాడు… ట్రీట్‌మెంట్ పద్ధతి మార్చాక నిజాలు చెప్పసాగాడు…
చిన్నప్పటి నుంచే దొంగతనాలు అలవాటు… బంధువులు, పరిచయస్తుల ఇళ్లల్లో చోరీలు చేస్తుంటే విసిగిపోయి కుటుంబసభ్యులు వాడిని బయటికి తరిమేశారు… 2005లో… అప్పటి నుంచి తన అసలు గుర్తింపును దాచిపెట్టి, ఎవరెవరి ఇళ్లల్లో పిల్లలు తప్పిపోయారో వాళ్ల వివరాలు తెలుసుకుని, ఇలా వచ్చేసేవాడు… ఏవో కథలు చెప్పేవాడు…
కనీసం తొమ్మిదిచోట్ల… ఎప్పుడో తప్పిపోయినవాడిగా ఇళ్లను చేరడం, నమ్మించడం, మంచిరోజు చూసి దోచుకుని పత్తా దొరక్కుండా పారిపోవడం… ఇదే తన మోడస్ ఆపరెండి… తను తొమ్మిది కుటుంబాలను మోసం చేసినట్టు అంగీకరించాడు… ఐదు కుటుంబాల వివరాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు… స్టేట్‌మెంట్స్ తీసుకున్నారు…
2021లోనే ఓసారి పట్టుబడి జైలుకు కూడా వెళ్లొచ్చాడట… ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ మాత్రమే కాదు… పంజాబ్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, హర్యానాలోని హిసార్, సిర్సాలలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు అంటున్నారు… ఇంకా చాలా కుటుంబాలను ఇలాగే మోసగించినట్టు అనుమానించి, ‘‘దర్యాప్తు’’ చేస్తున్నారు…
తనకే గుర్తులేవట… ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక పోలీసు టీమ్స్ పంపించి… కేసు బలంగా నిర్మిస్తున్నారు… అవునూ, ఏం కేసులు పెట్టగలరు…? ప్రస్తుతానికి మోసం అనే సెక్షన్ మాత్రమే పెట్టారు… మొత్తం వివరాలన్నీ తేలాక ఏమేం సెక్షన్లు పెడతారో చూడాలిక..!! ఏమాటకామాట… ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు జస్ట్, ఆస్తుల మీదే కన్నేశాడుట… ఇంకేం అఘాయిత్యాల జోలికి వెళ్లలేదట…!!
Share this Article