నా జీవితంలో చేసిన పెద్ద తప్పు… పెళ్లి చేసుకోవడం..! ఆ క్షణానే నా కలలన్నీ కుప్పకూలడం మొదలైంది… నిజానికి నేను జీవితంలో పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకునేదాన్ని… దానికోసం కష్టపడి చదివాను కూడా… ఎప్పుడైతే నాన్న జబ్బు పడ్డాడో, సంపాదన ఆగిపోయిందో మా కుటుంబానికి షాక్ తగిలినట్టయింది…
ఓ సంవత్సరం గడిచాక ఇక బిడ్డ పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుంది అనుకున్నారు నా పేరెంట్స్… పెద్ద కుటుంబం కావాలని సంబంధాలు వెతికారు… తామున్నా లేకపోయినా బిడ్డ బాగా బతకాలని వాళ్ల ఆశ… పెళ్లయింది… కొన్నాళ్లకే నా భర్తకు వేరే మహిళతో సంబంధాలున్నట్టు నాకు అర్థమైంది… అదే అడిగాను…
‘‘కుటుంబం గట్టిగా అడిగితే, వాళ్ల కోసం నిన్ను చేసుకోకతప్పలేదు… మరి నన్నేం చేయమంటావు..?’’ ఇదీ జవాబు… ఆ తరువాత అప్పుడప్పుడూ శారీరిక కలయిక తప్ప ఎప్పుడూ భార్యాభర్తల అనుబంధం అనేది పెరగలేదు… నేను గర్భం దాల్చాను… తను మారతాడేమో అనుకున్నాను… లేదు… పైగా ‘ఇది నా బిడ్డే కాదు’ అన్నాడు… నేను తిరిగి వాదిస్తే కొట్టేవాడు…
Ads
డెలివరీ తరువాత అత్తింటికి వచ్చాను… నా భర్త అస్సలు పట్టించుకోలేదు… తన తిరుగుళ్లు తనవి… కానీ పుట్టింది మగబిడ్డ అని తెలిసి ‘‘నా కొడుకును ఓసారి చూస్తాను’’ అంటూ ఓసారి వచ్చాడు… ఒకే ఒక్కసారి నా కొడుకును ముట్టుకున్నాడు… ముద్దు పెట్టుకున్నాడు… అంతే… అప్పుడు వెళ్లిపోయి మళ్లీ రాలేదు… చూశాను చూశాను… వచ్చేశాను పుట్టింటికి… త్వరలోనే విడాకులు కూడా మంజూరయ్యాయి…
ఆ తరువాత నాన్నకు చెప్పాను… ‘‘నా కాళ్ల మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను నాన్నా’’… అప్పటికి నేను టైలరింగ్ స్టార్ట్ చేశాను… ఓ కస్టమర్ అన్నాడు… ‘‘నువ్వు డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవద్దు…’’ నాలో ఓ కొత్త ఆలోచన మొదలైంది… కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి…
జస్ట్, మూడే నెలల్లో డ్రైవింగ్ నేర్చేసుకున్నాను… తరువాత డ్రైవర్‌గా కొలువు దొరికింది… కొన్నేళ్లు ఇలాగే గడిచింది జీవితం… నా కుటుంబం, నా కొడుకు, నా అవసరాలు తీరుతున్నాయి… నా చెల్లెల్ని చదివించాను… ఇల్లు కట్టుకునేందుకు సాయం చేశాను… నా కొడుకును మంచి స్కూళ్లో వేశాను… వాడు నా కొంగు పట్టుకుని మమ్మీ మమ్మీ అని తిరుగుతుంటే జీవితం సాఫీగా గడిచిపోతున్నట్టు అనిపించింది… వాడి మొహంలో నవ్వు నన్ను నడిపిస్తోంది…
కానీ కోవిడ్ ప్రబలిన వేళ పరిస్థితులు దిగజారాయి… ఒకరికి పర్సనల్ డ్రైవర్‌గా ఉండేదాన్ని కదా, ఆ కొలువు ఊడింది… ట్యాక్సీ తోలడం స్టార్ట్ చేశాను… ఓరోజు ఓ తాగుబోతు ప్యాసింజర్ నేరుగా నేను కావాలని అడిగాడు… స్టన్నయ్యాను… కారు ఆపాను… దిగమన్నాను… ట్యాక్సీ ఓనర్‌కు కాల్ చేస్తే లైట్ తీసుకున్నాడు… ‘వాడి దగ్గర ట్యాక్సీ ఫేర్ తీసుకోవడం మరిచిపోకు’ అన్నాడు… ఛీ అనిపించింది… ఆ క్షణమే ఆ జాబ్ వదిలేశాను…
మూడు నెలలు గడిచిపోయాయి… ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను… కానీ ఎన్నాళ్లు..? బయటికి వెళ్లి మళ్లీ డ్రైవింగ్ చేయాలంటే భయమవుతోంది… ఓ ఫ్రెండ్ బ్లూస్మార్ట్ అనే ట్యాక్సీ సర్వీస్ గురించి చెప్పింది… అది ఢిల్లీ, పరిసరాల్లో నడిచే ట్యాక్సీ సర్వీస్…
అది కాస్త బెటర్ అన్నారు… సేఫ్… ప్రయత్నిద్దాం అనుకున్నాను… చేరిపోయాను… బాగానే ఉంది… రెండేళ్లయింది ఈ కొత్త ఏజెన్సీలో చేరి… గతంకన్నా బాగానే ఉంది… ఓసారి జర్నీ మధ్యలో కారు బ్రేక్ డౌన్… కంపెనీ హెల్ప్ సెంటర్‌కు కాల్ చేశాను… వెంటనే అటెండయ్యారు… మళ్లీ నేను ఇంటికి చేరుకునేదాకా ఫోన్లు చేస్తూ కనుక్కున్నారు… పర్లేదు, ఈ కంపెనీకి కాస్త బాధ్యత తెలిసినట్టుంది…
జీవితం నాకు విసిరిన సవాళ్లన్నింటినీ ఎదుర్కున్నాను… కష్టాల కాలం దాటేసి వచ్చినందుకు హేపీగా ఉంది… ఇప్పుడు నాకు ఓ కొలువు ఉంది… నా కుటుంబానికి ఓ సొంత ఇల్లుంది… నా చెల్లెలు పెళ్లి చేశాను… నా పేరెంట్స్ ఆరోగ్య ఖర్చులన్నీ భరించగలుగుతున్నాను… నా కొడుకు చదువు సరేసరి… ఈ దశ చేరడానికి చాలా గాయాలు భరించాల్సి వచ్చింది… పర్లేదు, అవన్నీ నా యుద్దపు గుర్తులే అని గర్వంగా భావిస్తాను…
Share this Article