‘‘ఒక ఊరికి సర్పంచ్ కావడం అనేది ఎప్పుడూ నా ప్రణాళికల్లో లేదు, ఊహల్లో లేదు… పెద్దదాన్నయ్యాక నీ లైఫ్ అంతా పలు నగరాల మధ్య చక్కర్లు కొట్టడానికే సరిపోయింది… చిన్నప్పుడు మా ఊరు సోడా (రాజస్థాన్, జైపూర్‌కు 60 కిలోమీటర్లు)లో బామ్మ, తాతలతో ఆడుకునేదాన్ని… రోజంతా ఆటలే… గ్రామస్థులు కూడా తరచూ తమ భుజాల మీద నన్ను ఎక్కించుకుని ఊళ్లో తిప్పేవారు…
30 ఏళ్లు గడిచిపోయాక ఓరోజు అకస్మాత్తుగా నన్ను సర్పంచ్ గా పోటీచేయించాలంటూ గ్రామస్థులు నాన్నను అడిగారు…అది 2009వ సంవత్సరం… నా ప్రైవేటు జాబ్ అటు తిప్పీ ఇటు తిప్పీ తిరిగి నా ఊరికే తీసుకొచ్చేట్టుంది… నాన్న ఒకేమాటన్నాడు వారితో… ‘‘ఆమె నిర్ణయాల్ని నేను తీసుకోను… ఆమెనే అడగండి…’’
ఇది జరిగిన కొన్నిరోజులకే నేను వాళ్లతో భేటీ అయ్యాను… అసలు నేను ఈ మీటింగులు గట్రా ఆర్గనైజ్ చేయగలనా..? కనీసం ఫేస్ చేయగలనా..? అసలే నా షెడ్యూల్ బిజీగా ఉంది… కానీ ఊళ్లోని సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయని నాకు తెలుస్తోంది… మొత్తం పది వేల మంది ఉంటున్న ఊరు… ఎప్పుడు చూసినా కరువు… కలుషితమైన నీరు… కరెంటు లేదు… ఉండీ లేనట్టున్న రోడ్లు… స్కూల్స్ గురించి చెప్పనక్కర్లేదు… ఊళ్లో దారిద్ర్యం పెరుగుతోంది…
Ads
నేనేదో చేయగలనని వాళ్లు చూపిస్తున్న నమ్మకాన్ని దెబ్బతీసే ఉద్దేశం లేదు నాకు… పోటీచేయాలనే నిర్ణయించాను… ఏమో, ఈ నిర్ణయం నన్ను ఎటువైపు తీసుకెళ్తుందో… ఆ ఊరి మాజీ సర్పంచ్ భార్య మీద 2010లో గెలిచాను… ఆ ఊరికి నేనే తొలి మహిళా సర్పంచ్… నేను ప్రచారం చేస్తున్నప్పుడు ఓ ముసలామె ధైర్యం చెప్పింది… ‘‘మగాళ్లు ఒకే కోణంలో… అంటే ఒకే కంటితో విషయాల్ని చూస్తారు… మహిళలు రెండు వైపులా చూడగలరు… అది మన అలవాటు… ధైర్యం ముందుకు వెళ్లు…’’
మా పంచాయతీలో మొత్తం 12 మందిమి… అందులో 8 మంది స్త్రీలే… తొలి మీటింగులోనే వాళ్ల భర్తలు వచ్చి మీటింగులో వాళ్ల తరఫున కూర్చున్నారు… చిరాకేసింది… ‘‘మీరు కూర్చున్నా సరే, నేను కౌంట్‌లోకి తీసుకోను… ఎన్నికైనవారే రావాలి… ఏం, నిర్ణయాలు తీసుకోలేరా వాళ్లు..? అలాంటప్పుడు పోటీలో ఎందుకు నిలబెట్టారు..?’’ అనడిగాను… ఇదిలాగే ఉంటే మీటింగు జరగదు అని చెప్పాను… గంట సేపట్లో అందరూ వచ్చేశారు… నా వేషధారణ ఏమీ మార్చుకోలేదు… అదే జీన్స్, అదే షర్ట్ లేకపోతే మోడరన్ డ్రెస్… ఎవరూ నా మీద కామెంట్లు కూడా చేయలేదు…
నాకు బాగా నచ్చింది ఏమిటంటే..? ఆ భార్యల భర్తలు నెగెటివ్‌గా ఏమీ తీసుకోలేదు… పెత్తనాలు చేయడానికి ప్రయత్నించలేదు… ఒక భర్త నవ్వుతూ అన్నాడిలా… ‘‘నాకేమీ ఇబ్బంది లేదు, చిన్నతనం లేదు… ఆజ్ ఘర్‌కా ఖానా మై బనా లూంగా, ఆప్ లోగ్ ఆరామ్ సే కామ్ కీజియే… (నేను రొట్టెలు చేస్తాను ఇవ్వాళ… మీరు తీరికగా పనులు చక్కబెట్టుకొండి’’… మైండ్ సెట్లు మారడం కాదు ఇది… మా ఊళ్లో అలాంటి ఫాల్స్ ప్రిస్టేజీలు ఏమీ చూపించలేదు మొగుళ్లు…
ఏం పని చేశామంటారా..? దాదాపు 40 వరకూ అంతర్గత రోడ్లు వేశాం… కరెంటు తీసుకొచ్చాం… 24 గంటల సప్లయ్… ఫ్యామిలీ ప్లానింగ్‌ను దాదాపు నిర్బంధం చేశాం… బాల్యవివాహాలకు శిక్షలు, జరిమానాలు వేశాం… బాలిక విద్యను ఎంకరేజ్ చేశాం… ఊళ్లో చాలా ఉమ్మడి టాయిలెట్లు కట్టాం… ఒక బ్యాంకు శాఖను తీసుకొచ్చాం… హెల్త్ క్యాంపులు పెట్టాం… ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే… ఫస్ట్ టరమ్ అయిపోయింది… డౌటేముంది..? 2015లో నన్ను మళ్లీ ఎన్నుకున్నారు…
ఒక దశాబ్దం… నా ఊరికి, నా ఇంటికి సేవ చేశారు… చాలా సవాళ్లు ఎదురయ్యేవి… ప్రభుత్వం అడగ్గానే డబ్బులు ఇచ్చేది కాదు, పనులు మంజూరీ చేసేది కాదు… చాలాసార్లు ఆర్థిక సమస్యలే ఎదురయ్యేవి… ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి కదా… ప్రైవేటు సెక్టార్ కూడా సహకరించేది కాదు… అడిగీ అడిగీ ఊహూ అనిపించుకున్నాను… ఇవన్నీ చూస్తున్న నా కుటుంబం, దోస్తులు, గ్రామస్థులు అర్థం చేసుకున్నారు, నా వెంట నిలిచారు… మెల్లిమెల్లిగా మీడియా సపోర్ట్ తీసుకున్నాను… దాంతో ప్రభుత్వం, ప్రైవేటు సెక్టార్ల నుంచి కాస్త సహకారం స్టార్టయింది…
ఇప్పుడు నేను ఓ భిన్నమైన మార్పు తీసుకురాగలిగాను, అదీ నాకు ఆనందం… నా ఊరి గురించి మాత్రమే కాదు, నా గురించి సక్సెస్ స్టోరీలు మీడియాలో చదివి, ఇంకాస్త మంది తమ ఊళ్లకు తిరిగి వెళ్తున్నట్టు నాకు సమాచారం పంపించారు… వావ్… చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని ఎంతవరకైనా చదివిస్తామనే సంకల్పాన్ని చెప్పేవారు నాతో… ఓహ్, నేను ఏమో అనుకున్నాను గానీ చాలా చేశానన్నమాట… అన్నింటికన్నా నా కంట్లో నీళ్లు తీసుకొచ్చే మాటలూ వింటుంటాను… ‘‘అమ్మా, మా అమ్మాయికి నీ ఛావి అనే పేరు పెట్టుకున్నాం…’’ ఇంతకుమించి నాకేం కావాలి..? చెప్పనే లేదు కదూ… నా పూర్తి పేరు ఛావి రాజావత్…!!
Share this Article